సనత్‌నగర్‌ టిమ్స్‌కు ముహూర్తం ఖరారు.. ఉగాది రోజు నుంచే సేవలు | Sanath Nagar TIMS Started On March 19th In Hyderabad | Sakshi
Sakshi News home page

సనత్‌నగర్‌ టిమ్స్‌కు ముహూర్తం ఖరారు.. ఉగాది రోజు నుంచే సేవలు

Feb 27 2026 8:33 AM | Updated on Feb 27 2026 9:36 AM

Sanath Nagar TIMS Started On March 19th In Hyderabad

సాక్షి, సిటీబ్యూరో: ఏడాదిగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. వెయ్యి పడకల సామర్థ్యమున్న సనత్‌నగర్‌ టిమ్స్‌ (తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) ప్రారంభోత్సవానికి మార్గం సుగమమైంది. వచ్చే నెల 19న దీనిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఓపీ, ఐసీయూ, ఆపరేషన్‌ థియేటర్లు, ఇన్‌ వార్డులు, టెస్టింగ్‌ ల్యాబ్‌లు సిద్ధమవుతున్నాయి. వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, ట్యాబ్‌ టెక్నిషియన్లు, ఇతర సిబ్బందిని 3 నెలల డిప్యుటేషన్‌పై నియమించారు. గాంధీ, ఉస్మానియా, వనస్థలిపురం ప్రాంతీయ ఆసుపత్రి, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి 40 మంది సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉగాది రోజు నుంచి వైద్య సేవలు షురూ కానున్నాయి.

గాంధీ, ఉస్మానియాలకు ఉపశమనం 
సనత్‌నగర్‌ టిమ్స్‌ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే నగరంలోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఇతర ప్రభుత్వ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గనుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. వెయ్యి పడకల సామర్థ్యం, అత్యాధునిక శస్త్రచికిత్సలు, అవయవ మారి్పడి, సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు ఉగాది నుంచి టిమ్స్‌లో మొదలవుతున్నాయి. నిత్యం నగరంలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు 2,500 నుంచి 3 వేల ఓపీ ఉంటోంది. రోగుల తాకిడితో సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా వైద్య సేవల్లో నాణ్యత తగ్గే ప్రమాదం ఉంటుందని అభిప్రాయం ఉంది. రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్య సిబ్బంది, మౌలిక సదుపాయాలు కల్పిస్తే మెరుగైన వైద్య సేవలకు అవకాశం ఉంటుంది.  

గుండె చికిత్సలు సులువు 
సనత్‌నగర్‌ టిమ్స్‌ ఆసుపత్రి గుండె శస్త్రచికిత్సలకు కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా నిలవనుంది. రోగులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవలందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హార్ట్‌ ఆపరేషన్స్‌ కోసం క్యాత్‌ ల్యాబ్, అవయవ మార్పిడికి ప్రత్యేకంగా రూపొందించిన 16 ఆపరేషన్‌ థియేటర్లు, సీటీస్కాన్, ఎంఆర్‌ఐ, డిజిటల్‌ ఎక్స్‌రే, ఇతర అత్యాధునిక యంత్రాలు  అందుబాటులోకి రానున్నాయి. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని, ప్రారంభం నాటికి 100 శాతం పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement