breaking news
artificial satellites
-
అంతరిక్ష ఏఐ రేసులో భారత్ మాస్టర్ స్ట్రోక్!
ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ వేలాది కృత్రిమ ఉపగ్రహాలతో అంతరిక్షాన్ని ఆక్రమించాలని చూస్తున్న వేళ ఒక భారతీయ స్టార్టప్ ఆయన వ్యూహాలకు గట్టి జర్క్ ఇచి్చంది. ఖరీదైన శాటిలైట్లతో పనిలేకుండా వాడి పారేసే రాకెట్ వ్యర్థాలనే బంగారంగా మారుస్తూ అంతరిక్షంలో ఏఐ క్లౌడ్ సామ్రాజ్యాన్ని నిర్మించేందుకు చెన్నైకి చెందిన ‘అగ్నికుల్ కాస్మోస్’సిద్ధమైంది. 2026 ఏడాది చివరి నాటికి జరగనున్న ఈ ప్రయోగం ఎలాన్ మస్క్ ‘స్పేస్ ఎక్స్’ఆధిపత్యానికి గట్టి సవాల్ విసురుతోంది. మస్క్ వర్సెస్ అగ్నికుల్.. ఎలాన్ మస్క్ ఇప్పటికే అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ)లో ఒక దరఖాస్తు సమరి్పంచారు. ఏకంగా 10 లక్షల కంప్యూటింగ్ శాటిలైట్లను ప్రయోగించి, నింగిలో ఒక ‘సూపర్ కంప్యూటర్ నెట్వర్క్’నిర్మించాలనేది మస్క్ మహా ఆలోచన. దీనికోసం వేల కోట్ల రూపాయల పెట్టుబడి, భారీగా ఇంధనం ఖర్చు అవుతుంది. కానీ, అగ్నికుల్ తన పేటెంట్ టెక్నాలజీ ‘సూరజ్’ద్వారా ఒక అద్భుతం చేస్తోంది. రాకెట్ తన లక్ష్యాన్ని చేరాక మిగిలిపోయే పైభాగాన్ని పారేయకుండా, దాన్నే ఒక శక్తివంతమైన ఏఐ డేటా సెంటర్‌గా మారుస్తోంది. మస్క్ కొత్త ఇల్లు కడుతుంటే, అగి్నకుల్ పాత ఇటుకలతోనే రాజప్రసాదం కడుతున్నట్టుగా ఈ ‘జర్క్’టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. అంతరిక్షమే ఎందుకంటే? భూమిపై డేటా సెంటర్లు నడపాలంటే కోట్ల లీటర్ల నీరు, నిరంతరాయంగా అత్యధిక స్థాయిలో విద్యుత్ అవసరం. పైగా పవర్ గ్రిడ్ విఫలమైతే, ఇక్కడి సెంటర్లు కేవలం 72 గంటల వరకు మాత్రమే బ్యాకప్‌తో నడవగలవు. అదే అంతరిక్షంలో అయితే సూర్యుని నుంచి అంతులేని సౌరశక్తి నిరంతరం లభిస్తుంది. సెమీకండక్టర్ వ్యవస్థలను చల్లబరిచేందుకు ప్రత్యేకంగా నీరు అక్కర్లేదు. అంతరిక్షంలోని శూన్యమే వాటిని చల్లబరుస్తుంది. అత్యంత తక్కువ ఖర్చులో మన అగి్నకుల్ ఈ అవసరాలు తీర్చనుంది. విశ్వ యుద్ధంలో సరికొత్త ఆర్కిటెక్ట్! చైనా ఇప్పటికే 2,00,000 శాటిలైట్లను ప్రయోగించాలని తలపోస్తోంది. ఎన్విడియా మద్దతున్న స్టార్‌క్లౌడ్ కూడా రేసులో ఉంది. కానీ భారత్ చూపుతున్న ‘పునర్వినియోగ’వ్యూహం అంతర్జాతీయంగా ప్రశంసలు పొందుతోంది. నిన్నటి వరకు విదేశీ శాటిలైట్లను మోసుకెళ్లే ‘లారీ డ్రైవర్’లాంటి స్థాయి నుంచి నేడు అంతరిక్షంలో మేధో సంపత్తిని నిర్మించే ‘ఆర్కిటెక్ట్’స్థాయికి భారత్ ఎదిగింది. తాజాగా కేంద్ర బడ్జెట్–2026లో ప్రకటించిన ప్రోత్సాహకాలతో 2027 నాటికి భారత్ తన మొదటి అంతరిక్ష ఏఐ సేవలను ప్రపంచానికి అందించనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రోదసిలో నిఘా యుద్ధం!
జేమ్స్‌బాండ్ సినిమాల్లో హీరో అలవోకగా ఖండాలన్నీ చుట్టేస్తుంటాడు. చట్టవ్యతిరేక, విద్రోహ సంస్థల గుట్టుమట్లు రట్టుచేసి భారీ ఉపద్రవాలను అడ్డుకుంటాడు. శత్రువుల రహస్య స్థావరాలను నేలమట్టం చేస్తుంటాడు. ఈ నిఘా పోరు 21వ శతాబ్దపు వాస్తవిక ప్రపంచంలో భూమిని దాటేసి ఏకంగా అంతరిక్షానికి చేరింది! ఇంతకాలం నేలల తేమ శాతం, అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు తదితరాలపై అధ్యయం చేస్తూ వచి్చన ఉపగ్రహాలు నిఘా కార్యకలాపాల్లో తలమునకలు అవుతున్నాయి. వైరి దేశాల ఉపగ్రహాలపై కన్నేస్తున్నాయి. ఏ సమయంలో ఏ దేశంపై ఎందుకు తిరగాడుతున్నాయో కూపీ లాగుతున్నాయి. ప్రధాన దేశాలన్నీ దాదాపుగా ఇదే బాటపట్టడంతో ఇప్పుడు అంతరిక్షంలో సరికొత్త శాటిలైట్ నిఘా యుద్ధానికి తెర లేచింది. బెంగళూరుకు చెందిన దిగంతర సంస్థ ఒకటి ఇటీవల ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్‌్కకు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ల జాడను విజయవంతంగా కనిపెట్టడం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన అజిస్టా స్పేస్ సంస్థ ఏకంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం( ఐఎస్ఎస్) ఎప్పుడు, ఎక్కడ తిరుగుతోందో కనిపెట్టి ఔరా అనిపించింది. వీటిని ఒకరకంగా ఇతర ఉపగ్రహాలపై నిఘా ఘటనలుగానే చెప్పొచ్చు. శత్రు ఉపగ్రహాల జాడను కనిపెట్టేందుకు సరికొత్త ‘స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్’ (ఎస్ఎస్ఏ) పరిజ్ఞానం ఇప్పుడు కీలకంగా మారింది. రెండు ఉపగ్రహాలు పొరపాటున ఢీకొనే ఆస్కారాన్ని తప్పించడమే గాక వాటి సిగ్నళ్లను జామ్ చేయడం, శాటిలైట్‌ను ధ్వంసం చేయడాన్ని నిలువరించడం కోసం ముందు ప్రత్యర్థి ఉపగ్రహాలు ఎక్కడున్నాయో కనీసం పక్కాగా తెలిసి ఉండాలి. ఈ కారణంగా కూడా నింగిలో నిఘా నేత్రాన్ని తెరవాల్సిన అనివార్యత దేశాలకు ఏర్పడిందని ఇండియన్ స్పేస్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) ఏకే భట్ అన్నారు. ఈ నేపథ్యంలో ‘స్పైయింగ్ ఇన్ స్కై’ ఇప్పుడిక ఎంతమాత్రమూ సైన్స్‌ఫిక్షన్ స్థాయికి పరిమితం కాలేదు. భూమిపై జేమ్స్‌బాండ్ చేసి పనినే ఇప్పుడు ఆకాశంలో కృత్రిమ ఉపగ్రహాలు విస్తృతస్థాయిలో చేయబోతున్నాయి. ఇందులో ఆధిపత్యం ఎవరితో భవిష్యత్తులో తేలిపోనుంది. ఎవరు గమనిస్తున్నారో తెలిసుండాలి ‘‘కమ్యూనికేషన్, సైనిక, పౌర, పరిశోధనావసరాల కోసం ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నా అవి రహస్య పనులనూ చేస్తున్నాయి. ఇతర దేశాల ఉపగ్రహాలు భారత్‌లోని ఏఏ భూభాగాలపై ఎందుకు తిరుగుతున్నాయో కచి్చతంగా మనకు తెల్సి ఉండాల్సిందే. ఇది నిఘా, వ్యూహాత్మక ఆపరేషన్లకు అత్యంత కీలకం. అందుకే శత్రు దేశాల ఉపగ్రహాలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఏర్పడింది’’ అని అజిస్టా స్పేస్‌లో స్పేస్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ విభాగ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ భరత్ సింహా రెడ్డి చెప్పారు. ‘‘ఉక్రెయిన్–రష్యా యుద్ధం మొదలు ఆపరేషన్ సిందూర్దాకా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధా్దలకు కీలక సమాచారం ఉపగ్రహాల నుంచే అందింది. కమ్యూనికేషన్స్, ఇంటెలిజెన్స్, నేవిగేషన్, టార్గెట్ ఇలా అన్ని విభాగాలను పటిష్టంచేయడంలో శాటిలైట్లే కీలక పాత్ర పోషించాయి’’ అని దిగంతర సీఈఓ, వ్యవస్థాపకులు అనిరుధ్ శర్మ అన్నారు. సామర్థ్యాన్ని పెంచుకుంటున్న భారత్స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ (ఎస్ఎస్ఏ)లో ప్రైవేట్ భాగస్వాములను ప్రోత్సహిస్తూ భారత్ అంతర్జాతీయ నిఘా సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఏటా ఆరు నుంచి పది ఉపగ్రహాలను తయారు చేసేలా అజిస్టా సంస్థ కొత్త ఎలక్ట్రో–ఆప్టికల్ పేలోడ్ తయారీ కర్మాగారాన్ని నిర్మిస్తోంది. ఇది 2027 ద్వితీయార్ధంలోపు ప్రారంభం కావచ్చు. శత్రువులు ప్రయోగించే క్షిపణుల జాడను శాటిలైట్ ద్వారా గుర్తించే కొత్త ఉపగ్రహాన్ని 2027లోపు ప్రయోగిస్తామని ఈ సంస్థ తెలిపింది. అంతరిక్షంలో అర్లీ వారి్నంగ్ సిస్టమ్‌ను ఇది మరింత పటిష్టపరచనుంది. సాంప్రదాయకంగా భూతలంపై రాడార్ వ్యవస్థలు, ఆకాశంలో చక్కర్లు కొట్టే నిఘా విమానాలకు తోడుగా ఇప్పుడు అంతరిక్షంలోనూ నిఘా ఉపగ్రహాల రాకతో భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కాబోతోంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతరిక్ష సంక్షేమం కోసం స్టార్‌గేజ్
