తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలు లేవనెత్తి చెత్త రాజకీయం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ విషయంలో వెనక్కు తగ్గారా? నెయ్యి తీగ లాగితే హెరిటేజ్ డొంక కదిలిందన్న వార్తలు ఇందుకు కారణమా? శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా చంద్రబాబు చేసిన ప్రసంగం చూస్తే ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. ముఖ కవళికల్లో తేడా స్పష్టంగా కనిపించింది. స్వరంలోనూ తేడా వచ్చింది.
వైసీపీపై, మరీ ముఖ్యంగా వైఎస్ జగన్‌పై మరింత తీవ్రస్థాయిలో విరుచుకుపడతారన్న టీడీపీ ఎమ్మెల్యేల అంచనాలన్నీ తల్లకిందులైపోయాయి పాపం. వాళ్లే ఆశ్చర్యపడేట్టు ప్రసంగం మొత్తమ్మీద ఈ వివాదం ప్రస్తావన దాదాపుగా లేకుండా చేశారు బాబుగారు! యజమానికి తగ్గట్టుగా నడుచుకునే ఎల్లోమీడియా కూడా కల్తీ వివాదాన్ని పక్కనపెట్టి చంద్రబాబు జగన్‌ను దూషించిన అంశాలకే పరిమితమై కథనాలు వండివార్చింది. ‘‘జగన్ కదలితే జనాలకు నరకరమే’’ అని, ‘‘రాజకీయ ముసుగులో నేరాలు చేస్తున్నారని’’ చంద్రబాబు విమర్శించినట్టు రాసుకుంది. జగన్‌కు ఉన్న ప్రజాదరణపై వారి అక్కసును ఇలా వెళ్లబోసుకున్నారన్నమాట.
‘‘తిరుపతి లడ్డూ వ్యవహారం సున్నితమైన అంశం. దేవుడి పవిత్రతను, భక్తుల మనోభావాలను దెబ్బ తీయాలని కొందరు కావాలని ప్రయత్నించారు’’ ఇవీ చంద్రబాబు మాటలు. అలా చేసిందెవ్వరు? ప్రసాదం లడ్డూలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు ,పంది కొవ్వు, చేప నూనె, చివరికి బాత్రూమ్‌లో వాడే రసాయనాలు కలిశాయంటూ దారుణమై రీతిలో వ్యాఖ్యలు చేసింది ఇదే చంద్రబాబే కదా? వంత పాడింది ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేశ్‌లే. అబద్ధపు ఆరోపణలతో తిరుమలకు అప్రతిష్ట తేవద్దని మేధావులు పలువురు విజ్ఞప్తి చేసినా పట్టించుకోనిది ఎవరు? వైఎస్ జగన్ విజ్ఞప్తి చేసినా పట్టించుకోని బాబు తన ఎల్లో మీడియా ద్వారా దారుణమైన కథనాలు రాయించారు. పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకేసి దుర్గగుడి మెట్లు కడగడం తిరుపతి వెళ్లి ‘‘అన్‌అపాలజిటిక్ హిందూ’’ అంటూ సినీ ఫక్కీలో డైలాగులు కొట్టడం కూడా మనం చూశాము.
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం నిజం నిగ్గుతేల్చిన తరువాత కూడా అవే ఆరోపణలును మళ్లీ మళ్లీ వల్లెవేసిందే! సిట్ నివేదికలో కల్తీ లేదని స్పష్టం చేశారుగా అని ఓ విలేకరి అడిగితే.. ‘‘ఎక్కడుంది? మీకెవరు చెప్పారు? మీ దేవుడు చెప్పాడా? వాట్ ఆర్ యు టాకింగ్’’ అంటూ కసురుకున్నది దబాయించింది కూడా చంద్రబాబే! తాజాగా లడ్డూ వ్యవహారాన్ని రాజకీయానికి వాడుకుని వైసీపీపై పైచేయి సాధించాలనుకున్న చంద్రబాబు కుట్ర భగ్నం కావడంతో ఈ నాయక త్రయమే ఇప్పుడు నెపం ఇంకొకరిపై నెట్టే ప్రయత్నం చేస్తోంది.
