Nature Astronomy: కృత్రిమ ఉపగ్రహ కాంతితో భూమికి ముప్పు!

Nature Astronomy: Satellites are unprecedented global threat - Sakshi

జీవుల అలవాట్లు, ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం

ఆధునిక సాంకేతిక యుగంలో మనషుల మనుగడ కృత్రిమ ఉపగ్రహాల (శాటిలైట్లు)పై ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు. అన్ని రంగాల్లోనూ వీటి అవసరం పెరిగిపోతోంది. అయితే ఈ ఉపగ్రహాల కాంతి, విద్యుత్‌ బల్బుల వెలుగుతో పుడమికి పెద్ద ముప్పు వాటిల్లుతున్నట్లు ఇటలీ, చిలీ, గేలిసియా శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. అధ్యయనం వివరాలను ‘నేచర్‌ అస్ట్రానమీ’ పత్రికలో ప్రచురించారు.

రానున్న రోజుల్లో విపరిణామాలే: భూగోళం చుట్టూ ప్రస్తుతం 8,000కు పైగా శాటిలైట్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇవి భూమిపై ప్రతి అంగుళాన్ని కవర్‌ చేస్తున్నాయి. స్పేక్‌ఎక్స్‌ సంస్థ 3,000కు పైగా చిన్నపాటి ఇంటర్నెట్‌ శాటిలైట్లను ప్రయోగించింది. వన్‌వెబ్‌ కూడా వందలాది కృత్రిమ ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. దేశాల మధ్య పోటీ నేపథ్యంలో భవిష్యత్తులోనూ వీటి సంఖ్య పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు విద్యుత్‌ లైట్ల అవసరం పెరుగుతూనే ఉంది.

శాటిలైట్ల నుంచి వెలువడే కాంతి, కరెంటు దీపాల నుంచి కాంతి వల్ల భూమిపై ప్రకృతికి విఘాతం వాటిల్లుతున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. వీటివల్ల రాత్రిపూట ఆకాశం స్పష్టంగా కనిపించడం లేదని తేల్చారు. ‘‘అంతేగాక ఖగోళ శాస్త్రవేత్తల విధులకూ ఆటంకం కలుగుతోంది. అస్ట్రానామికల్‌ అబ్జర్వేటరీల పనితీరు మందగిస్తున్నట్లు తేలింది. ఈ కాంతి కాలుష్యం కారణంగా రాత్రివేళలో అనంతమైన విశ్వాన్ని కళ్లతో, పరికరాలతో స్పష్టంగా చూడగలిగే అవకాశం తగ్గుతోంది. అంతేగాక భూమిపై జీవుల అలవాట్లలో, ఆరోగ్యంలో ప్రతికూల మార్పులు వస్తున్నాయి’’ అని వెల్లడించారు. దీనికి అడ్డుకట్ట వేసి సహజ ప్రకృతిని పరిరక్షించుకొనే దిశగా దృష్టి పెట్టాలని సూచించారు.

పరిష్కారం ఏమిటి?
కాంతి కాలుష్యానికి ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయి పరిష్కార మార్గం లేదని నిపుణులు అంటున్నారు. దాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టడం మేలు. ‘‘శాటిలైట్లలో బ్రైట్‌నెస్‌ తగ్గించాలి. టెలిస్కోప్‌ పరికరాల్లోని షట్టర్లను కాసేపు మూసేయడం ద్వారా కాంతి తీవ్రతను తగ్గించవచ్చు’’ అని సూచిస్తున్నారు. కృత్రిమ ఉపగ్రహాలతో కాంతి కాలుష్యమే గాక మరెన్నో సమస్యలున్నాయి. కాలం తీరిన శాటిలైట్లు అంతరిక్షంలోనే వ్యర్థాలుగా పోగుపడుతున్నాయి. అంతరిక్ష కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. పైగా వీటినుంచి ప్రమాదకర విష వాయవులు వెలువడుతుంటాయి. ఆర్బిటాల్‌ ట్రాఫిక్‌ మరో పెను సమస్య.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top