ముగిసిన ‘వైట్ కాలర్’ స్వర్ణయుగం | Why Salaried Jobs Are Declining know the details | Sakshi
Sakshi News home page

ముగిసిన ‘వైట్ కాలర్’ స్వర్ణయుగం

Jan 12 2026 12:38 PM | Updated on Jan 12 2026 12:46 PM

Why Salaried Jobs Are Declining know the details

దశాబ్దాలుగా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఉద్యోగార్థులకు ఐటీ, ఫైనాన్స్, బీపీఓ రంగాల్లోని వైట్ కాలర్ కొలువులే ఆర్థిక భరోసాకు ఆధారాలుగా నిలుస్తున్నాయి. కానీ, ఆ స్వర్ణయుగం ఇప్పుడు ముగిసిందని ప్రముఖ ఆర్థిక నిపుణుడు, మార్సెల్లస్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు సౌరభ్ ముఖర్జీ హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు ఏటా 11 శాతం వృద్ధిని నమోదు చేసిన వైట్ కాలర్ ఉద్యోగాల మార్కెట్, ఇప్పుడు కేవలం 1 శాతం వృద్ధికి పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ పోడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో ఆయన భారతదేశ ఉద్యోగ భవిష్యత్తుపై విశ్లేషణ చేశారు.

ఆవిరవుతున్న ఆశలు

‘మారుతున్న సాంకేతిక పరిస్థితుల కారణంగా జీతం పొందే యుగం ముగిసింది. దశాబ్దాలుగా పట్టణ మధ్యతరగతి ప్రజలు తమ ఆర్థిక ఎదుగుదలకు స్థిరమైన కార్యాలయ ఉద్యోగాలుగా భావించే విభాగాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. టెక్ కంపెనీల్లో లే-ఆఫ్స్ (ఉద్యోగాల తొలగింపు), ఆటోమేషన్, కృత్రిమ మేధ (AI) విప్లవం కలిసి పాతకాలపు కొలువుల తీరును మార్చేస్తున్నాయి’ అన్నారు.

‘ఐటీ రంగంలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ కంపెనీలు ఏటా వేల సంఖ్యలో నియామకాలు చేపట్టేవి. కానీ ఇప్పుడు ఏఐ ద్వారా ఉత్పాదకత పెంచుకుంటూ, కొత్త నియామకాలను భారీగా తగ్గిస్తున్నాయి. ఎంట్రీ లెవల్ కోడింగ్, కస్టమర్ సపోర్ట్, అడ్మినిస్ట్రేటివ్ పనులు ఇప్పుడు సాఫ్ట్‌వేర్లే చేస్తున్నాయి. కేవలం టెక్ రంగమే కాదు.. ఫైనాన్స్, లీగల్, లాజిస్టిక్స్, మీడియా రంగాల్లో కూడా 2031 నాటికి ప్రస్తుతమున్న 25 శాతం ఉద్యోగాలు అదృశ్యమయ్యే ప్రమాదం ఉంది’ అని చెప్పారు.

విద్యార్థులకు వేక్-అప్ కాల్

ప్రస్తుత విద్యా విధానం, పాత కెరియర్‌ సూత్రాలను అంటిపెట్టుకున్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ముఖర్జీ హెచ్చరించారు. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం వేచి ఉండటం ఇప్పుడు ఒక జూదం లాంటిదని అభిప్రాయపడ్డారు. ‘మీరు ఆటోమేట్ చేయలేని నైపుణ్యాలను నేర్చుకోకపోతే, రోజురోజుకు తగ్గిపోతున్న ఈ జాబ్‌ మార్కెట్‌లో నిరుద్యోగులుగా మిగిలిపోతారు’ అని సౌరభ్ ముఖర్జీ తెలిపారు.

ఇప్పుడు ఏం చేయాలి?

మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు ఏం చేయాలో ముఖర్జీ కొన్ని సూచనలు చేశారు.

1. మానవ నైపుణ్యాలకు ప్రాధాన్యం: మెషీన్లు చేయలేని పనులైన సృజనాత్మకత, సమస్య పరిష్కారం, విమర్శనాత్మక ఆలోచన వంటి వాటిపై దృష్టి పెట్టాలి.

2. అడాప్టబిలిటీ: ఏఐ, మెషీన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి సాంకేతికతలను నేర్చుకోవడంతో పాటు వాటిని నిరంతరం అప్‌డేట్ చేసుకోవాలి.

3. ఇతర నైపుణ్యాలు: కేవలం రెజ్యూమ్ ఉంటే సరిపోదు. ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు, రియల్‌టైమ్‌ అనుభవం చాలా అవసరం.

4. నెట్‌వర్కింగ్: పరిశ్రమ నిపుణులతో కనెక్ట్ అవ్వడం ద్వారా మారుతున్న మార్కెట్ ట్రెండ్స్‌ను ముందే పసిగట్టాలి.

ఇదీ చదవండి: మీ డబ్బు - మీ నిర్ణయం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement