రూ.2.7 కోట్ల జీతం.. జాబ్‌ వదిలేసిన 22 ఏళ్ల యువకుడు.. ఎందుకంటే.. | why 22 year old techie resigned 2 7 cr job left full details | Sakshi
Sakshi News home page

రూ.2.7 కోట్ల జీతం.. ఉద్యోగం వదిలేసిన 22 ఏళ్ల యువకుడు.. ఎందుకంటే..

Jan 12 2026 1:31 PM | Updated on Jan 12 2026 1:31 PM

why 22 year old techie resigned 2 7 cr job left full details

ప్రస్తుతం ఉన్న జాబ్‌ మార్కెట్‌లో రూ.కోట్లలో జీతం అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ, ఆ భారీ జీతం వెనుక ఉన్న పని ఒత్తిడి వ్యక్తి ప్రాథమిక స్వేచ్ఛను, సంతోషాన్ని హరిస్తే? సరిగ్గా ఇదే ఆలోచనతో, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న క్లూలీ (Kluly) అనే ఏఐ స్టార్టప్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (CMO) డేనియల్ మిన్ తన పదవికి రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏడాదికి ఏకంగా 3 లక్షల డాలర్లు (సుమారు రూ.2.7 కోట్లు) వేతనం ఉన్న కొలువును వదులుకుని ఆయన కంపెనీ నుంచి బయటకు వచ్చేశారు.

చిన్న వయస్సులోనే..

ప్రఖ్యాత వార్టన్ స్కూల్ నుంచి మార్కెటింగ్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసిన డేనియల్ మిన్ మే 2025లో తన 21వ ఏటనే క్లూలీలో చేరారు. మిన్ తన ప్రతిభతో తక్కువ కాలంలోనే కీలక బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆ విజయం వెనుక ఉన్న శ్రమ క్రమంగా అతని మానసిక స్థితిపై ప్రభావం చూపడం మొదలైందని తాను చెప్పారు.

రాజీనామా అనంతరం తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను షేర్ చేస్తూ మిన్ తన మనసులో మాటను పంచుకున్నారు. ‘కెరీర్ ప్రారంభంలో రోజుకు 12 గంటలు కష్టపడటం సహజమని నేను భావించాను. కానీ, కాలక్రమేణా ఆ ‘గ్రైండ్’(నిరంతర పని) నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. నా స్నేహితులతో కలిసి డిన్నర్ చేయడం లేదా నా సోదరుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం వంటి చిన్న చిన్న సంతోషాలను కూడా నేను కోల్పోయాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఎంతో ఉత్సాహంగా అనిపించిన పని, క్రమేణా భారంగా మారిందని, పని కాకుండా అసలు వేరే జీవితమే లేకుండా పోయిందని వెల్లడించారు.

సీఈఓ ముందే..

కంపెనీ సీఈఓ రాయ్ లీ తన పనితీరును గమనించి రాజీనామా గురించి అడిగినప్పుడు డేనియల్ మిన్ తన భావోద్వేగాలను దాచుకోలేకపోయారు. తన రాజీనామా నిర్ణయాన్ని చెబుతూ ఆయన సీఈఓ ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే, రాయ్ లీ ఎంతో సానుభూతితో స్పందించారని, ఉద్యోగం కంటే వ్యక్తిగత సంతోషమే ముఖ్యమని తనను ప్రోత్సహించారని మిన్ తెలిపారు. ‘తమ ఉద్యోగుల శ్రేయస్సును కోరుకునే ఇలాంటి బాస్ దొరకడం అదృష్టం’ అన్నారు.

సోషల్ మీడియా స్పందన

డబ్బు కంటే మానసిక ప్రశాంతత ముఖ్యం అని భావించి డేనియల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘గ్రైండ్ కల్చర్ పేరుతో యువతను శ్రమదోపిడీకి గురిచేయడం సరికాదు’ అని కొందరు కామెంట్‌ చేశారు. ‘మీ నిజాయితీకి హ్యాట్సాఫ్’ అంటూ కొందరు కామెంట్లతో మద్దతు తెలుపుతున్నారు. మొత్తానికి, కెరీర్ ప్రారంభంలోనే భారీ ప్యాకేజీని వదులుకుని డేనియల్ మిన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై మరోసారి చర్చకు దారితీసింది.

ఇదీ చదవండి: ముగిసిన ‘వైట్ కాలర్’ స్వర్ణయుగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement