దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఉన్న అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాన్ని మరో ఐదేళ్ల పాటు, అంటే 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
పథకం ముఖ్యాంశాలు.. తాజా నిర్ణయాలు
ఈ పొడిగింపు ద్వారా పథకం ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటమే కాకుండా క్షేత్రస్థాయిలో మరింత మందికి చేరువ చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. పథకం నిరంతరాయంగా సాగేందుకు అవసరమైన ‘గ్యాప్ ఫండింగ్’కు ప్రభుత్వ నిధుల మద్దతును కేంద్రం విస్తరించింది.
గ్రామీణ, అనధికారిక రంగాల్లోని కార్మికులకు ఈ పథకంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఈ పథకం కింద చేరిన వారు 60 ఏళ్ల వయసు తర్వాత తాము అందించిన సహకారం (Contribution) ఆధారంగా నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు గ్యారెంటీ పెన్షన్ పొందుతారు.
8.66 కోట్ల మంది నమోదు
మే 9, 2015న ప్రారంభమైన అటల్ పెన్షన్ యోజన భారత సామాజిక భద్రతా వ్యవస్థలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. అధికారిక పెన్షన్ సౌకర్యం లేని సామాన్యులను పెన్షన్ నిర్మాణంలో భాగస్వాములను చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. తాజా గణాంకాల ప్రకారం జనవరి 19, 2026 నాటికి ఈ పథకం కింద నమోదైన చందాదారుల సంఖ్య 8.66 కోట్లకు పైగా చేరింది.
ఎందుకు ఈ పొడిగింపు?
భారతదేశంలో మెజారిటీ కార్మికులు అసంఘటిత రంగంలోనే ఉన్నారు. వారికి వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయం ఉండేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని కేంద్రం పేర్కొంది. పథకం అమలును మరింత బలోపేతం చేయడం, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడం కోసం ప్రభుత్వ మద్దతు అవసరమని భావించి ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు.
అటల్ పెన్షన్ యోజన.. మరిన్ని వివరాలు
ఏపీవై అనేది భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక సామాజిక భద్రతా పథకం. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే వారు (ఉదాహరణకు: డ్రైవర్లు, తోపుడు బండ్ల వ్యాపారులు, కూలీలు) తమ వృద్ధాప్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి దీన్ని రూపొందించారు.
అర్హతలు
భారతీయ పౌరుడై ఉండాలి.
వయసు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తుదారునికి సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఉండాలి (ఆధార్ అనుసంధానం అవసరం).
అక్టోబర్ 1, 2022 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధన ప్రకారం ఆదాయపు పన్ను (Income Tax) చెల్లించే వారు ఈ పథకంలో చేరడానికి అనర్హులు.
సమకూరే పెన్షన్
చందాదారులు 60 ఏళ్లు నిండిన తర్వాత ఐదు రకాల పెన్షన్ మొత్తాల్లో ఒక దాన్ని ఎంచుకోవచ్చు. అందులో నెలకు రూ. 1,000, రూ.2,000, రూ.3,000, రూ.4,000 లేదా రూ.5,000 స్లాబ్‌లున్నాయి. చందాదారులు ఎంచుకున్న పెన్షన్ మొత్తం, పథకంలో చేరినప్పటి వయసును బట్టి తాము చెల్లించాల్సిన నెలవారీ ప్రీమియం మారుతుంది.
ప్రీమియం ఇలా..
మీరు ఎంత త్వరగా (తక్కువ వయసులో) చేరితే ప్రీమియం అంత తక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి.
ఉదాహరణకు: 18 ఏళ్ల వయసులో చేరి నెలకు రూ.1,000 పెన్షన్ కావాలనుకుంటే కేవలం రూ.42 చెల్లిస్తే సరిపోతుంది. అదే 40 ఏళ్ల వయసులో చేరితే రూ.291 చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం డబ్బు మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. నెలవారీ, మూడు నెలలకొకసారి లేదా ఆరు నెలలకొకసారి చెల్లించే వెసులుబాటు ఉంటుంది.
పథకం ప్రయోజనాలు
మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా ప్రభుత్వం కనీస పెన్షన్‌కు హామీ ఇస్తుంది.
చందాదారుడు మరణిస్తే అదే పెన్షన్ మొత్తం వారి జీవిత భాగస్వామికి అందుతుంది.
చందాదారుడు, వారి భాగస్వామి ఇద్దరూ మరణిస్తే మొత్తం పెన్షన్ ఫండ్‌ను నామినీకి అందజేస్తారు.
సెక్షన్ 80 సీసీడీ కింద చెల్లించిన ప్రీమియంపై పన్ను మినహాయింపు లభిస్తుంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
మీకు ఖాతా ఉన్న బ్యాంకును లేదా సమీపంలోని పోస్టాఫీసును సందర్శించి ఏపీవై (APY) దరఖాస్తు ఫారమ్ పూర్తి చేసి ఇవ్వాలి. చాలా బ్యాంకులు ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో ఈ పథకంలో చేరే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.
ఇదీ చదవండి: ‘చీఫ్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ’ నియామకం తప్పనిసరి