ఇతరుల బాగు కోరే వారే మంచి మనిషి అని శతాబ్దాలుగా వింటున్నాం. ఇప్పుడీ మంచి పనిని అంతరిక్ష వేదిగా ఆచరించి చూపుతా మని ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్‌కు చెందిన ‘స్పేస్ఎక్స్’ సంస్థ శనివారం ప్రకటించింది. అంతరిక్షంలో వందల కిలోమీటర్ల ఎత్తులో వేర్వేరు కక్ష్యల్లో తిరిగే కృత్రిమ ఉపగ్రహాలు హఠాత్తుగా స్థానచలనం చెందిన విపత్కర సందర్భాల్లో సమీప ఉపగ్రహాల ఆపరేటర్లను అప్రమత్తంచేసే అత్యాధునిక ఆన్లైన్ టూల్ ‘స్టార్‌గేజ్’ను అందుబాటులోకి తెచ్చినట్లుస్పేస్ఎక్స్ ప్రకటించింది. దీనిని స్పేస్ సిట్యూవేషనల్ అవేర్నెస్ సిస్టమ్ అని కూడా పిలుస్తున్నారు.ఏమిటీ స్టార్‌గేజ్?ఇదొక అప్రమత్త వ్యవస్థ. ఉపగ్రహాల ఇంధనం ఖాళీ అవడం, లేదా ఉపగ్రహం విఫలమై దిగువ కక్ష్యలోకి జారిపోవడం లేదా స్వేచ్ఛగా ఇష్టమొచ్చినట్లు తిరిగే సందర్భాల్లో అవి అంతరిక్ష బాంబుల్లా మారిపోతాయి. సమీప ఉపగ్రహాలకు ఢీకొట్టి సర్వనాశనం చేస్తాయి. తర్వాత ఇది శృంఖల చర్యలా విశృంఖలంగా జరిగి వందల ఉపగ్రహాలు ధ్వంసమయ్యే పెను ప్రమాదముంది. ఈ అంతరిక్ష ప్రమాదాన్ని మొగ్గదశలోనే తుంచేసే శక్తి ఈ స్టార్గేజ్కు ఉంది. అస్తవ్యస్తంగా కదులుతున్న ఉపగ్రహాల జాడ, లొకేషన్‌ను ఇతర ఆపరేటర్లకు ఉచితంగా స్పేస్ఎక్స్ అందిస్తుంది. దాంతో తమ ఉపగ్రహాలను ఆ ప్రమాదకర ఉపగ్రహం నుంచి దూరంగా తీసుకెళ్లడమో, దిగువ కక్ష్యలోకి సురక్షితంగా మార్చడమో సాధ్యమవుతుంది. దీంతో ఉపగ్రహాల యాక్సిడెంట్‌ను నివారించవచ్చు. కేవలం ఉపగ్రహాలు మాత్రమేకాకుండా హఠాత్తుగా దూసుకొచ్చిన చిన్నపాటి గ్రహశకలాల లొకేషన్‌నూ ఆపరేటర్లకు స్టార్‌గేజ్ అందిస్తుంది. అత్యంత ఖచ్చితత్వంతో కూడిన సమాచారం ఇవ్వడం స్టార్‌గేజ్ ప్రత్యేకత. అత్యాధుని సెన్సార్లు, సంక్టిష్లమైన సాఫ్ట్వేర్ సాయంతో పాత ఉపగ్రహాల శకలాలనూ స్టార్‌గేజ్ గుర్తించి వాటి జాడను ఆపరేటర్లకు అందజేస్తుంది. ఒకచోట పొగుబడిన శకలాల ప్రాంతాలను గుర్తించి అప్రమత్తంచేస్తుంది. ఉపగ్రహాలు ఢీకొట్టే అవకాశాలు గణనీయంగా తగ్గించి తద్వారా అంతరిక్ష చెత్త పోగుబడకుండా, ఆ ప్రాంతంలో మరో కొత్త ఉపగ్రహం వచ్చి చేరేందుకు మార్గం సుగమం చేస్తుంది. పౌర, సౌనిక, నిఘా, వాతావరణ ఉపగ్రహాల ప్రయోగాలతో దిగువ భూకక్ష్యల్లో కొత్త ఉపగ్రహాల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీనికితోడు వేలాది ఉపగ్రహాల కూటమి స్టార్‌లింక్‌తో ఉపగ్రహాల సంఖ్య వేలాదిగా ఎక్కువైంది. ఈ తరుణంలో అంతరిక్షం సైతం ఒక రద్దీ అయిన రహదారిలో మారింది. రోడ్డుపై వాహనాలను క్రమబద్ధీకరించే ట్రాఫిక్ కానిస్టేబుల్ తరహా వ్యవస్థ తక్షణావసరమైంది. ఈ అవసరాన్ని స్టార్‌గేజ్ తీర్చనుంది.అదనంగా కంజంక్షన్ స్క్రీనింగ్ సర్వీస్..ఇప్పుడున్న ఉపగ్రహాలు కొన్ని గంటల తర్వాత ఏ దిశగా ఎంత దూరం కదులుతాయి అనే వివరాలను స్టార్‌గేజ్ ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ ఉపగ్రహాల ఆపరేటర్లకు ఉచితంగా అందివ్వనుంది. దీంతో తోటి ఉపగ్రహాలతోపాటు ఖగోళ వస్తువులు, స్పేస్ చెత్త ఎక్కడున్నాయో ఇట్టే తెల్సిపోతుంది. వీటికి అనుగు ణంగా ఆపరేటర్లు తమ భవిష్యత్ ఉ పగ్రహాల ప్రయోగాల తేదీలను సవరించుకోవ చ్చు. దీని వల్ల అత్యంత విలువైన సమయం, ప్రయోగాల ఖర్చు కలిసివస్తాయి. స్టార్‌గేజ్ అందించనున్న అత్యంత విలువైన డేటా షేరింగ్ సమాచారాన్ని నాసా, ఇతర అంతర్జాతీయ ఉపగ్రహ ఆపరేటర్లు ఎప్పట్నుంచో కోరుతుండగా ఇన్నేళ్లకు ఇది సాకారమైంది. గత ఏడాది డిసెంబర్లో స్టార్‌లింక్ ఉపగ్రహ కూటమికి అత్యంత సమీపంగా చైనా ఉపగ్రహం దూసుకొచ్చింది. అవి ఢీకొట్టే పెనువినాశనం సంభవించేది. దీంతో భయపడిన స్టార్‌లింక్ ఏకంగా తమ 4,400 ఉపగ్రహాలను వెనువెంటనే 480 కిలోమీటర్ల దిగువ కక్ష్యలోకి తీసుకురావాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దనే సదుద్దేశంతో ఉచితంగా ఈ సేవలను స్టార్‌లింక్ అంతర్జాతీయంగా అన్ని దేశాలకు అందుబాటులోకి తెచ్చింది. కంజంక్షన్ డేటా మెసేజెస్(సీడీఎం)లను ఎప్పటికప్పుడు స్టార్‌గేజ్ పంపనుంది. కంజంక్షన్ స్క్రీనింగ్ సర్వీస్ ద్వారా గంటల తర్వాత రావాల్సిన డేటాను కేవలం నిమిషాల్లోనే సీడీఎంల రూపంలో ఆపరేటర్లు పొందొచ్చు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
