Telangana: పెన్షన్ రూ 4 వేలకు పెంపు! | Telangana Govt Increase pension 1000 Rupes | Sakshi
Sakshi News home page

Telangana: పెన్షన్ రూ 4 వేలకు పెంపు!

Feb 28 2026 7:50 AM | Updated on Feb 28 2026 9:06 AM

Telangana Govt Increase pension 1000 Rupes

మంచిర్యాల: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పథకం పింఛన్‌ సొమ్మును మరో రూ.వెయ్యి పెంచనున్నట్లు తెలుస్తోంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో తీపి కబురు అందించనున్నట్లు తెలుస్తోంది. చేయూత పథకంలో భాగంగా దివ్యాంగులకు పింఛన్‌ రూ.3016 అందిస్తుండగా మరో వెయ్యి పెరిగే అవకాశం ఉంది. దీంతో రూ.4,016 పింఛన్‌ పొందే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

వృద్ధాప్య, వితంతు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు బీడీ వర్కర్లు, బీడీ టేకేదారులు, డయాలసిస్, హెచ్‌ఐవీ రోగులు, ఒంటరి మహిళలు పొందుతున్న పింఛన్‌ రూ.2016 నుంచి రూ.3016కు పెరుగనున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలోని 36,754 మంది వృద్ధులు, 11,454మంది దివ్యాంగులు, 38,798 వితంతువులు, 278 మంది నేత కార్మికులు, 869 మంది గీత కార్మికులు, 2,467 మంది ఒంటరి మహిళలు, 2,335 మంది బీడీవర్కర్లు, 268 ఫైలేరియా, 172 డయాలసిస్‌ వ్యాధిగ్రస్తులు, 15 మంది బీడీ టేకేదారులు మొత్తంగా 93,410 మందికి ప్రయోజనం కలుగనుంది. 

జిల్లాలో ప్రతీ నెల రూ.22.68 కోట్లు పింఛన్‌దారులకు అందుతోంది. కాగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా పింఛన్లు మంజూరు చేయలేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2022లో రాష్ట్రంలో ఎనిమిది లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేసింది. వాటినే కాంగ్రెస్‌ ప్రభుత్వం అందిస్తోంది. చాలామంది 57ఏళ్లు నిండిన వారు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కావడం లేదు. దీంతో ప్రభుత్వం కొత్త పింఛన్లు ఎప్పుడు మంజూరు చేస్తుందా అని దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement