అంతరిక్షంలో ఉపగ్రహాలతో దేశాల నిఘా యుద్ధం
వైరి దేశాల శాటిలైట్లపై దృష్టి సారించిన వైనం
జేమ్స్‌బాండ్ సినిమాల్లో హీరో అలవోకగా ఖండాలన్నీ చుట్టేస్తుంటాడు. చట్టవ్యతిరేక, విద్రోహ సంస్థల గుట్టుమట్లు రట్టుచేసి భారీ ఉపద్రవాలను అడ్డుకుంటాడు. శత్రువుల రహస్య స్థావరాలను నేలమట్టం చేస్తుంటాడు. ఈ నిఘా పోరు 21వ శతాబ్దపు వాస్తవిక ప్రపంచంలో భూమిని దాటేసి ఏకంగా అంతరిక్షానికి చేరింది! ఇంతకాలం నేలల తేమ శాతం, అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు తదితరాలపై అధ్యయం చేస్తూ వచి్చన ఉపగ్రహాలు నిఘా కార్యకలాపాల్లో తలమునకలు అవుతున్నాయి.
వైరి దేశాల ఉపగ్రహాలపై కన్నేస్తున్నాయి. ఏ సమయంలో ఏ దేశంపై ఎందుకు తిరగాడుతున్నాయో కూపీ లాగుతున్నాయి. ప్రధాన దేశాలన్నీ దాదాపుగా ఇదే బాటపట్టడంతో ఇప్పుడు అంతరిక్షంలో సరికొత్త శాటిలైట్ నిఘా యుద్ధానికి తెర లేచింది. బెంగళూరుకు చెందిన దిగంతర సంస్థ ఒకటి ఇటీవల ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్‌్కకు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ల జాడను విజయవంతంగా కనిపెట్టడం తెలిసిందే.
హైదరాబాద్‌కు చెందిన అజిస్టా స్పేస్ సంస్థ ఏకంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం( ఐఎస్‌ఎస్) ఎప్పుడు, ఎక్కడ తిరుగుతోందో కనిపెట్టి ఔరా అనిపించింది. వీటిని ఒకరకంగా ఇతర ఉపగ్రహాలపై నిఘా ఘటనలుగానే చెప్పొచ్చు. శత్రు ఉపగ్రహాల జాడను కనిపెట్టేందుకు సరికొత్త ‘స్పేస్ సిచ్యువేషనల్ అవేర్‌నెస్’ (ఎస్‌ఎస్‌ఏ) పరిజ్ఞానం ఇప్పుడు కీలకంగా మారింది.
రెండు ఉపగ్రహాలు పొరపాటున ఢీకొనే ఆస్కారాన్ని తప్పించడమే గాక వాటి సిగ్నళ్లను జామ్ చేయడం, శాటిలైట్‌ను ధ్వంసం చేయడాన్ని నిలువరించడం కోసం ముందు ప్రత్యర్థి ఉపగ్రహాలు ఎక్కడున్నాయో కనీసం పక్కాగా తెలిసి ఉండాలి. ఈ కారణంగా కూడా నింగిలో నిఘా నేత్రాన్ని తెరవాల్సిన అనివార్యత దేశాలకు ఏర్పడిందని ఇండియన్ స్పేస్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) ఏకే భట్ అన్నారు. ఈ నేపథ్యంలో ‘స్పైయింగ్ ఇన్ స్కై’ ఇప్పుడిక ఎంతమాత్రమూ సైన్స్‌ఫిక్షన్ స్థాయికి పరిమితం కాలేదు. భూమిపై జేమ్స్‌బాండ్ చేసి పనినే ఇప్పుడు ఆకాశంలో కృత్రిమ ఉపగ్రహాలు విస్తృతస్థాయిలో చేయబోతున్నాయి. ఇందులో ఆధిపత్యం ఎవరితో భవిష్యత్తులో తేలిపోనుంది.
ఎవరు గమనిస్తున్నారో తెలిసుండాలి
‘‘కమ్యూనికేషన్, సైనిక, పౌర, పరిశోధనావసరాల కోసం ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నా అవి రహస్య పనులనూ చేస్తున్నాయి. ఇతర దేశాల ఉపగ్రహాలు భారత్‌లోని ఏఏ భూభాగాలపై ఎందుకు తిరుగుతున్నాయో కచి్చతంగా మనకు తెల్సి ఉండాల్సిందే. ఇది నిఘా, వ్యూహాత్మక ఆపరేషన్లకు అత్యంత కీలకం. అందుకే శత్రు దేశాల ఉపగ్రహాలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఏర్పడింది’’ అని అజిస్టా స్పేస్‌లో స్పేస్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ విభాగ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ భరత్ సింహా రెడ్డి చెప్పారు. ‘‘ఉక్రెయిన్–రష్యా యుద్ధం మొదలు ఆపరేషన్ సిందూర్‌దాకా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధా్దలకు కీలక సమాచారం ఉపగ్రహాల నుంచే అందింది. కమ్యూనికేషన్స్, ఇంటెలిజెన్స్, నేవిగేషన్, టార్గెట్ ఇలా అన్ని విభాగాలను పటిష్టంచేయడంలో శాటిలైట్లే కీలక పాత్ర పోషించాయి’’ అని దిగంతర సీఈఓ, వ్యవస్థాపకులు అనిరుధ్ శర్మ అన్నారు.
సామర్థ్యాన్ని పెంచుకుంటున్న భారత్
స్పేస్ సిచ్యువేషనల్ అవేర్‌నెస్ (ఎస్‌ఎస్‌ఏ)లో ప్రైవేట్ భాగస్వాములను ప్రోత్సహిస్తూ భారత్ అంతర్జాతీయ నిఘా సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఏటా ఆరు నుంచి పది ఉపగ్రహాలను తయారు చేసేలా అజిస్టా సంస్థ కొత్త ఎలక్ట్రో–ఆప్టికల్ పేలోడ్ తయారీ కర్మాగారాన్ని నిర్మిస్తోంది. ఇది 2027 ద్వితీయార్ధంలోపు ప్రారంభం కావచ్చు. శత్రువులు ప్రయోగించే క్షిపణుల జాడను శాటిలైట్ ద్వారా గుర్తించే కొత్త ఉపగ్రహాన్ని 2027లోపు ప్రయోగిస్తామని ఈ సంస్థ తెలిపింది. అంతరిక్షంలో అర్లీ వారి్నంగ్ సిస్టమ్‌ను ఇది మరింత పటిష్టపరచనుంది. సాంప్రదాయకంగా భూతలంపై రాడార్ వ్యవస్థలు, ఆకాశంలో చక్కర్లు కొట్టే నిఘా విమానాలకు తోడుగా ఇప్పుడు అంతరిక్షంలోనూ నిఘా ఉపగ్రహాల రాకతో భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కాబోతోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్


