సుదీర్ఘ ప్రవాసం, అలుపెరగని పోరాటం, చివరకు ప్రజాక్షేత్రంలో తిరుగులేని విజయం.. బంగ్లాదేశ్ నూతన సారథిగా తారిఖ్ రెహ్మాన్ పగ్గాలు చేపట్టబోతున్నారు. అయితే రెహ్మాన్‌కు ఈ విజయం పూలబాట కాదు. ఒకవైపు ఏళ్ల నాటి పాత గాయాలు, మరోవైపు రాజకీయ శత్రువుల అణచివేత.. వీటన్నింటి మధ్య తారిఖ్ ఇచ్చే ‘చట్టబద్ధ పాలన’ హామీ దేశాన్ని ఏ దిశగా నడిపించబోతోంది? ఆయన అడుగులు ప్రతీకారం వైపా లేక పరివర్తన వైపా? అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
ప్రతీకారేచ్ఛను పక్కన పెడతారా?
జియావుర్ రెహ్మాన్ వారసుడిగా, ఖలీదా జియా తనయుడిగా తారిఖ్ రెహ్మాన్‌కు అధికారం కొత్త కాకపోవచ్చు, కానీ ఈసారి బాధ్యత అత్యంత భారంగా మారింది. అవామీ లీగ్ పతనం తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయడం ఆయన ముందున్న మొదటి సవాల్. గత ప్రభుత్వ హయాంలో అతనిపై మోపిన అక్రమ కేసులు, జైలు శిక్షలు, ప్రవాస జీవితం ఆయన మనసులో ప్రతీకారేచ్ఛను రగిలిస్తాయా? లేక ఒక పరిణతి చెందిన నాయకుడిగా మారుస్తాయా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
‘చట్టబద్ధ పాలన’ అతి పెద్ద పరీక్ష
తాజాగా విలేకరుల సమావేశంలో తారిఖ్ చెప్పిన చట్టబద్ధ పాలన అనే మాట ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అవామీ లీగ్ మద్దతుదారులు ప్రాణభయంతో తలదాచుకుంటున్న వేళ, ఆయన ఇచ్చిన ఈ భరోసా ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందన్నది సందేహమే. కిందిస్థాయి కార్యకర్తల్లో ఉన్న ఆగ్రహాన్ని అదుపు చేస్తూ, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకుండా యంత్రాంగాన్ని నడిపించడం అనేది ఆయన ముందున్న పెద్ద పరీక్ష.
అందరి ఆమోదం సాధ్యమేనా?
షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత అనాథలుగా మారిన అవామీ లీగ్ ఓటర్లు ఈ ఎన్నికల్లో మౌనంగా బీఎన్‌పీకి జై కొట్టారు. ఇది బీఎన్‌పీపై ఉన్న ప్రేమ కంటే, జమాత్ ఈ ఇస్లామీ లాంటి శక్తులు అధికారంలోకి రాకూడదనే భయం వల్ల జరిగిన మార్పు. ఈ విధంగా వచ్చిన ఓటు బ్యాంకును శాశ్వతంగా నిలబెట్టుకోవాలంటే తారిఖ్ రెహ్మాన్ తన పాలనలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
మతవాదం వెర్సస్ జాతీయవాదం?
బంగ్లాదేశ్ అంటేనే లౌకికవాదం- ఇస్లామిక్ విలువల కలయిక. జమాత్ ఈ ఇస్లామీ ప్రభావం పెరగకుండా చూస్తూనే, మెజారిటీ ముస్లిం ఓటర్లను సంతృప్తి పరచడం తారిఖ్ ముందున్న కత్తిమీద సాము లాంటి వ్యవహారం. గతంలో పాకిస్తాన్ అనుకూల ముద్ర ఉన్న శక్తులతో దూరం పాటిస్తూ, బంగ్లాదేశ్ జాతీయ అస్తిత్వాన్ని కాపాడతామని ఆయన చేసిన వాగ్దానం మైనారిటీలలో ముఖ్యంగా హిందువులలో కొత్త ఆశలు రేకెత్తించింది.
మహిళా ఓటర్ల మద్దతు కొనసాగేనా?
షరియా చట్టం, మహిళల విషయంలో కఠిన నిబంధనలు విధిస్తామన్న జమాత్ వ్యాఖ్యలు మహిళా ఓటర్లను బీఎన్‌పీ వైపు మళ్లించాయి. షేక్ హసీనా హయాంలో మహిళా సాధికారత కొంతవరకు మెరుగ్గా ఉండేది. ఇప్పుడు తారిఖ్ రెహ్మాన్ ఆ పురోగతిని కొనసాగిస్తారా? లేక సంప్రదాయవాదుల ఒత్తిడికి తలొగ్గుతారా? అన్నది వేచి చూడాలి. మహిళల భద్రత, ఉద్యోగ అవకాశాల విషయంలో ఆయన తీసుకునే నిర్ణయాలే ఆయన భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
అంతర్జాతీయ సవాళ్లు
బంగ్లాదేశ్ రాజకీయాల్లో భారత్, చైనా, అమెరికా వంటి దేశాల ప్రమేయం ఎప్పుడూ ఉంటుంది. అవామీ లీగ్ నిషేధం వెనుక విదేశీ హస్తం ఉందన్న ప్రచారం మధ్య, తారిఖ్ తన విదేశాంగ విధానాన్ని ఎలా మలుచుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడటం అనేది ఆయన పరిపాలనా దక్షతకు గీటురాయి కానుంది.
ఆర్థిక సంక్షోభాన్ని గట్టెక్కిస్తారా?
రాజకీయ సవాళ్లు ఒకెత్తయితే, కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం మరో ఎత్తు. నిత్యావసర ధరల పెరుగుదల, నిరుద్యోగంతో దేశ యువత రగిలిపోతోంది. 2024, జూలై నాటి నిరసనలకు కారణమైన సమస్యలను పరిష్కరించకపోతే, ప్రజా ఆగ్రహం తనపైకి మళ్లడానికి ఎంతో సమయం పట్టదని తారిఖ్‌కు తెలుసు. అందుకే, ఆయన తక్షణ ప్రాధాన్యత ఆర్థిక సంస్కరణలవైపు ఉండాలి.
దేశాన్ని సుస్థిరత వైపు నడిపిస్తారా ?
తారిఖ్ రెహమాన్ ముందు రెండు దారులు ఉన్నాయి. ఒకటి గతంలోని తప్పులను పునరావృతం చేస్తూ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవడం, రెండు.. అందరినీ కలుపుకుపోయే ప్రజాస్వామ్యవాదిగా చరిత్రలో నిలిచిపోవడం. ఆయన ఎంచుకునే ‘చట్టబద్ధ పాలన’ అనే మార్గం బంగ్లాదేశ్‌ను సుస్థిరత వైపు నడిపిస్తుందా లేక మరో రాజకీయ అనిశ్చితికి దారితీస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి.
ఇది కూడా చదవండి: ‘బంగ్లా’లో తారిఖ్ ప్రభుత్వం.. పాక్‌లో ఏం జరగనుంది?