స్టార్‌లింక్ శాటిలైట్లకు రష్యా ముప్పు
పారిస్: ప్రొపల్షన్ సిస్టమ్ సమస్యతో ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ఉపగ్రహ కూటమిలోంచి కృత్రిమ ఉప గ్రహం ‘35956’ అదుపుతప్పి భూమి దిశగా కదులుతూ కొత్త ముప్పుమోసుకొస్తుంటే అంతకుమించి పెను ముప్పు రష్యా రూపంలో పొంచి ఉందని పశ్చిమదేశాల నిఘా వర్గాలు ఆందోళనవ్యక్తంచేశాయి. అంతరిక్షంలో కక్షలో తిరిగే వందలాది కృత్రిమ ఉపగ్రహాలను పిట్టల్లా రాల్చేసే అధునాతన ఆయుధాన్ని తయారు చేయడంలో రష్యా తలమునకలైందని పశ్చిమదేశాల నిఘా వర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. ఈ మేరకు నిఘా సమాచారంతో ది అసోసియేటెట్ ప్రెస్ వార్తాసంస్థ ఒక కథనాన్ని వెలువర్చింది.దాని పేరు జీరో ఎఫెక్ట్అంతరిక్షంలోని ఉపగ్రహాలపైకి అత్యంత సాంద్రతతో తయారుచేసిన సూక్ష్మ పెల్లెట్లను ప్రయోగించి వాటికి తీవ్ర నష్టం కలిగేలా చేయడమే రష్యా ఆయుధం అసలు లక్ష్యం. ఈ ఆయుధానికి ‘జీరో ఎఫెక్ట్’ అని పేరుపెట్టినట్లు తెలుస్తోంది. వందలాది పెల్లెట్లను ఒకేసారి ప్రయోగించడంతో వాటి ధాటికి ఒకేసారి పెద్ద సంఖ్యలో శాటిౖలైట్లును సర్వనాశనం అవుతాయి. ఇవి చిన్నచిన్న ముక్కలుగా శకలాలుగా చెల్లాచెదురుగా పడడంతో సమీప కక్ష్యల్లోని ఇతర ఉపగ్రహాలకు సైతం దెబ్బతింటాయి. దీంతో వినాశనం ఊహించనంత పెద్దదిగా ఉంటుంది. ఇంతటి పెనువినాశనం సృష్టించగల ఆయుధాన్ని రష్యా సృష్టించకుండా ఉంటుందని తాము భావించట్లేమని అమెరికాలోని ప్రభుత్వేతర ‘ సెక్యూర్ వరల్డ్ ఫౌండేషన్’లోని అంతరిక్ష భద్రతా నిపుణుడు విక్టోరియా సామ్సన్, కెనడా సైన్యంలోని అంతరిక్ష విభాగ బ్రిగేడియర్ జనరల్ క్రిస్టోఫర్ హోర్నర్ వ్యాఖ్యానించారు. జీరో ఎఫెక్ట్ ఆయుధ తయారీ మీడియా ప్రశ్నించగా రష్యా అధ్యక్షకార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ డొంకతిరుగుడు సమాధానం చెప్పారు. ‘‘ కక్షలో తిరగగలిగే సామర్థ్యమున్న ఆయుధాల ప్రయోగాలను శత్రుదేశాలు ఆపేలా ఐరాస చొరవచూపాలి. అయినా అణ్వస్త్ర సామర్థ్యమున్న అంతరిక్ష ఆయుధాలను మొహరించబోమని పుతిన్ గతంలోనే చెప్పారు’’ అని పెస్కోవ్ వ్యాఖ్యానించారు. తక్కువ ఎత్తులో తిరిగే స్టార్‌లింక్ ఉపగ్రహాలు రష్యా గగనతలంపై నిఘా పెట్టి ఉక్రెయిన్ దిశలో రష్యా సేనల జాడను గుర్తించి ఉక్రెయిన్‌కు అందిస్తున్నాయి. దీంతో స్టార్‌లింక్ ఉపగ్రహాలు తమ సార్వభౌమత్వం, భద్రతకు ముప్పుగా వాటిల్లాయని వీటిని నాశనంచేయాలని రష్యా భావిస్తోందని పశ్చిమాసియా నిఘా వర్గాలు నిర్ధారించాయి.పొడవు మిల్లీమీటర్!‘‘హఠాత్తుగా నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ల వంటి వాటినే గుర్తించగలం. కేవలం మిల్లీమీటర్ పొడవుండే సూక్ష్మ పెల్లెట్లను భూతల, గగనతల నిఘా వ్యవస్థలు గుర్తించలేవు. వీటితో ఉపగ్రహాలపై దాడి చేస్తే నష్టనివారణ అసాధ్యం. పెల్లెట్ల దెబ్బకు ఒక కక్షలోని ఉపగ్రహాలన్నీ నాశనంఅవుతాయి. అదీకాకుండా దాడి చేసింది రష్యానే అని నిరూపించడం కూడా చాలా కష్టం. మిల్లీమీటర్ పొడవు పెల్లెట్లతో ఉపగ్రహాలకు మరణశాసనం రాయొచ్చు. చైనా ఉదంతమే ఇందుకు చక్కటి ఉదాహరణ. నవంబర్‌లో సూక్ష్మస్థాయి అంతరిక్ష శకలం తగిలి చైనా వ్యోమనౌక దెబ్బతింది. దాంతో చైనా సొంత అంతరిక్ష కేంద్రం నుంచి అది బయల్దేరలేక అక్కడే ఉండిపోయింది. దాంతో దాని ద్వారా భూమి మీదకు రావాల్సిన చైనా వ్యోమగాములు సైతం అక్కడే చిక్కుకుపోయారు’’ అని బ్రిగేడియర్ జనరల్ క్రిస్టోఫర్ హోర్నర్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ ఉపగ్రహాల ఉపరితలాల్లో అధిక ప్రాంతాన్ని ఆక్రమించేవి సౌర ఫలకాలే. పెల్లెట్ల ఉరవడికి ఇవన్నీ బద్దలవుతాయి. అప్పుడు ఉపగ్రహం మనుగడ ప్రశ్నార్థకమవుతుంది’’ అని వాషింగ్టన్‌లోని ‘సెంటర్ ఫర్ స్ట్రాటజీ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్’లో అంతరిక్ష భద్రత, ఆయుధాల నిపుణుడు క్లేటన్ స్వాప్ చెప్పారు. స్టార్‌లింక్ ఉపగ్రహాలు భూమి నుంచి ఆకాశంలో 500 కిలోమీటర్ల ఎత్తులో సంచరిస్తున్నాయి. వీటి కింది కక్షల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, చైనా వారి తియాంగ్ స్పేస్ స్టేషన్ తిరుగుతున్నాయి. రష్యా దాడి చేస్తే ఉపగ్రహాలు శకలాలుగా ఛిద్రమై అవి ఐఎస్ఎస్, తియాంగ్ స్పేస్స్టేషన్లనూ నాశనంచేసే ఆస్కారముంది. -
ధరణిని దాటి శుక్రుడిని చూసి..
అప్పగించిన పనిచేయకుండా ఆవారాగా తిరిగితే ఎవరైనా తిడతారు. కానీ చెప్పిన పని చేస్తూనే మరో కొత్త విషయాన్ని కనిపెట్టినందుకు ప్రశంసలను అందుకున్నాయి రెండు జపాన్ ఉపగ్రహాలు. భూవాతావరణ విశేషాలను రాబట్టేందుకు ప్రయోగించిన హిమవరీ–8, హిమవరి–9 కృత్రిమ ఉపగ్రహాలు చివరకు శుక్ర గ్రహ మేఘావృత ఉష్ణోగ్రతల్లో వైరుధ్యాలను వెల్లడించి ఇప్పుడు శెభాష్ అనిపించుకున్నాయి. శుక్రగ్రహం మీది వాతావరణ తరంగాల్లో మార్పులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇవి సేకరించాయి. దశాబ్దకాల డేటా.. బిర్లాటెంపుల్ ముందు ఒక పేద్ద కుటుంబం ఒకరి తర్వాత ఒకరు ఫొటోలు దిగుతుందనుకుందాం. అప్పుడు సమీపంలో గుర్తు తెలియని పిల్లాడు ఉంటే అతను ఈ ఫొటోలన్నింటిలోనూ పడతాడు. అతని హావభావాలన్నీ స్పష్టంగా తెలుస్తాయి. అచ్చం అలాగే భూ స్థిర కక్ష్యలో తిరుగుతూ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి భూ వాతావరణ ఫొటోలు తీసేందుకు జపాన్ హిమవరి–8 ఉపగ్రహాన్ని 2014లో, హిమవరి–9 అనే ఉపగ్రహాన్ని 2016లో నింగిలోకి పంపింది. ఇవి 2015 నుంచి ఇప్పటిదాకా వేలాది ఫొటోలను తీశాయి. అయితే వీటిని గమనించగా అన్ని ఫొటోల్లోనూ ఒక మూలగా శుక్రుడు సైతం కనిపించాడు. దీంతో ఈ పదేళ్లకాలంలో శుక్రుని వాతావరణ మార్పుల వివరాలను సేకరించేందుకు సువర్ణావకాశం లభించింది. ఇది సువర్ణావకాశం ఎందుకంటే భూమి నుంచి టెలిస్కోప్ ద్వారా శుక్రుడిని గమనించాలంటే భూవాతావరణం అంతగా అనుకూలించదు. పైగా అదే సమయంలో సూర్యుడి దేదీప్యమానమైన కాంతి ప్రభావం శుక్రునిపై ఉంటుంది. దాంతో భూమి నుంచి శుక్రుడిని గమనించడం కష్టం. ఇప్పటికే శుక్రుడి సంబంధింత వర్ణ తరంగధైర్ఘ్య సమాచారం సైతం పెద్దగా ఉపయోగపడలేదు. ఈ నేపథ్యంలో అనుకోకుండా రెండు వాతావరణ ఉపగ్రహాల డేటాలో చిక్కిన శుక్రుని వివరాలు ఇప్పుడు ఆ గ్రహ వాతావరణంపై పరిశోధనకు అక్కరకొస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలు శుక్రునిపై మందపాటి కార్భన్‌డయాక్సైడ్ వాతావరణం పరుచుకుని ఉంటుంది. పైగా ఆకాశం సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలలతో కప్పబడి ఉంటుంది. గత పదేళ్లుగా హిమవరి 8, 9 ఉపగ్రహాలు పంపిన సమాచారాన్ని యూనివర్సిటీ ఆఫ్ టోక్యో పరిశోధకులు విశ్లేíÙంచారు. మల్టీస్పెక్ట్రల్ హిమవరి ఇమేజర్స్ సాయంతో రోజువారీగా, సంవత్సరాలవారీగా వాతావరణ మార్పులను సరిపోల్చిచూశారు. ‘‘గతంలో ఏ ఉపగ్రహాన్ని ఇలా పదేళ్లపాటు నిరాటంకంగా పరిశీలించలేదు. భూమి కోసం ఉద్దేశించిన ఉపగ్రహాలు అనుకోకుండా ఇలా శుక్రుని డేటాను ఒడిసిపట్టాయి. శుక్రుని వాతావరణంలో సూర్యకాంతి పరావర్తనం, గాలి వేగం, ఉష్ణోగ్రతల్లో మార్పుల వివరాలు తెల్సుకునేందుక ఈ డేటా ఎంతగానో ఉపయోగపడుతోంది. ఉష్ణ తరంగాల్లో మార్పులనూ తెల్సుకోవచ్చు’’అని పరిశోధనలో కీలక రచయిత అయిన గక నిషయమ చెప్పారు. ‘‘విభిన్న తరంగధైర్యాలతో విస్తరించే పరారుణ కాంతిని ఒడిసిపట్టేందుకు హిమవరి శాటిలైట్లలోని సెన్సార్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. మరో నాలుగేళ్లపాటు ఇవి సేవలందిస్తాయి. 2030దాకా ఏ దేశం కూడా శుక్రుని వాతావరణ పరిశోధన కోసం ప్రత్యేక ప్రాజెక్ట్చేపట్లేదు. ఈ నేపథ్యంలో హిమవరి శాటిలైట్ల తదుపరి డేటా సైతం కీలకంగా మారనుంది’’అని నిషయమ చెప్పారు. పరిశోధకులు 437 భిన్న వాతావరణ పరిస్థితుల్లో శుక్రునిపై మేఘాల పరిస్థితిని విశ్లేషిస్తున్నారు. శుక్రుడు, భూమి వేర్వేరు కోణాల్లో సమీపానికి వచి్చనప్పుడు శుక్రుని వాతావరణంలో జరిగే మార్పులను తెల్సుకునేందుకు ఇప్పుడు అవకాశం చిక్కింది. హిమవరి అంటే జపాన్ భాషలో పొద్దుతిరుగుడు పువ్వు అని అర్థం. నిరంతరంగా భూమిని పరిశీలిస్తూ భూ స్థిర కక్ష్యలో తిరుగుతాయని, అందుకు గుర్తుగా ఈ పేరు ఎంపికచేసినట్లు ఆనాడు జపాన్ ప్రకటించింది. -
