తెలంగాణలో వాహన కొనుగోలుదారులకు అదనపు భారం పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 1 నుంచి రోడ్డు భద్రత సెస్ అమలు చేయాలని నిర్ణయించింది. ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేయడం, రాష్ట్రవ్యాప్తంగా ప్రమాద నివారణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ మోటార్ వెహికల్స్ ట్యాక్సేషన్ యాక్ట్- 1963కు సవరణలు చేసిన నేపథ్యంలో ఈ కొత్త సెస్ అమల్లోకి రానుంది. గత జనవరిలో గవర్నర్ ఆమోదం పొందిన ఈ సవరణ ప్రకారం, చట్టంలోని సెక్షన్ 3-సి కింద కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో వన్‌టైమ్ రోడ్ సేఫ్టీ సెస్ వసూలు చేయనున్నారు.
వాహనాల వారీగా సెస్ ఇలా…
మోటార్ సైకిళ్లపై రిజిస్ట్రేషన్ సమయంలో రూ. 2,000
వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే ట్రాక్టర్లు, ట్రాక్టర్-ట్రెయిలర్లు మినహా లైట్ మోటార్ వెహికల్స్ (ఎల్ఎంవీ)పై రూ. 5,000
కార్లు, పెద్ద ప్యాసింజర్ వాహనాలు సహా ఇతర రవాణా, రవాణాయేతర వాహనాలపై రూ. 10,000
అయితే నాలుగు నుంచి ఏడుగురు సీటింగ్ సామర్థ్యం కలిగిన ఆటోరిక్షాలు వంటి ప్యాసింజర్ మూడు చక్రాల కాంట్రాక్ట్ క్యారేజీలకు ఈ సెస్ నుంచి మినహాయింపు కల్పించారు.
పన్ను నిర్మాణంలో మార్పులు
నాలుగు చక్రాల లైట్ గూడ్స్ క్యారేజీలపై కూడా పన్ను విధానంలో మార్పులు చేశారు. కొత్త వాహనాలపై రిజిస్ట్రేషన్ సమయంలో వాహన ధరలో 7.5 శాతం పన్ను విధించనున్నారు. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసి తెలంగాణలో రిజిస్టర్ చేసే వాహనాలపై వాటి వయస్సును బట్టి 4 శాతం నుంచి 6.5 శాతం వరకు పన్ను వసూలు చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రిజిస్టర్ అయి వినియోగంలో ఉన్న వాహనాలకు ప్రస్తుత త్రైమాసిక పన్ను కొనసాగుతుంది. పాత మూడు చక్రాల గూడ్స్ క్యారేజీలను సవరించిన పన్ను నిబంధనల నుంచి మినహాయించారు.
ప్రత్యేక నిధికి జమ
రోడ్డు భద్రత సెస్ ద్వారా లభించే ఆదాయాన్ని ప్రత్యేక నాన్-లాప్సబుల్ ఫండ్‌కు జమ చేస్తారు. ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థల మెరుగుదల, రహదారి మౌలిక వసతుల అభివృద్ధి, ప్రమాదాల నివారణ చర్యలకు ఈ నిధులను వినియోగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ చర్య ద్వారా సుమారు రూ. 250 కోట్ల ప్రత్యేక నిధి సమీకరించగలమని అంచనా వేస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోడ్డు భద్రత సెస్ తరహా విధానాలు ఇతర రాష్ట్రాల్లో కూడా అమల్లో ఉన్నాయి. మహారాష్ట్రలో ఇప్పటికే రోడ్డు సేఫ్టీ, మౌలిక వసతుల అభివృద్ధి కోసం అదనపు సెస్సులు వసూలు చేస్తున్నారు. కర్ణాటకలో ప్రత్యేక రోడ్డు అభివృద్ధి సెస్సు అమల్లో ఉండగా, కేరళలో రోడ్డు భద్రతా ప్రాజెక్టుల కోసం అదనపు లెవీలు విధించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే రాజస్థాన్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా వాహన రిజిస్ట్రేషన్ సమయంలో ప్రత్యేక రుసుములు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్సులు వసూలు చేస్తున్నారు.


