పెళ్లయిన ఐదు నెలలకే.. కానరాని లోకాలకు.. | young couple ends life in ysr district | Sakshi
Sakshi News home page

పెళ్లయిన ఐదు నెలలకే.. కానరాని లోకాలకు..

Feb 28 2026 9:21 AM | Updated on Feb 28 2026 9:25 AM

young couple ends life in ysr district

బ్రహ్మంగారిమఠం/బద్వేలు అర్బన్‌: వారు సామాజిక మాధ్యమం ద్వారా కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి 5 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. జీవితంపై ఎన్నో కలలు కన్నారు. అయితే విధి వక్రీకరించింది. దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా లారీ రూపంలో ఇరువురిని మృత్యువు కబళించింది. శుక్రవారం బద్వేలు – మైదుకూరు రహదారిలోని నందిపల్లె సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బద్వేలు పట్టణంలోని మార్తోమానగర్‌ సమీపంలో పాలూరు సుబ్రమణ్యం, లక్ష్మీదేవి దంపతులు నివసిస్తున్నారు. వీరికి గురప్ప, ప్రసాద్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడైన పాలూరు ప్రసాద్‌ (28) పట్టణంలోని నెల్లూరు రోడ్డులో గల ఓ మెకానిక్‌ షాపులో మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఇన్‌స్ర్ట్రాగామ్‌లో రెండేళ్ల క్రితం కాకినాడకు చెందిన కావ్య (26)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇరువురి పెద్దలను ఒప్పించి గతేడాది అక్టోబర్‌లో వివాహం చేసుకున్నారు. 

దైవదర్శనం వెళ్లి వస్తుండగా.. 
ఎన్నో ఆశలతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన ఆ యువజంట అన్యోన్యంగా జీవనం సాగిస్తుండే వారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ప్రసాద్, కావ్య బ్రహ్మంగారిమఠానికి దైవదర్శనానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో దొడ్ల డెయిరీ వద్ద ఐస్‌క్రీమ్‌ తిన్నారు. రోడ్డు దాటుకునేందుకు ద్విచక్ర వాహనంలో యూటర్న్‌ తీసుకుంటుండగా.. నెల్లూరు నుంచి బద్వేలు మీదుగా తాడిపత్రికి వెళుతున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ కింద పడిన ద్విచక్ర వాహనాన్ని కొద్దిదూరం ఈడ్చుకెళ్లడంతో.. ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగి దగ్ధమైంది. 

ఇంతలో చుట్టుపక్కల వారు గమనించి బి.మఠం పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని శివప్రసాద్‌ తెలిపారు. పెళ్లి చేసుకున్న 5 నెలలకే మృత్యువాత పడటంతో ప్రసాద్‌ కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. జీవితాంతం కలిసి ఉండాలని కన్న కలలు కల్లలుగా మారాయని విలపించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement