కొత్త ఏడాదిలో దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఉద్యోగుల నియామకాలకు సంబంధించి.. రాశి కన్నా వాసికే ప్రాధాన్యమివ్వనున్నాయి. పేరుకి పెద్ద సంఖ్యలో రిక్రూట్ చేసుకోవడం కాకుండా ప్రధానంగా కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ తదితర విభాగాల్లో నైపుణ్యాలున్న వారినే నియమించుకోవడంపై దృష్టి పెట్టనున్నాయి. సిబ్బంది సంఖ్యను ఊరికే పెంచుకోవడం కన్నా ఆయా విభాగాల్లో సామర్థ్యాలున్న వారినే మరింతగా తీసుకోవాలని భావిస్తున్నాయి.
ఉద్యోగాల కల్పన తీరుతెన్నులను ఈ ధోరణులు ప్రభావితం చేస్తాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భారత్‌లో 1,800 జీసీసీలు ఉండగా, వాటిలో సుమారు 1.04 కోట్ల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇతర రంగాలతో పోలిస్తే వారి జీతభత్యాలు 25–30 శాతం అధికంగా ఉంటున్నాయి. కొత్త ఏడాదిలో 120 పైచిలుకు మధ్య స్థాయి జీసీసీలు ఏర్పాటవుతాయని టీమ్‌లీజ్ వర్గాలు తెలిపాయి. ఇవి కొత్తగా సుమారు 40,000 వరకు ఉద్యోగాలను కల్పించవచ్చని వివరించాయి. భారీ జీసీసీల్లో దాదాపు 90 శాతం సెంటర్లు ప్రస్తుతం ఇన్నోవేషన్ హబ్‌లుగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని తెలిపాయి.
కొత్త ఏడాదిలో ఐటీ హైరింగ్ అప్..
కొత్త సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మొత్తం మీద హైరింగ్ 12–15 శాతం పెరగవచ్చని ఐటీ స్టాఫింగ్ సంస్థ క్వెస్ కార్ప్ అంచనా వేస్తోంది. జీసీసీల్లో ఏఐ ఇంజనీరింగ్, క్లౌడ్ ప్లాట్‌ఫాంలకి డిమాండ్ నెలకొనడం ఇందుకు కారణమని పేర్కొంది. మరోవైపు, కొత్తగా రాబోయే వాటితో పాటు ఇప్పుడున్న జీసీసీలు కూడా విస్తరణ చేపట్టనున్నాయని ఏఎన్‌ఎస్‌ఆర్ అంచనా వేసింది. నూతన సంవత్సరంలో 80–110 కొత్త జీసీసీలు రావొచ్చని, 2,00,000కు పైగా ఉద్యోగాలు కల్పించవచ్చని తెలిపింది.
పరిశ్రమ ఏటా 12–15 శాతం వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆదాయాలు 75 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని పేర్కొంది. జీసీసీల్లో నియామకాలకు సంబంధించి వెళ్లిపోయిన ఉద్యోగుల స్థానాలను భర్తీ చేసుకోవడానికి చేపట్టే హైరింగ్ వాటా ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు తెలిపారు. 2025లో నికరంగా 1,50,000 మందిని తీసుకోగా, 2026లో మరో 2,00,000 మందిని తీసుకోవచ్చని వివరించారు. అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) 14–18 శాతం ఉంటోందని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే జీసీసీల్లో స్థూల నియామకాలు 5,00,000 స్థాయికి చేరొచ్చని వివరించారు.
ద్వితీయ శ్రేణి నగరాలు కీలకం..
జీసీసీ విస్తరణ ప్రణాళికల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ ఏడాది ఐటీ నియామకాల్లో 13–15 శాతం వాటా వీటిది ఉంటుందని భావిస్తున్నారు. దీనితో కొత్త నిపుణులు లభించడంతో పాటు వ్యయాలు మరీ పెరగకుండా చూసుకోవడానికి కూడా కంపెనీలకు వెసులుబాటు లభిస్తుందని విశ్లేషకులు తెలిపారు. ఇప్పటికే 7 శాతం జీసీసీలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆయా మార్కెట్లలో జాబ్ పోస్టింగ్స్ వార్షికంగా 20 శాతం మేర పెరిగినట్లు పేర్కొన్నారు. నిర్వహణ వ్యయాలు 20–30 శాతం తక్కువగా ఉండటంతో కొచ్చి, కోయంబత్తూర్, జైపూర్, ఇండోర్, మంగళూరులాంటి నగరాలు ప్రత్యామ్నాయాలుగా ఎదుగుతున్నాయని వివరించారు.


