1950 నుంచే పెనుముప్పు శకం ఆరంభం

Anthropocene epoch began in the 1950s says Scientists - Sakshi

మానవుల చర్యల వల్ల భూమికి అపార నష్టం

నిర్ధారించిన ‘ఆంథ్రోపొసీన్‌ వర్కింగ్‌ గ్రూప్‌’ సైంటిస్టులు

భూగోళంపై గతంలో ఎన్నడూ కనిపించని ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. కాలుష్యం, భూతాపం, వా­తా­వరణ మార్పులు పెరిగిపోతున్నా­యి. రుతువులు గతి తప్పుతున్నాయి. ఒకవైపు భీకర వర్షాలు, వర­దలు, మరోవైపు నిప్పులు కక్కే ఎండలు సర్వసాధారణంగా మారా­యి. మొత్తం పుడమి ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.

అయితే, మానవుల నిర్వాకం వల్ల భూమిపై అవాంఛనీయ ఈ పరిణామం ఎప్పుడు మొదలైందో తెలుసా? 1950 నుంచి 1954 మధ్య మొదలైందని ‘ఆంథ్రోపొసీన్‌ వర్కింగ్‌ గ్రూప్‌’ సైంటిస్టులు గుర్తించారు. భూమాతను ప్రమాదంలోకి నెట్టివేసే కొత్త శకానికి అదొక ఆరంభమని అంటున్నారు. ఈ పరిణామానికి ఆంథ్రోపొసీన్‌ అని నామకరణం చేశారు. మనిషి, నూతన అనే అర్థాలున్న గ్రీక్‌ పదాలతో ఈ కొత్త పదం ఏర్పడింది. మొదట దీనిని 2000 సంవత్సరంలో పాల్‌ క్రట్‌జెన్, యూగీన్‌ స్టార్మర్‌ అనే శాస్త్రవేత్తలు ఉపయోగించారు. దీనిని ప్రస్తుత ‘జియోలాజికల్‌ టైమ్‌ ఇంటర్వెల్‌’గా పరిగణిస్తున్నారు. ‘ఆంథ్రోపొసీన్‌ వర్కింగ్‌ గ్రూప్‌’ సైంటిస్టులు ఇంకా ఏం చెప్పారంటే..      

► ఆంథ్రోపొసీన్‌లో భాగమైన పరిణామాలు, మార్పులు 1,000 లేదా అంతకంటే ఎక్కువ కాలం కొనసాగుతాయి.  
► ఇవి మొత్తం భూమి ఆవరణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. కొన్ని మార్పులు ప్రభావం భూమిపై శాశ్వతంగా ఉంటుంది.  
► శిలాజ ఇంధనాల వాడకం, అణ్వాయుధాలను ఉపయోగించడం, పొలాల్లో రసాయన ఎరువుల విచ్చలవిడి వినియోగం, భూమితోపాటు నదులు, చెరువుల్లో ప్లాస్లిక్‌ వ్యర్థాలు పెరగడం వంటివి ఆంథ్రోపొసీన్‌కు కారణమవుతున్నాయి.  
► మానవుల చర్యల భూమికి జరుగుతున్న నష్టం అనూహ్యంగానే ఉందని, ఈ నష్టం రానురాను మరింత పెరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్‌ లీసెస్టర్‌కు చెందిన జియాలజిస్ట్‌ కోలిన్‌ వాటర్స్‌ ఆందోళన వ్యక్తం చేశారు.  
► సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం బలమైన గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టడం వల్ల రాక్షస బల్లులు అంతరించిపోయాయి. ఇప్పుడు మానవ చర్యలు సైతం అదే కేటగిరీకి సమానంగా ఉన్నాయి. 1950వ దశకం తర్వాత భూగోళంపై ఎన్నో రకాల జీవులు అంతరించిపోయాయి.
► గ్రహ శకలాలు ఢీకొట్టడం అనేది ఒక కొత్త శకానికి దారితీసింది. మనుషుల కార్యకలాపాలు కూడా భూమిపై కొత్త శకానికి నాంది పలికాయి.  
► ఇప్పటికైనా మేల్కొని నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో మరిన్ని తీవ్ర పరిణామాలు తలెత్తుతాయనడంలో సందేహం లేదు. 

 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top