సుబ్బిరామిరెడ్డి కూతురు పీఏనని నమ్మించి..! | banjara hills 2 crore fake gold biscuit jewellery scam | Sakshi
Sakshi News home page

సుబ్బిరామిరెడ్డి కూతురు పీఏనని నమ్మించి..!

Feb 28 2026 8:33 AM | Updated on Feb 28 2026 9:53 AM

banjara hills 2 crore fake gold biscuit jewellery scam

హైదరాబాద్: తాను టి.సుబ్బిరామిరెడ్డి కూతురు, సోషలైట్‌ పింకిరెడ్డి పీఏనని ఓ మహిళా ఆభరణాల వ్యాపారిని నమ్మించి కిలో మేలిమి బంగారు ఆభరణాలు తీసుకుని వాటికి బదులుగా కిలో నకిలీ బంగారం ముద్దను ఇచ్చిన నిందితుడిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. యూట్యూబ్‌లో చార్టెడ్‌ అకౌంటెంట్‌ ఆన్‌లైన్‌ పాఠాలు చెప్పే లెక్చరర్‌గా, యూట్యూబర్‌గా పేరొందిన శ్రీనాథ్‌ రాఠి అలియాస్‌ అంకిత్‌ (29) కాచిగూడలోని శ్రీకృష్ణా అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. ఈ నెల 13న మాదాపూర్‌లోని మైహోమ్‌ బుజాలో నివసించే పాలకుర్తి లక్ష్మీకావ్య (40)ని పరిచయం చేసుకున్నాడు. 

ఆమె బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–2లోని పార్క్‌ హయత్‌ హోటల్‌ ఎదురుగా స్వర్ణ కావ్యం జ్వువెలరీ ఆభరణాల షాపు యజమానురాలు. తాను పని చేస్తున్న మేడం వద్ద బంగారు బిస్కెట్లు  ఉన్నాయని, వాటిని మార్పిడి చేసుకుని ఆభరణాలు తీసుకుంటామంటూ లక్ష్మీకావ్యను నమ్మించాడు. ఇలా మూడుసార్లు లక్ష్మీకావ్య వద్ద నుంచి ఆమె నగల దుకాణంలో బంగారు ఆభరణాలు తీసుకుని అంతే విలువైన బంగారు బిస్కెట్లను ఇచ్చాడు. దీంతో ఆమె శ్రీనాథ్‌ రాఠిని నమ్మడం ప్రారంభించింది. ఈ నెల 25వ తేదీన శ్రీనాథ్‌ రాఠి తన అనుచరుడు కృష్ణను ఈ ఆభరణాల షాపునకు పంపించాడు. మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్‌ హోటల్‌లోనూ, సోమాజీగూడలోని పార్క్‌ హోటల్‌లోనూ, బంజారాహిల్స్‌లోని ది లీలా హోటల్‌లోనూ మూడుసార్లు ఆమె వద్ద మేలిమి బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. 

ఈ నెల 25న చివరగా రూ.2 కోట్లు విలువ చేసే కిలో బంగారు ఆభరణాలు తీసుకుని వాటి బదులుగా రాగిముద్దపై బంగారు పూత పూసి బంగారు బిస్కెట్‌గా నమ్మించి ఇచ్చాడు. ఆ తెల్లవారు ఆమె పరీక్షించగా అది నకిలీదని తేలింది. దీంతో నిందితుడిని కాంటాక్ట్‌ చేద్దామని ప్రయత్నించగా స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. తాను మోసపోయానని తెలుసుకున్న ఆధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.  విచారించగా నిందితుడు శ్రీనాథ్‌ రాఠిని సీసీఎస్‌ పోలీసులు గతంలో రూ.2.48 కోట్లు చార్టెడ్‌ అకౌంటెంట్లను చీటింగ్‌ చేసి వసూలు చేసి అరెస్టయ్యినట్లు తేలింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు శ్రీనాథ్‌ రాఠితో పాటు కృష్ణ, మనోజ్, పురుషోత్తం రాఠిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement