సైబర్‌ భద్రతలో రాజీ లేదు | govt clear no relaxation no extension on the SIM binding rules messaging apps | Sakshi
Sakshi News home page

సైబర్‌ భద్రతలో రాజీ లేదు

Feb 27 2026 1:15 PM | Updated on Feb 27 2026 1:24 PM

govt clear no relaxation no extension on the SIM binding rules messaging apps

దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి, జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. మెసేజింగ్ యాప్‌లకు సంబంధించి ప్రతిపాదించిన ‘సిమ్ బైండింగ్’ నిబంధనల్లో ఎటువంటి సడలింపు ఉండబోదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ముఖ్యంగా వెబ్ ఆధారిత మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లకు విధించిన 6 గంటల ఆటోమేటిక్ లాగ్-అవుట్ నిబంధనను సడలించబోమని తేల్చి చెప్పారు.

ఏమిటీ సిమ్ బైండింగ్? వినియోగదారులపై ప్రభావం?

టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్-2024 ప్రకారం వాట్సాప్, టెలిగ్రామ్.. మెసేజింగ్ యాప్‌లు ఇకపై వినియోగదారుడి ఫోన్‌లోని యాక్టివ్ సిమ్ కార్డుతో నిరంతరం అనుసంధానమై ఉండాలి. ఒకవేళ ఫోన్ నుంచి ఒరిజినల్ సిమ్ కార్డును తొలగించినా లేదా అది డీయాక్టివేట్‌ అయినా ఆ పరికరంలో మెసేజింగ్ సేవలు తక్షణమే నిలిచిపోతాయి. ల్యాప్‌టాప్ లేదా పీసీల్లో వాడే వెబ్ వెర్షన్లు ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగ్-అవుట్ అవుతాయి. వినియోగదారులు క్యూఆర్ కోడ్ ద్వారా మళ్లీ ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.

ఈ నిబంధనలను పాటించడానికి ఇచ్చిన 90 రోజుల గడువు ఫిబ్రవరి 28, 2026తో ముగియనుంది. దీన్ని పొడిగించే ఆలోచన లేదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్‌) స్పష్టం చేసింది. ‘జాతీయ భద్రతే మాకు ముఖ్యం. మోసాలను నివారించడానికి సిమ్ బైండింగ్ తప్పనిసరి. ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదు’ అని సింధియా పేర్కొన్నారు.

ఏజీఆర్, స్పెక్ట్రమ్ వేలం

టెలికాం ఆపరేటర్లు కోరుతున్న సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ (ఏజీఆర్‌) ఉపశమనంపై మంత్రి స్పందిస్తూ సుప్రీంకోర్టు తీర్పునకు లోబడే ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. వొడాఫోన్ ఐడియా తరహాలో ఏజీఆర్‌ ఉపశమనం కోరే ఏ సంస్థ అయినా న్యాయపరమైన మార్గాలనే అనుసరించాలని సూచించారు. మరోవైపు, తదుపరి స్పెక్ట్రమ్ వేలం కోసం ట్రాయ్ సిఫార్సులను సమర్పించిందన్నారు. వీటిని పరిశీలించి త్వరలోనే వేలం కాలక్రమాన్ని విడుదల చేస్తామని వెల్లడించారు.

శాటిలైట్ ఇంటర్నెట్: స్టార్‌లింక్‌కు షరతులు

భారతదేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ భద్రతా ప్రమాణాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ఎలాన్ మాస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్ ఇంకా అవసరమైన భద్రతా డెమోలను పూర్తి చేయలేదని మంత్రి తెలిపారు. భారత సరిహద్దుల వెలుపల ఇంటర్నెట్ సేవలను నిలిపివేసే సామర్థ్యం, నెట్‌వర్క్‌పై పూర్తి స్థాయి భద్రతా నియంత్రణ వంటి అంశాల్లో స్పష్టత వచ్చిన తర్వాతే స్పెక్ట్రమ్ కేటాయింపులు జరుగుతాయని వివరించారు.

ఇదీ చదవండి: విమాన ప్రయాణికులకు ఊరట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement