తప్పు ఒప్పుకోకుండాఉపన్యాసాలా? | Opposition Leader Botsa Anger In The Council Against Chandrababu Govt Over Rayalaseema Lift Irrigation, More Details | Sakshi
Sakshi News home page

తప్పు ఒప్పుకోకుండాఉపన్యాసాలా?

Feb 27 2026 3:11 AM | Updated on Feb 27 2026 1:26 PM

Opposition leader Botsa anger in the council against Chandrababu govt

చంద్రబాబు సర్కారుపై మండలిలో విపక్ష నేత బొత్స మండిపాటు

తాను చెబితేనే రాయలసీమ లిఫ్ట్‌ను చంద్రబాబు ఆపారని 

అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు

రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశంపై జవాబు చెప్పకుండా రాజకీయాలెందుకు బాబూ?

వైఎస్‌ జగన్‌ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలను పూర్తి చేస్తారా? లేదా?

చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ వైఎస్సార్‌సీపీ సభ్యుల నినాదాలు

పోడియం వద్ద నిరసనకు దిగిన విపక్షం

సాక్షి, అమరావతి: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తానే ఆపించానని తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.. అది వాస్తవమా? కాదా?.. రేవంత్‌ వ్యాఖ్యలను చంద్రబాబు ఎందుకు ఖండించలేదు? రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతారా?.. అది చూస్తూ మేం ఊరుకోవాలా? ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం సభలో మేం ప్రశ్నిస్తే సమాధానం చెప్పరా? మీరు ఏం చెప్పినా మేం తలూపాలా..?’’ అంటూ శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. 

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలను ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందో లేదో సూటిగా జవాబు చెప్పాలి అని నిలదీశారు. అధికారపక్షం జవాబు చెప్పకుండా దాటవేయటాన్ని బట్టి రేవంత్‌రెడ్డి చెప్పిందే నిజమేనని ఒప్పుకున్నట్లైందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మేం అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేక దాటవేత ధోరణి ఎందుకు అని ప్రశ్నించారు. ‘సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి.. లేదంటే సమాధానం చెప్పలేం.. తర్వాత చెబుతామని ఒప్పుకోండి. ఇది రాజకీయ అంశం కాదు.. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయం’ అని తేల్చి చెప్పారు. 

చంద్రబాబుతో తనకున్న సన్నిహిత సంబంధాలతో రాయలసీమ లిఫ్ట్‌ పనులను నిలిపివేయించానని రేవంత్‌రెడ్డి పేర్కొనటంపై అధికారపక్షం సమాధానం చెప్పాలన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఈ ప్రాజెక్టు రాయలసీమకు ఎంత అవసరమో గుర్తించి ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఎన్ని గొడవలు వచ్చినా పనులు చేపట్టామని గుర్తు చేశారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా ‘పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌’పై గురువారం శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఇషాక్‌బాషా, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడారు. 

దీనిపై నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందిస్తూ.. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ 2014లో పూర్తయిందని, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ) ఆదేశాల మేరకు నిలిపివేశారని, ఆ పథకంలో 22.82 శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. 

స్వప్రయోజనాల కోసం బాబు లాలూచీ..!
రాయలసీమకు ఎంతో అవసరమైన ఆ ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఇషాక్‌బాషా డిమాండ్‌ చేశారు. రాయలసీమ నీటి కష్టాలను తీర్చేందుకు వైఎస్‌ జగన్‌ ఆ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ఆ ప్రాజెక్టును నిలిపివేయడం వల్ల రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతోందని, రాయలసీమ వాసిగా దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ఇషాక్‌ బాషా ప్రశ్నించారు. 

స్వప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వంతో లాలూచీ పడి రాయలసీమకు హక్కుగా రావాల్సిన నీటిని ఆపడం న్యాయమా? దాన్ని పూర్తి చేస్తారా? లేక రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతారా? అని ఇషాక్‌ బాషా ధ్వజమెత్తారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ అవసరంలేదని చంద్రబాబు చెప్పడం దుర్మార్గమని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు నుంచి గత 20 ఏళ్లుగా నీటిని పూర్తిగా వాడుకోలేకపోయామన్నారు. 

