భారత ఆర్థిక భవిష్యత్తుకు పెన్షన్‌లు కీలకం | Why Pensions Matter More Than You Think for India Economic Future | Sakshi
Sakshi News home page

భారత ఆర్థిక భవిష్యత్తుకు పెన్షన్‌లు కీలకం

Feb 20 2026 8:29 AM | Updated on Feb 20 2026 9:51 AM

Why Pensions Matter More Than You Think for India Economic Future

భారతదేశ ఆర్థికాభివృద్ధి గురించి చర్చ వచ్చినప్పుడల్లా సాధారణంగా జీడీపీ వృద్ధి, తయారీ రంగం, మౌలిక సదుపాయాలు లేదా స్టార్టప్‌ల గురించి మాట్లాడుకుంటాం. కానీ, దేశ దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ణయించే అత్యంత కీలకమైన అంశం ‘పెన్షన్’ గురించి చాలా తక్కువగా చర్చిస్తాం. నేడు యువ భారత్‌గా ఉన్న మన దేశం భవిష్యత్తుల్లో వృద్ధాప్యం వైపు అడుగులు వేయాల్సిందే. ఈ తరుణంలో పెన్షన్లు కేవలం వ్యక్తిగత పొదుపు మాత్రమే కాదు, దేశ ఆర్థిక గమనానికి ఒక బలమైన పునాదిగా మారుతున్నాయి.

ప్రస్తుతం భారతదేశం యువ జనాభాతో ప్రపంచంలోనే ప్రత్యేక స్థానంలో ఉంది. పని చేసే వయస్సు గల జనాభా ఎక్కువగా ఉండటం వల్ల వినియోగం, పొదుపు, పెట్టుబడులు పెరుగుతున్నాయి. అయితే, ఈ అనుకూలత ఎల్లకాలం ఉండదు. కొన్ని సర్వేల ప్రకారం.. 2050 నాటికి భారతదేశంలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య సుమారు 32 కోట్లకు చేరుకోనుంది. గతంలో వృద్ధులకు కుటుంబాలే ఆసరాగా ఉండేవి. కానీ నేడు పెరుగుతున్న పట్టణీకరణ, ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం కారణంగా వృద్ధాప్యంలో ఆర్థిక స్వావలంబన తప్పనిసరి అవుతోంది.

అవగాహన పెరుగుతున్నా.. సన్నద్ధత కరవు

భారతీయులు రిటైర్మెంట్ ప్లానింగ్‌ను ముఖ్యమైనదిగా భావిస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం అందుకు వెనుకబడి ఉన్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. పీజీఐఎం ఇండియా రిటైర్మెంట్ రెడీనెస్ రిపోర్ట్ 2025 నివేదిక ప్రకారం, కేవలం 37% మంది భారతీయుల వద్ద మాత్రమే నిర్దిష్టమైన రిటైర్మెంట్ ప్లాన్ ఉంది. ఇది 2023లో ఉన్న 67% తో పోలిస్తే తగ్గింది. పట్టణ ప్రాంతాల్లోని 24% మంది భారతీయులు ఇప్పటివరకు రిటైర్మెంట్ కోసం రూపాయి కూడా పొదుపు చేయలేదు. కేవలం 11% మంది మాత్రమే తమ ప్రస్తుత పెట్టుబడులు భవిష్యత్తు అవసరాలకు సరిపోతాయని నమ్ముతున్నారు.

పెన్షన్ వ్యవస్థ: దేశ ఆర్థిక వ్యవస్థకు బలం

పెన్షన్లు కేవలం వ్యక్తిగత ప్రయోజనాలకే కాకుండా స్థూల ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని ఇస్తాయి. ఇవి దీర్ఘకాలిక పొదుపును ప్రోత్సహించడంతోపాటు ప్రభుత్వంపై భవిష్యత్తులో పడే సామాజిక భద్రతా వ్యయాన్ని తగ్గిస్తాయి.

దేశ పెన్షన్ నిర్మాణం

ఆర్గనైజ్డ్ సెక్టర్: ఈపీఎఫ్, ఈపీఎస్ ద్వారా ఉద్యోగులకు భద్రత.

నేషనల్ పెన్షన్ సిస్టమ్: తక్కువ ఖర్చు, పన్ను ప్రయోజనాలు, మార్కెట్ ఆధారిత రిటర్నులతో ఇది నేడు ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి పొందే వారికి ప్రధాన ఎంపికగా మారింది.

లైఫ్ ఇన్సూరెన్స్ రంగం: కేవలం పొదుపు చేయడమే కాకుండా పొదుపు చేసిన సొమ్మును జీవితాంతం వచ్చే యాన్యుటీ లేదా పెన్షన్‌గా మార్చడంలో బీమా కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి పెరుగుతున్న వైద్య ఖర్చుల నుంచి రక్షణ కల్పిస్తూ వృద్ధాప్యంలో గౌరవప్రదమైన జీవితాన్ని అందిస్తాయి.

అసంఘటిత రంగం: అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలు గిగ్ వర్కర్లు, రైతులు, చిరు వ్యాపారులకు అండగా నిలుస్తున్నాయి.

ఏం చేయాలంటే..

భారతదేశ శ్రామిక శక్తిలో కేవలం 15–25% మందికి మాత్రమే అధికారిక పెన్షన్ సౌకర్యం అందుతోంది. మెజారిటీ జనాభా ఇప్పటికీ సామాజిక భద్రతకు దూరంగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. భారతదేశం 2047 నాటికి వికసిత్ భారత్‌గా ఎదగాలంటే పెన్షన్ల పరిధిని విస్తరించడం అత్యవసరం. ఆర్థిక అక్షరాస్యతను పెంచడం ద్వారా, క్రమశిక్షణతో కూడిన పొదుపును ప్రోత్సహించడం ద్వారా మాత్రమే వృద్ధాప్యాన్ని ఒక రిస్క్ లాగా కాకుండా ఆర్థిక వృద్ధిలో భాగంగా మార్చుకోగలం. బలమైన పెన్షన్ వ్యవస్థ ఉన్నప్పుడే రేపటి భారతం ఆర్థికంగా మరింత పటిష్టంగా ఉంటుంది.

- కమల్‌ భరద్వాజ్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, బ్యాంకస్యూరెన్స్‌

ఇదీ చదవండి: ‘భారత్‌లో ఏఐ స్పీడ్‌ చూస్తే విస్మయం కలుగుతుంది’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement