‘ఐదేళ్లలో ఐటీ, బీపీఓలు..’ బాంబు పేల్చిన వినోద్ ఖోస్లా | IT BPO services will disappear in five years tech billionaire Vinod Khosla | Sakshi
Sakshi News home page

‘ఐదేళ్లలో ఐటీ, బీపీఓలు..’ బాంబు పేల్చిన వినోద్ ఖోస్లా

Feb 16 2026 8:11 AM | Updated on Feb 16 2026 9:21 AM

IT BPO services will disappear in five years tech billionaire Vinod Khosla

న్యూఢిల్లీ: ప్రముఖ టెక్ బిలియనీర్, వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా తాజాగా ఐటీ, బీపీఓ రంగాలకు సంబంధించి తన అంచనాలను వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో రాబోయే ఐదేళ్లలో ఐటీ సర్వీసెస్, బీపీఓ రంగాలు దాదాపుగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని  అన్నారు. ఇండియా ఏఐ సమ్మిట్ 2026 సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే 15 ఏళ్లలో నైపుణ్యం ఆధారిత వృత్తులన్నీ ఏఐకి  ప్రభావితమవుతాయని పేర్కొన్నారు. అయితే ఇదే సాంకేతికత  అటు వైద్యం, ఇటు విద్యా రంగాలను సామాన్యులకు మరింత చేరువ చేస్తుందని  ఆశాభావం వ్యక్తం చేశారు.

భవిష్యత్‌ ఆర్థిక వ్యవస్థలో అకౌంటెంట్లు, వైద్యులు, ఇంజనీర్ల కంటే ఏఐ  నిపుణులు మెరుగ్గా పనిచేస్తారని ఖోస్లా విశ్లేషించారు. మేధోపరమైన పనుల తర్వాత రోబోటిక్స్ రంగం పుంజుకుంటుందని, దీనివల్ల శారీరక శ్రమతో కూడిన పనులు కూడా యంత్రాలే చేస్తాయని చెప్పారు. ఫలితంగా వస్తువుల ధరలు తగ్గి, ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చినప్పటికీ, ఉపాధి అవకాశాలు భారీగా తగ్గుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2035 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు సంభవిస్తాయని, అప్పటికి  యువతకు ఉద్యోగాలు లభించడం కష్టతరమవుతుందని ఆయన తెలిపారు.

ఐటీ సర్వీసుల స్థానంలో భారత్ ఏఐ ఆధారిత ఉత్పత్తులను ఎగుమతి చేసే కేంద్రంగా ఎదగాలని ఖోస్లా సూచించారు. దేశంలోని 25 కోట్ల మంది యువత ఐటీ సేవలపై కాకుండా ఏఐ ఉత్పత్తుల సృష్టిపై దృష్టి సారించాలని కోరారు. అమెరికా, చైనా వంటి దేశాల ఆధిపత్యాన్ని తట్టుకోవడానికి భారత్ సొంతంగా  ఏఐ మోడళ్లను అభివృద్ధి చేసుకోవడం అత్యవసరమని ఆయన సూచించారు. తద్వారా సామాన్యులకు మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించవచ్చని ఆయన  అన్నారు.

ఇదిలావుండగా ఖోస్లా ప్రస్తుత అమెరికా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. హెచ్-1బీ (H-1B) వీసాలపై ఆంక్షలు విధించడం అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టదాయకమని ఆయన పేర్కొన్నారు. ఆవిష్కరణల ద్వారా వచ్చే జీడీపీ వృద్ధిని డొనాల్డ్ ట్రంప్  గుర్తించలేకపోతున్నారని విమర్శించారు. చట్టబద్ధమైన వలసలు దేశానికి మేలు చేస్తాయని, కానీ ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు దీర్ఘకాలంలో నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు. భారత్ నుండి వెళ్లిన నిపుణులు తిరిగి స్వదేశానికి రావడం భారతదేశ అభివృద్ధికి మంచి పరిణామమని ఖోస్లా అన్నారు.

ఇది కూడా చదవండి: తారిఖ్ రెహ్మాన్‌.. ఈ సవాళ్లకు జవాబేది?

Advertisement
 
Advertisement
Advertisement