భూకంప ప్రభావం అంతరిక్షంలో!!
పట్టాలపై రైలు పరుగులు తీస్తుంటే.. హఠాత్తుగా ముందున్న ఇంజిన్ కాస్తంత నెమ్మదించినా వెనకాలే క్యూ కట్టిన బోగీలన్నీ టపటపా ఢీకొన్నంత పనిచేస్తాయి. ఎందుకంటే ప్రతి బోగీ పక్క బోగీతో అనుసంధానమై ఉంటుంది. కానీ ఎలాంటి అనుసంధానంలేని సుదూర శాటిలైట్లు సైతం భూకంపం వేళ ప్రభావితం అవుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. భూకంపం ధాటికి భూకంపకేంద్ర సమీప భవనాలు, భవంతులు పేకమేడల్లా కదలిపోవడం చూస్తుంటాం. కానీ ఆకాశంలో ఉండే కృత్రిమ ఉపగ్రహాల పనితీరు సైతం భూకంపాల తీవ్రతకు లోనవుతోందని తాజా పరిశోధనలో తేలింది. భౌతికంగా భూమితో అనుసంధానంకాని ఉపగ్రహాలకు భూకంప పర్యవసానాలకు మధ్య గల సంబంధాన్ని తొలిసారిగా ఈ పరిశోధన ఆవిష్కరించింది. జపాన్‌లోని నగోయా విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తల బృందం చేసిన ఈ పరిశోధనా తాలూకు వివరాలు ‘ఎర్త్, ప్లానెట్స్, స్పేస్’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. భూతలం సహా గగనతలం.. రెండు భూఫలకాల కొనల వద్ద రాపిడి, ఢీకొనే సందర్భాల్లో భూకంపం సంభవిస్తుంది. ఇవి భూతల వనరులనే కాదు గగనతల కృత్రిమ వనరులైన శాటిలైట్లనూ ప్రభావితం చేస్తాయని అధ్యయనకారుల్లో అనుమానం మొదలైంది. ఈ అనుమానాన్ని నివృత్తిచేసుకునేందుకు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(జీఎన్ఎస్ఎస్)లోని 4,500కుపైగా రిసీవర్ల ద్వారా సమగ్ర సమాచారాన్ని తెప్పించుకుని ఆ డేటాతో త్రిమితీయ(3డీ) ‘‘వాతావరణ ఇబ్బందుల’’ముఖచిత్రాన్ని రూపొందించారు. 2024 జనవరి ఒకటో తేదీన జపాన్‌లోని ఇషికావా ప్రిఫెక్ఛర్లోని నోటో ద్వీపకల్పంలో రిక్టార్ స్కేల్‌పై 7.5 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం సంభవించింది. అప్పుడు ఆకాశంలోకి సంక్లిష్టమైన ధ్వని తరంగాలు దూసుకెళ్లాయి. ఇవి భూమి నుంచి ఆకాశంలో 60 నుంచి 1,000 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న అయనో ఆవరణం(ఐనోస్ఫియర్)లోకి వెళ్లాయి. అక్కడి స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లతో నిండిన వాయువులను ఈ ధ్వనితరంగాలు విపరీతంగా ప్రేరేపించాయి. దాంతో ఈ వాయువులు కింద పొర అయిన థర్మోస్ఫియర్ వాతావరణంలోకి కొంత శక్తిని విడుదలచేశాయి. అప్పటికే థర్మోస్పియర్ ఆవరణలో స్థిరంగా ఉన్న శాటిలైట్లపై ఈ అదనపు శక్తి ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో శాటిలైట్ల నుంచి భూమి మీదకు జరగాల్సిన కమ్యూనికేషన్ సిగ్నళ్ల ప్రసరణ వేగంలో మార్పులు కనిపించాయి. సిగ్నళ్లు ఆలస్యంగా రావడంతోపాటు సిగ్నళ్లలో సాంద్రత సైతం తగ్గిపోయినట్లు గుర్తించారు. టోమోగ్రఫీ సాయంతో వైద్యరంగంలో వాడే సీటీ స్కాన్ తరహాలో వేర్వేరు కోణాల్లో శాటిలైట్ల డేటాను క్రోడీకరించి 3డీ చిత్రాలను రూపొందించారు. భూకంపం సంభవించినప్పుడు కేవలం పది నిమిషాల వ్యవధిలోనే ధ్వని తరంగాలు ఐనోఆవరణను చేరిపోతున్నాయి. ప్రశాంత కొలనులో రాయి విసిరితే ఏర్పడే వలయాకార అలల్లా ధ్వని తరంగాలు ఐనోస్ఫియర్‌లోకి వెళ్తున్నాయి. భూకంపం సంభవించినప్పుడు భూఫలకాలు ఢీకొన్న ఒక్క ప్రాంతంలోనే ధ్వని తరంగాలు ఉధ్భవిస్తాయని