4 నుంచి సుందరకాండ పారాయణం
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయ ఆవరణలో మార్చి 4 నుంచి సుందరకాండ పారాయణం నిర్వహిస్తున్నట్లు ఆలయ టీటీడీ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎం.ఎస్.రామారావు మనవడు డాక్టర్ శ్రీనివాస్ స్వామి ఈ పారాయణం చేయనున్నారు. మార్చి 4 నుంచి 10వ తేది వరకు ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సుందరకాండ సప్తాహ పారాయణము జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కాండంలో ప్రధానంగా హనుమంతుడి ధైర్యం, సాహసం, బుద్ధికుశలత, కార్యసాధన, రాముడిపై ఉన్న అచంచల భక్తి ప్రధానంగా కనిపిస్తాయన్నారు.
చక్రాయపేట: గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో శుక్రవారం జరిగిన తలనీలాలు మరియు ఒక భాగం కొబ్బరి చిప్పలు సేకరించుకొనే హక్కుకు నిర్వహించిన షీల్డ్ టెండర్ మరియు బహిరంగ వేలం పాట ద్వారా ఆలయానికి రు.1,09,20,000లు ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్, దేవదాయశాఖ కర్నూలు రేంజ్ డిప్యూటి కమిషనర్ పట్టెం గురుప్రసాద్ తెలిపారు. సికింద్రాబాద్‌కు చెందిన మదర్ హ్యూమన్ హెయిర్ ఎంటర్ ప్రైజెస్ వారు రు.91 లక్షలకు షీల్డ్ టెండరులో కోట్ చేసి హెచ్చు పాటదారుడిగా నిలిచి తలనీలాల హక్కును పొందినట్లు ఆయన చెప్పారు. అలాగే కొబ్బరి చిప్పలు సేకరించుకొను హక్కును వేంపల్లె మండలం కుప్పాలపల్లెకు చెందిన రామగంగిరెడ్డి రు.18,20,000లతో దక్కించుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్‌లు కావలి వీరభాస్కరుడు, కల్లూరు వెంకటస్వామి, వేంపల్లె వృషభాచలేశ్వరస్వామి ఈవో సుభాష్, కడప దేవదాయశాఖ పర్యవేక్షకుడు శివయ్యలు హాజరయ్యారు. ఆర్కే వ్యాలీ ఏఎస్సై నాగరాజు బందోబస్తు నిర్వహించారు.


