ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి
కడప సెవెన్‌రోడ్స్: పారిశ్రామిక వనరులు పుష్కలంగా ఉన్న కడప జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం జాయింట్ కలెక్టర్ నిధి మీనా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి పరిశ్రమల ద్వారా విస్తృత ఉపాధి అవకాశాలను కల్పించేందుకు అన్ని అనుబంధ శాఖలు సమన్వయంతో కృషి చేయాలన్నారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా మొత్తం 18 శాఖలకు సంబంధించి 11,033 దరఖాస్తులు అందగా, వాటిలో ఇప్పటి వరకు 10,886 దరఖాస్తులకు అనుమతి ఇవ్వడం జరిగిందని, 10,836 దరఖాస్తులు పరిశీలనలో, 50 పరిశీలనకు సిద్ధంగా ఉన్నాయన్నారు. 88 దరఖాస్తులను వివిధ కారణాల వల్ల తిరస్కరించడం జరిగిందన్నారు. 59 దరఖాస్తులు పలు కారణాల వల్ల పెండింగ్‌లో ఉంచడం జరిగిందన్నారు. పారిశ్రామిక అభివృద్ధి పాలసీ ప్రకారం జిల్లాలో మొత్తం రూ. 3,53,98,514 ల మేర నిధుల విడుదలకు అనుమతినివ్వడం జరిగిందన్నారు. ఇందులో ఐడీపీ 2023–27 పాలసీ ప్రకారం ఎస్సీ కేటగిరి పలు యూనిట్లకు రూ. 1,17,12,829 లు. ఐడిపి 2024–29 పాలసీ ప్రకారం ఎస్సి కేటగిరి పలు యూనిట్లకు రూ. 2,35,99,841 ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఐడీపీ 2020–23 పాలసీ ప్రకారం ఓబీసీ కేటగిరి క్రింద రూ. 85,844 లు, మేర నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి, ఔత్సహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందివ్వనున్నట్లు తెలిపారు. కొత్తగా పారిశ్రామిక రంగంలోకి అడుగిడాలనుకున్న వారికి ఆర్థిక ప్రాత్సాహాన్ని అందించేలా బ్యాంకర్లతో సమన్వయం చేయడం జరుగుతుందన్నారు. పరిశ్రమల ప్రమోషన్ కు సంబందించి ఇంకా ఏవైనా అప్లికేషన్లు పెండింగ్ లో ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లా స్థాయి నుండి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యువతకు పారిశ్రామిక పెట్టుబడులు, యూనిట్ల స్థాపనపై అవగాహన పెంపొందించాలన్నారు. అంతకుముందు పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జిఎం చాంద్ బాషా సంబందిత వివరాలను సమావేశంలో కలెక్టర్ కు వివరించగా ఆయా అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో జేసీ సమీక్షించారు. సమావేశంలో సిక్కి డీసీ డి.జ్ఞాన ప్రకాష్, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్ చిన్నారావు, ఎల్డీఎం జనార్దనం దితరులు పాల్గొన్నారు.


