వైవియూ కాన్వకేషన్ 13కు వాయిదా
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం 11, 12, 13, 14 వ కాన్వొకేషన్ల నిర్వహణ తేదీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ గవర్నర్ కార్యాలయ సూచన మేరకు స్వల్ప మార్పు చేసినట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ తెలిపారు. ముందుగా మార్చి నెల 11వ తేదీ నిర్వహించాలనుకున్న కాన్వొకేషన్‌ను 13వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. ఈ కాన్వొకేషన్ కు హాజరయ్యేవారు మార్పును గమనించాలన్నారు.
కడప కార్పొరేషన్: తిరుపతిలోని ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్‌పీడీసీఎల్) కార్పొరేట్ కార్యాలయంలో మార్చి 4వ తేదీన ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ నియామకాలకై ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను సంప్రదించామని తెలియజేశారు. వివిధ ప్రైవేటు సంస్థల ద్వారా ఉద్యోగ నియామక ప్రక్రియకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాకు ప్రైవేటు సంస్థల ప్రతినిధులు హాజరై అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారన్నారు. 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ/ బి.టెక్, ఆపైన పాసైన అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కడప రూరల్: వైద్య, ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో శుక్రవారం స్ధానిక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్‌లో జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్స్‌గా పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించారు. జోన్–4 పరిధిలోని రాయలసీమ జిల్లాల్లో పనిచేస్తున్న మొత్తం 44 మందికి పదోన్నతులు కల్పించగా, 33 మంది పదోన్నతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య మాట్లాడుతూ నిబంధనల ప్రకారం పదోన్నతుల కౌన్సెలింగ్ చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగరత్నమ్మ, సూపరింటెండెంట్ వెంకటసుబ్బమ్మ, శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్స్ సుకేష్, వనీష, రవికుమార్, విశాల్ తదితరులు పాల్గొన్నారు.
మైదుకూరు: పంటల సాగులో వినూత్న పద్ధతులను అవలంబించి వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించిన ప్రొద్దుటూరుకు చెందిన ఉమ్మడి మహదేవరెడ్డి అనే రైతుకు ఐఏఆర్‌ఐ సంస్థ ‘ఇన్నోవేటివ్ ఫార్మర్’ అవార్డును అందజేసింది. రిటైర్డు వ్యాయామ ఉపాధ్యాయుడైన మహదేవరెడ్డి మైదుకూరు మండలం మిట్టమానుపల్లె వద్ద ఉన్న తన భూమిలో వరి తదితర పంటలేకాక ఉద్యాన పంటలు, పట్టు పరిశ్రమ, పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకం, పశు పోషణ వంటి విభిన్న రకాలుగా వ్యవసాయం, అనుబంధ ప్రక్రియల్లో కృషి చేశారు. మండలంలోని వనిపెంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో ఆయన పంటల సాగులో నాణ్యమైన అధిక దిగుబడులను సాధించారు. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం జరిగిన పూసా కృషి విజ్ఞాన్ మేళాలో మహదేవరెడ్డి కృషిని గుర్తించి ఐఏఆర్‌ఐ సంస్థ జాతీయ స్థాయి ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డుతో ఆయనను సత్కరించింది.
వైవియూ కాన్వకేషన్ 13కు వాయిదా