రేవంత్‌రెడ్డి ప్రకటనను సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి ఖండించకపోవడం దారుణమన్నారు. ఎత్తిపోతల ప్రాజెక్టును కచ్చితంగా చేపట్టి రాయలసీమ ఎడారి కాకుండా కాపాడాలని కోరారు. రాజకీయ ధృక్పధంతోనే ఆ ప్రాజెక్టును ఆపేశారని ప్రజలు నమ్ముతున్నారని, దానిపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని ఎమ్మెల్సీ సుబ్రమణ్యం డిమాండ్‌ చేశారు.

సమాధానం చెప్పకుండా అధికారపక్షం సుదీర్ఘ ప్రసంగాలు
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్న సమయంలో మంత్రులు అచ్చెన్నాయుడు, రామానాయుడు, పయ్యావుల కేశవ్‌ ఎదురుదాడికి దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో 10.31 గంటలకు చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు సభను వాయిదా వేశారు. అనంతరం 10.43 గంటలకు సభ పునఃప్రారంభమైన వెంటనే ప్రభుత్వం రెండో ప్రశ్నకు జవాబు చెప్పాలని సూచించడంపై ప్రతిపక్ష నేత బొత్స అభ్యంతరం తెలిపారు. మొదటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకుండా రెండో ప్రశ్నకు ఎలా అనుమతిస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు. 

మొదటి ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాలంటూ వైఎస్సార్‌సీపీ సభ్యులు వెల్‌లో నిల్చుని నిరసన తెలిపారు. తమ సభ్యులు అడిగిన ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా మంత్రులు సుదీర్ఘ ప్రసంగం చేస్తున్నారని బొత్స అభ్యంతరం తెలిపారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు వెల్‌లోకి చేరుకుని నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. దీంతో మళ్లీ 10.48గంటలకు సభను రెండోసారి వాయిదా వేసిన చైర్మన్‌ మళ్లీ 11.03 గంటలకు తిరిగి ప్రారంభించారు. 

లైన్‌మెన్‌ల నియామకంపై టీడీపీ సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు ప్రశ్నకు విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవి బదులిచ్చిన అనంతరం గాలేరు–నగరి సుజల స్రవంతి, రాయలసీమ ప్రాజెక్టులపై ఎంవీ రామచంద్రారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి నిమ్మల రామానాయుడు బదులిచ్చారు. మంత్రి తాము అడిగిన దానికి కాకుండా ఏదో చెబుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. పోడియం వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. 

చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలు చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు వెల్‌లో నిల్చుని బిగ్గరగా కేకలు వేశారు. ఇలాంటి వ్యూహాలతో వస్తే సభను నడపలేమని చైర్మన్‌ మోషేన్‌రాజు అసహనం వ్యక్తం చేశారు. సభలో ఆందోళన నెలకొనడంతో కేవలం మూడు ప్రశ్నలకే సమాధానం రాగా మిగిలిన వాటిని డీమ్‌్డగా ప్రకటించిన చైర్మన్‌ మండలిని వాయిదా వేశారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తాను చెబితేనే చంద్రబాబు ఆపారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభ సాక్షిగా వెల్లడించారు. అది నిజమా.. కాదా? ఈ పథకాన్ని ఎప్పటిలోగా ప్రారంభించి, ఎప్పటిలోగా పూర్తి చేస్తారో సమాధానం చెప్పాలి. రేవంత్‌రెడ్డి బాధ్యత కలిగిన సీఎం పదవిలో ఉంటూ ఏపీ ముఖ్యమంత్రి పేరు చెప్పినప్పుడు ఇక్కడున్న ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు జవాబు చెప్పాలి. అలా కాకుండా రాజకీయ ఉపన్యాసాలు ఏమిటి? మీకు రాయలసీమకు నీరు రావడం ఇష్టం లేదు.. అందుకే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పింది వాస్తవం కాదని చెప్పడం లేదు.. – శాసన మండలిలో ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత బొత్స ధ్వజం

Advertisement
 
Advertisement
Advertisement