గతంలో భావించారు. అలాకాకుండా నోటో ద్వీపకల్ప ఘటనలో 150 కిలోమీటర్ల పొడవునా రెండు భూఫలకాలు ఢీకొన్న చోట్ల నుంచి ధ్వనితరంగాలు పుట్టుకొచ్చాయని, ఇలాంటి సందర్భాల్లోనే అధిక తరంగాలు ఉద్భవిస్తున్నాయని ఈ పరిశోధనలో ముఖ్య రచయిత డాక్టర్ వెజియాంగ్ ఫూ చెప్పారు. పలు సమస్యలు.. ధర్మోస్ఫియర్పై అదనపు ఒత్తిడితో శాటిలైట్ల నుంచి ప్రసారాల నాణ్యత తగ్గిపోవడంతో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్), శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భూకంపాలతో ఉపగ్రహాల పనితీరూ దెబ్బతింటుందని స్పష్టంగా అర్థమైందని మరో రచయిత, ప్రొఫెసర్ యుచీ ఒట్సుకీ చెప్పారు. భూకంపాల ముందస్తు హెచ్చరికల వ్యవస్థను మరింత పటిష్టచేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని యుచీ అభిప్రాయపడ్డారు. భూకంపాలతోపాటు సునామీ, అగి్నపర్వతాల విస్ఫోటం వంటి అత్యంత తీవ్ర వాతావరణ పరిస్థితులకూ తమ అధ్యయన మోడళ్లను అన్వయించి మరింత విస్తృతస్థాయి అవగాహనకు ప్రయతి్నస్తున్నామని పరిశోధకులు వెల్లడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నింగిలోకి దూసుకెళ్లిన కలప ఉపగ్రహం
వాషింగ్టన్: అత్యంత కఠినమైన లోహాలతో రూపొందిన కృత్రిమ ఉపగ్రహాలు కాలంచెల్లాక కక్ష్యల్లో స్పేస్‌జంక్‌గా పోగుబడుతున్న నేపథ్యంలో వాటికి ప్రత్యామ్నాయంగా కలపను భవిష్యత్తులో వాడే ఉద్దేశ్యంతో జపాన్ శాస్త్రవేత్తలు కలపతో ఉపగ్రహాన్ని తయారుచేశారు. ప్రపంచంలో తొలిసారిగా కలపతో తయారైన ‘లిగ్నోశాట్’ఉపగ్రహం అమెరికాలోని నాసా వారి కెన్నడీ అంతరిక్షప్రయోగ కేంద్రం నుంచి స్పేస్ఎక్స్ రాకెట్ లో నింగిలోకి దూసుకుపోయి ందని క్యోటో వర్సిటీ హ్యూమన్ స్పేసాలజీ సెంటర్ మంగళవారం ప్రకటించింది. కేవలం అరచేయి సైజులో 10 సెంటీమీటర్ల వృత్తాకార పరిమాణంలో ఈ బుల్లిశాటిలైట్ను తయారుచేశారు. ఒక కంటైనర్‌లో అమర్చి పంపారు. త్వరలో ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకోంది. కొద్దిరోజుల విరామం తర్వాత దీనిని ఐఎస్ఎస్ బయట ప్రవేశపెట్టనున్నారు. ఆరునెలలపాటు ఇది తన కక్ష్యలో తిరగనుంది. శూన్యంలో రోదసీ వాతావరణంలో కలప ఏ మేరకు మన్నికగా ఉంటుందనే విషయాలపై అధ్యయనం చేయనున్నారు. ప్రతి 45 నిమిషాలకు ఇది రోదసీలో చీకటి మొదలు తీక్షణమైన సూర్యరశ్ని దాకా అంటే మైనస్ 100 డిగ్రీ సెల్సియస్ నుంచి 100 డిగ్రీ సెల్సియస్దాకా భిన్న ఉష్ణోగ్రతలను తట్టుకోవాల్సి ఉంటుంది. కలపను దహించే ఆక్సిజన్ వంటి వాయువులు శూన్యంలో ఉండవుకాబట్టి అక్కడ కలప ధృఢంగా ఉండగలదని జపాన్‌లోని క్యోటో విశ్వవిద్యాలయ అటవీశాస్త్ర ప్రొఫెసర్ కోజీ మురాటా వాదిస్తున్నారు. ఖడ్గం పిడి, ఒరగా వాడే మంగోలియా జాతి హొనోకీ చెట్టు కలపను ఈ శాటిలైట్ తయారీలో వాడారు. జపాన్ సంప్రదాయక కళతో ఎలాంటి నట్లు, బోల్ట్‌లు, జిగురు వాడకుండానే లిగ్నోశాట్‌ను సిద్ధంచేశారు. కాలం చెల్లిన శాటిలైట్ తిరిగి భూవాతావరణంలోకి వచ్చేటపుడు ప్రమాదకర అల్యూమినియం ఆక్సైడ్ అణువులను వెలువరుస్తుంది. అదే కలప శాటిలైట్‌తో పర్యావరణానికి, కమ్యూనికేషన్ కక్ష్యలకు ఎలాంటి సమస్యలు ఉండవని క్యోటో వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బయట కలపశాటిలైట్ మన్నిక బాగుందని తేలితే భవిష్యత్తులో చంద్రుడు, మార్స్‌పై వ్యోమగాముల ఆవాసాలకు కలపను విరివిగా వాడే అవకాశముంది. ఐఎస్ఎస్ నుంచి సరకుల రాకపోకల్లోనూ కంటైనర్లకు కలపను వాడే వీలుంది. -
Nature Astronomy: కృత్రిమ ఉపగ్రహ కాంతితో భూమికి ముప్పు!
