లోకోమోటర్ వైకల్యంతో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులు
చికిత్సకు అవరోధంగా పేదరికం
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న అందని పింఛను
సాయం కోసం ఎదురుచూపు
ఆ చిన్నారుల నవ్వుల్లో వెలుగు ఉండాలి.. కానీ విధి ఆడిన వింత నాటకంలో వారి జీవితాలు చీకటిమయమయ్యాయి. పుట్టుకతోనే లోకోమోటర్ వైకల్యంతో మంచానికే పరిమితమైన ఆ ఇద్దరు గిరిజన చిన్నారుల కథ ఇది. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి.. 90 శాతం వైకల్యం ఉన్నట్లు వైద్యులే ధ్రువీకరించినా.. రెండేళ్లుగా ప్రభుత్వ పింఛన్ ఆ పసిబిడ్డల దరికి చేరడం లేదు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం శూన్యం. పర్రెడ పంచాయతీలో వెలుగుచూసిన ఇద్దరి దీనగాథ. వ్యవస్థలోని ఉదాసీనతకు నిలువుటద్దం పడుతోంది. వీరికి కావాల్సింది కేవలం పింఛన్ మాత్రమే కాదు, మానవత్వంతో కూడిన సాయం.
పెదబయలు: ఆ చిన్నారులు పుట్టినప్పుడు వారి తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. తమ బిడ్డలు పెరిగి పెద్దయ్యాక తమకు చేదోడు వాదోడుగా ఉంటారని ఆశపడ్డారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆ పసి ప్రాణాలు పుట్టుకతోనే వైకల్యంతో పోరాడుతున్నాయి. పెరిగే కొద్దీ ఆరోగ్యం కుదుటపడుతుందని ఆశగా ఎదురుచూస్తున్న ఆ గిరిజన కుటుంబాలకు ఇప్పుడు మిగిలింది కేవలం కన్నీళ్లే. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా.. వారి బాధ పాలక యంత్రాంగానికి వినిపించడం లేదు.
సాయం శూన్యం
పెదబయలు మండలం పర్రెడ పంచాయతీ నందిమెట్ట గ్రామానికి చెందిన నేరోడి రామారావు, వరలక్ష్మి దంపతుల కుమారుడు నేరోడి ఆకాష్ (8). ఆకాష్ లోకోమోటర్ ఆర్థోపెడిక్ వైకల్యంతో బాధపడుతున్నాడు. ఎముకలు, కండరాలు సహకరించక, నాడీ వ్యవస్థ బలహీనపడటంతో కనీసం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. 2023లో సదరం సరి్టఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా, వైద్యులు 90 శాతం వైకల్యం ఉందని నిర్ధారించారు. కానీ, ఆ 90 శాతం వైకల్యం సాక్షిగా రెండేళ్లుగా గ్రామ సచివాలయం చుట్టూ తిరుగుతున్నా, ఆకాష్‌కు వికలాంగ పింఛన్ మాత్రం మంజూరు కాలేదు. వస్తే చెబుతాం.. అనే సిబ్బంది సమాధానం ఆ తల్లిదండ్రుల గుండెలను పిండేస్తోంది.
కన్నీరు మున్నీరవుతున్న మరో కుటుంబం
అదే గ్రామానికి చెందిన నేరోడి రంజిత్ కుమార్, భవాని దంపతుల కుమారుడు అభిమన్యు (7) పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అభిమన్యు కూడా పుట్టుకతోనే అదే వ్యాధితో మంచానికే పరిమితమయ్యాడు. ఆశతో విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. బాబుకు రక్తం తక్కువగా ఉందని, ఆపరేషన్ చేయడం వీలుపడదని వైద్యులు డిశ్చార్జ్ చేసేశారు. ప్రభుత్వం నుంచి పింఛన్ రాక, సొంతంగా వైద్యం చేయించే స్థోమత లేక ఆ కుటుంబం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తోంది.
వినబడని ఆర్తనాదం
ఈ రెండు గిరిజన కుటుంబాల పరిస్థితి అత్యంత దీనంగా ఉంది. ఒకవైపు అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న బిడ్డలు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు వారిని కుంగదీస్తున్నాయి. 90 శాతం వైకల్యం ఉన్నా పింఛన్ రాకపోవడం వ్యవస్థలోని లోపాలకు అద్దం పడుతోందని పలువురు విమర్శిస్తున్నారు. మెరుగైన వైద్యం అందిస్తే తమ బిడ్డలు కోలుకుంటారని ఆ తల్లిదండ్రులు నమ్ముతున్నారు, కానీ చేతిలో చిల్లిగవ్వ లేదు. ప్రభుత్వం ఎలాగూ పట్టించుకోవడం లేదని, కనీసం మానవత్వం ఉన్న దాతలైనా ముందుకు వచ్చి తమ బిడ్డల ప్రాణాలు నిలబెట్టాలని వారు వేడుకుంటున్నారు. పర్రెడ పంచాయతీలోని ఈ రెండు కుటుంబాల కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, ఆ ఇద్దరు చిన్నారులకు తక్షణమే పింఛన్ మంజూరు చేయడమే కాకుండా, వారికి మెరుగైన కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆ గిరిజన గ్రామం కోరుతోంది.
కాళ్లరిగేలా తిరుగుతున్నా..
కుమారుడి పింఛను కోసం తల్లి పాట్లు
సీలేరు: గూడెం కొత్తవీధి మండలం, సీలేరు పంచాయతీ పార్వతీనగర్‌కు చెందిన కుర్ర కుమారి అనే గిరిజన మహిళ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఇటీవలే ఆమె భర్త అసురు అనారోగ్యంతో మృతి చెందడంతో, ముగ్గురు పిల్లల పోషణ ఆ తల్లికి భారమైంది. కుమారి పెద్ద కుమారుడు అజయ్ (12) పోలియో కారణంగా రెండు కాళ్లు పడిపోయి నడవలేని స్థితిలో ఉన్నాడు. తన కుమారుడికి వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని గత రెండేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పనులు చేస్తూ, అడవి నుంచి కట్టెలు తెచ్చి అమ్ముకుంటూ పిల్లలను పోషిస్తున్నారు. ‘పెన్షన్ అందితేనే నా పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టగలను‘ అని ఆదివారం విలేకరుల వద్ద ఆమె కన్నీరుమున్నీరయ్యా రు. ఈ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి, చిన్నారి అజయ్‌కు పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అడుగు పడని సాయం
మా పిల్లలు నడవలేరు, కదలలేరు. సచివాలయానికి వెళ్తే రేపు మాపు అంటున్నారు. ప్రభుత్వం కరుణిస్తుందని, ఎవరైనా దాతలు మా బిడ్డలకు వైద్యం చేయిస్తారన్న ఆశ మాత్రమే మిగిలి ఉంది.
– బాధిత తల్లిదండ్రుల ఆవేదన