ఇందాపూర్ ఎవరిదన్నట్టు?
తిరుమల,తిరుపతి దేవస్థానానికి 2014-19 మధ్య నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ కంపెనీకి, చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌కు ఉన్న లింకులు వెలుగులోకి రావడంతో చంద్రబాబు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. కేంద్ర ఫుడ్ సేఫ్టీ సంస్థ హెరిటేజ్ పెరుగు నాణ్యతను తప్పుపట్టి జరిమానా విధించడం కూడా బాబు, హెరిటేజ్ పరువులను బజారుకీడ్చింది. తిరుమల నెయ్యి వివాదంపై ఇష్టారీతిన మాట్లాడవద్దని కేంద్ర బీజేపీ పెద్దలు, హోం మంత్రి అమిత్ షాలు హెచ్చరించారేమో... ఢిల్లీ పర్యటన తరువా బాబు స్వరం పూర్తిగా మారిపోయింది.
జరిగిన తప్పు చెప్పకపోతే ఆ అపవిత్రతను కొనసాగించేందుకు వైసీపీ వారు వెనుకాడరని ముఖ్యమంత్రి అసెంబ్లీలో అన్నారు.ఇప్పుడు అధికారంలో ఉన్నది తాను అన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నారా? లేక తాను అసమర్థుడినని పరోక్షంగా చెబుతున్నారా? కల్తీ నెయ్యి సరఫరా చేసింది కాక ఆ వివాదంలోకి హెరిటేజ్‌ను లాక్కొచ్చారని, తిరుమల లడ్డూ కల్తీకి, హెరిటేజ్‌కు ఏమి సంబంధం అని ఆయన అన్నారు. ప్రభుత్వం నుంచి హెరిటేజ్ ఒక్క పైసా అడగలేదు అని ఆయన అన్నారు. ఆ మాట చెప్పగానే అసెంబ్లీలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలంతా చపట్లు కొట్టాలి కదా! అలా చేయలేదు.
నిశ్శబ్ధంగా కూర్చుకుండిపోయారు. ఈ వివాదంలో హెరిటేజ్‌కు ఎలాటి పాత్ర లేకపోతే, దీని మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా ఉన్న ఇంద్రాపూర్ డెయిరీకి టీటీడీ నెయ్యి కాంట్రాక్ట్ ఏ రకంగా వచ్చిందో వివరించి ఉండవచ్చు కదా! 2014-19 మధ్య తన ప్రభుత్వ హయాంలో టీటీడీలో నెయ్యి సరఫరాలో ఎలాంటి అవకతవక జరగలేదని ధైర్యంగా చెప్పి, కావాలంటే సీబీఐ విచారణకు చేసుకోవచ్చని సవాల్ చేసి ఉండవచ్చు? కర్ణాటక నందిని సంస్థను తప్పించడానికి 800 కిలోమీటర్లు మించిన దూరంలో ఉన్న కంపెనీలు కూడా నెయ్యి టెండర్ వేయవచ్చని ఎందుకు నిబంధనలు సడలించారో చెప్పి ఉండవచ్చు.
హర్యానాకు చెందిన కంపెనీతో ఉన్న లింక్ ను వెల్లడించి, అందులో తప్పేమీ జరగలేదని వాదించి ఉండవచ్చు ! ఏ ఇతర కంపెనీకి టెండర్ దక్కకుండా ఇందాపూర్ కంపెనీకి ధరను రూ.658లకు తీసుకువెళ్లి నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టడంలో ఉన్న లోగుట్టు విప్పి ఉండాల్సింది! అంటే రెట్టింపు ధరకు కట్టబెట్టరంటే అంతకుముందు ఇదే సంస్థ కిలో రూ.278లకే సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని చంద్రబాబు ఒప్పుకున్నట్లేనా? అంతేకాక హెరిటేజ్ పెరుగుపై వచ్చిన రిపోర్టు తప్పో, కాదో తెలిపి ఉండాలి కదా! తాను గట్టిగా అరచి పలుమార్లు చేసిన జంతు కొవ్వు ఆరోపణలపై నిర్దిష్ట క్లారిఫికేషన్ ఇవ్వడం ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యత కాదా?అసలు 2024లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎ.ఆర్.డెయిరీ సరఫరా చేసిన నెయ్యి నాలుగు టాంకర్లు తిరస్కరణకు గురైన మాట నిజమా?కాదా?తిరిగి అవే టాంకర్లు ఎలా టీటీడీకి సరఫరా అయ్యాయి?అంటే కల్తీకి చంద్రబాబు ప్రభుత్వమే బాద్యత వహించాలి కదా!
2019-2024 కు సంబంధించి నెయ్యి కాని, లడ్డూ కాని పరీక్షలు జరగడానికి శాంపిల్స్ లేకపోయినా, తన హయాంలో జరిగిన పరీక్షల ఆధారంగా వైసీపీపై బురద చల్లడానికి యత్నించింది చంద్రబాబు కాదా! ఇలాంటి వాటన్నిటిపై అసెంబ్లీలో సవివరంగా చెప్పే అవకాశం ఉన్నప్పటికీ దానిని సీఎం వదలుకున్నారంటే ఆయన ఆత్మరక్షణలో పడ్డారనే కదా! ఇంతకాలం అబద్దాలు చెప్పారనే కదా! జగన్ పై తప్పుడు నిందలువేశారనే కదా! బోలే బాబా కంపెనీకి 2018లో టెండర్ వచ్చినప్పుడు ఉన్నది టీడీసీ ప్రభుత్వమే కదా!అప్పుడు ఎలా ఎంపిక అయింది? వీటి గురించి ఆయన మాట్లాడలేకపోయారే! హెరిటేజ్ బ్రాండ్ దెబ్బతీయడానికి యత్నిస్తున్నారని ముఖ్యమంత్రి బాధ పడ్డారు. దానిని ఫ్యాక్షన్‌తో పోల్చడానికి యత్నించారు. ఇక్కడ ఒక సంగతి గుర్తుకు వస్తుంది.
సాక్షి మీడియాపై కక్షకట్టి కేసులు, భారతి సిమెంట్ సంస్థకు నష్టం తేవడానికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఫ్యాక్షనిజం కిందే భావించవచ్చన్నమాట. తాను ఈ 20 నెలల్లో చేసిన అభివృద్ది ఏమిటో నిర్దిష్టంగా చెప్పలేదు కాని, ఇంత ప్రగతి ఎన్నడూ లేదని ఎప్పటిమాదిరి డప్పు కొట్టుకున్నట్లు మాట్లాడితే ఏమి లాభం.ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో ఒక్కో అంశం తెలిపి ఉండాలి. అలాగే ఎన్నికల మానిఫెస్టో చూపిస్తూ ఏఏ హామీలను నెరవేర్చింది చెప్పగలిగి ఉంటే మంచి పేరు వచ్చేది కదా! శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉంటామంటూ మేకపోతు మాటలు ఎందుకు చెబుతున్నారు? ఒకపక్క రాష్ట్రంలో నిత్యం దాడులు, అరాచకాలు, ఎమ్మెల్యేల దందా నడుస్తున్నాయే! వైసీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌ల ఇళ్లపైకి టీడీపీ గూండాలు వెళ్లి విధ్వంసం సృష్టిస్తే, పెట్రోల్ బాంబులు విసిరితే, వారిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదు? ఇవన్ని ఎందుకు తిరువూరు టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు నియోజకవర్గంలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, బెల్ట్ షాపులపై ఎనిమిది నెలలుగా ఫిర్యాదు చేస్తున్నా ఫలితం లేదని పునరుద్ఘాటించారు. ఆ ఒక్కదానికి చంద్రబాబు సమాధానం చెప్పగలరా?

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