ఆధునిక సాంకేతిక యుగంలో మనషుల మనుగడ కృత్రిమ ఉపగ్రహాల (శాటిలైట్లు)పై ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు. అన్ని రంగాల్లోనూ వీటి అవసరం పెరిగిపోతోంది. అయితే ఈ ఉపగ్రహాల కాంతి, విద్యుత్ బల్బుల వెలుగుతో పుడమికి పెద్ద ముప్పు వాటిల్లుతున్నట్లు ఇటలీ, చిలీ, గేలిసియా శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. అధ్యయనం వివరాలను ‘నేచర్ అస్ట్రానమీ’ పత్రికలో ప్రచురించారు. రానున్న రోజుల్లో విపరిణామాలే: భూగోళం చుట్టూ ప్రస్తుతం 8,000కు పైగా శాటిలైట్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇవి భూమిపై ప్రతి అంగుళాన్ని కవర్ చేస్తున్నాయి. స్పేక్‌ఎక్స్ సంస్థ 3,000కు పైగా చిన్నపాటి ఇంటర్నెట్ శాటిలైట్లను ప్రయోగించింది. వన్‌వెబ్ కూడా వందలాది కృత్రిమ ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. దేశాల మధ్య పోటీ నేపథ్యంలో భవిష్యత్తులోనూ వీటి సంఖ్య పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు విద్యుత్ లైట్ల అవసరం పెరుగుతూనే ఉంది. శాటిలైట్ల నుంచి వెలువడే కాంతి, కరెంటు దీపాల నుంచి కాంతి వల్ల భూమిపై ప్రకృతికి విఘాతం వాటిల్లుతున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. వీటివల్ల రాత్రిపూట ఆకాశం స్పష్టంగా కనిపించడం లేదని తేల్చారు. ‘‘అంతేగాక ఖగోళ శాస్త్రవేత్తల విధులకూ ఆటంకం కలుగుతోంది. అస్ట్రానామికల్ అబ్జర్వేటరీల పనితీరు మందగిస్తున్నట్లు తేలింది. ఈ కాంతి కాలుష్యం కారణంగా రాత్రివేళలో అనంతమైన విశ్వాన్ని కళ్లతో, పరికరాలతో స్పష్టంగా చూడగలిగే అవకాశం తగ్గుతోంది. అంతేగాక భూమిపై జీవుల అలవాట్లలో, ఆరోగ్యంలో ప్రతికూల మార్పులు వస్తున్నాయి’’ అని వెల్లడించారు. దీనికి అడ్డుకట్ట వేసి సహజ ప్రకృతిని పరిరక్షించుకొనే దిశగా దృష్టి పెట్టాలని సూచించారు. పరిష్కారం ఏమిటి? కాంతి కాలుష్యానికి ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయి పరిష్కార మార్గం లేదని నిపుణులు అంటున్నారు. దాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టడం మేలు. ‘‘శాటిలైట్లలో బ్రైట్నెస్ తగ్గించాలి. టెలిస్కోప్ పరికరాల్లోని షట్టర్లను కాసేపు మూసేయడం ద్వారా కాంతి తీవ్రతను తగ్గించవచ్చు’’ అని సూచిస్తున్నారు. కృత్రిమ ఉపగ్రహాలతో కాంతి కాలుష్యమే గాక మరెన్నో సమస్యలున్నాయి. కాలం తీరిన శాటిలైట్లు అంతరిక్షంలోనే వ్యర్థాలుగా పోగుపడుతున్నాయి. అంతరిక్ష కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. పైగా వీటినుంచి ప్రమాదకర విష వాయవులు వెలువడుతుంటాయి. ఆర్బిటాల్ ట్రాఫిక్ మరో పెను సమస్య. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విమానాలకే తాత..!
ప్రపంచంలోనే అతి పెద్ద విమానం రన్‌వే ఎక్కనుంది. స్ట్రాటోలాంచ్ అని పిలిచే ఈ విమానం ఇటీవలే టెస్ట్ డ్రైవ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అన్ని పరీక్షల్లో విజయవంతమైతే 2019 నుంచి అందుబాటులోకి రానుంది. దీన్ని భూమికి తక్కువ దూరంలో ఉన్న కక్ష్యలోకి కృత్రిమ ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు ఉపయోగించనున్నారు. అంతేకాదు వ్యోమగాములను భూమిపైకి తీసుకురావడం, వారికి కావాల్సిన ఆహార పదార్థాలు అందించడం వంటి పనులు కూడా చేసి పెడుతుంది. దీని బరువెంతో తెలుసా.. దాదాపు 2.5 లక్షల కిలోల బరువుంటుంది. ఉన్న ఒక్కో ఇంజిన్ బరువే 4వేల కిలోలు ఉంటుందట. దీని ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఒక్కో రెక్క పొడవు దాదాపు 3.8 మీటర్లు ఉంటుంది. -
అమెరికా వన్‌వెబ్‌లో సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు
టోక్యో: జపాన్‌కు చెందిన టెలికం, ఇంధన దిగ్గజ కంపెనీ సాఫ్ట్‌బ్యాంక్, అమెరికాకు చెందిన వన్‌వెబ్ కంపెనీలో వంద కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నది. ఈ రెండు కంపెనీలు కలిసి ఫ్లోరిడాలో కృత్రిమ ఉపగ్రహాలు తయారు చేసే ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీ తక్కువ వ్యయంతో వారానికి 15 కృత్రిమ ఉపగ్రహాలు తయారు చేస్తుంది. ఈ ఫ్యాక్టరీ కారణంగా ఇంజినీరింగ్, తయారీ, ఇతర రంగాల్లో మొత్తం 3,000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా.2018 కల్లా ఈ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తుందని వన్‌వెబ్ భావిస్తోంది.


