‘అన్నదాత సుఖీభవ’లో కోత | Chandrababu govt is deceiving farmers in implementation of Annadata Sukhibhava scheme | Sakshi
Sakshi News home page

‘అన్నదాత సుఖీభవ’లో కోత

Feb 25 2026 5:37 AM | Updated on Feb 25 2026 5:37 AM

Chandrababu govt is deceiving farmers in implementation of Annadata Sukhibhava scheme

చంద్రబాబు ప్రభుత్వంలో ‘అన్నదాత సుఖీభవ’ కింద 46.86 లక్షల మందికే సాయం 

వైఎస్‌ జగన్‌ పాలనలో 2023–24లో 53.18 లక్షల మందికి ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ జమ 

శాసనసభ సాక్షిగా వెల్లడించిన ప్రభుత్వం 

చంద్రబాబు సర్కారు వచ్చాక తొలి ఏడాది ‘అన్నదాత సుఖీభవ’కు ఎగనామం 

రెండో ఏడాది రెండు విడతల్లో రూ.5 వేల చొప్పున రూ.4,685.84 కోట్లు మాత్రమే చెల్లింపు 

కానీ, రూ.8,862.89 కోట్లు విడుదల చేసినట్టు అసెంబ్లీలో అడ్డగోలుగా ప్రభుత్వం ప్రకటన  

‘అన్నదాత సుఖీభవ’పై వైఎస్సార్‌సీపీ సభ్యుల ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన ప్రభుత్వం 

మొత్తంగా రెండేళ్లలో ఒక్కో రైతుకు రూ.30 వేలు ఎగ్గొట్టిన బాబు సర్కారు 

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలులో రైతులను నిలువునా మోసంచేస్తోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం హయాంలో ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ కింద లబ్దిపొందిన రైతులతో పోలిస్తే భారీగా కోత పెట్టింది. ఈ విషయం శాసనసభ సాక్షిగా ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో బట్టబయలైంది. పైగా తొలి ఏడాది ‘అన్నదాత సుఖీభవ’ను ఎగ్గొట్టడమే కాకుండా... రెండో ఏడాది రెండు విడతల్లో రూ.5వేల చొప్పున మాత్రమే చెల్లించింది. 

మూడో విడత అసలు ఇవ్వకుండానే నిధులు విడుదల చేసినట్టు ప్రకటించడం విస్మయాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చివరి ఏడాది 2023–24లో ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ కింద 53.18 లక్షల మందికి పెట్టుబడి సాయం అందించిందని ఈ ప్రభుత్వం ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సంఖ్య 46.86 లక్షలకు తగ్గినట్లు ప్రభుత్వం లిఖిత పూర్వక సమాధానంతో తేటతెల్లమైంది. 

మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్‌సీపీ సభ్యులు బి.విరూపాక్షి, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్‌ ‘అన్నదాత సుఖీభవ’ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాపై అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఇందులో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు దఫాల్లో రూ.4,685.84 కోట్లు మాత్రమే చెల్లించగా, శాసనసభకు ఇచ్చిన సమాధానంలో మాత్రం రూ.8,862.89 కోట్లు ఇచ్చినట్లు పేర్కొనడం గమనార్హం.  

ఒక్కో రైతుకు రూ.30వేలు ఎగనామం 
ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ‘అన్నదాత సుఖీభవ’ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది అన్నదాత సుఖీభవ ఊసే ఎత్తలేదు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయాలని నిలదీయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండో ఏడాది అన్నదాత సుఖీభవను అమలు చేశారు. అది కూడా రాష్ట్ర వాటా రూ.14 వేలు, పీఎం కిసాన్‌ కింద మరో రూ.6 వేలు కలిపి రూ.20 వేలు.. అంటూ చంద్రబాబు మాట మార్చారు. 

అయితే, గత ప్రభుత్వం హయాంలో లబ్ధి పొందిన రైతుల సంఖ్యతో పోలిస్తే 6.32 లక్షల మందికిపైగా రైతులను తగ్గించి అరకొరగా రెండు విడతల్లో రూ.5వేలు చొప్పున కేవలం రూ.4,685.84 కోట్లు మాత్రమే ఇచ్చింది. మొత్తంగా రెండేళ్లలో ఒక్కో రైతుకు రూ.30 వేలు చొప్పున చంద్రబాబు సర్కారు ఎగనామం పెట్టింది. మూడో విడత ఎప్పుడు జమ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం మాత్రం రాష్ట్రం వాటా రూ.4,685.84 కోట్లు, కేంద్రం వాటా రూ.4,177.05 కోట్లు కలిపి రూ.8,862.89 కోట్లు విడుదల చేసినట్టు అసెంబ్లీలో సమాధానం ఇవ్వడం విస్తుగొలుపుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement