ఓపెన్ ఏఐ మరో షాక్‌.. ఇక స్మార్ట్‌ ఫోన్‌లకు చెక్‌! | OpenAI reportedly planning AI earbuds | Sakshi
Sakshi News home page

ఓపెన్ ఏఐ మరో షాక్‌.. ఇక స్మార్ట్‌ ఫోన్‌లకు చెక్‌!

Feb 8 2026 11:24 AM | Updated on Feb 8 2026 12:59 PM

OpenAI reportedly planning AI earbuds

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) తన నూతన ఆవిష్కరణలతో ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా దూసుకుపోతోంది. ఇప్పటివరకూ సాఫ్ట్‌వేర్‌ వరకే పరిమితమైందనుకుంటున్న ఓపెన్‌ ఏఐ ఇ‍ప్పుడు హార్డ్‌వేర్ రంగంలోకీ గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. ‘డైమ్’ (Dime) అనే కోడ్ నేమ్‌తో కంపెనీ తన మొట్టమొదటి హార్డ్‌వేర్ ఉత్పత్తిగా ఏఐ ఆధారిత ఇయర్‌బడ్స్‌ను తీసుకురానున్నట్లు ‘మింట్‌’తన కథనంలో పేర్కొంది.

‘డైమ్’ ఇయర్‌ బడ్స్‌ కేవలం సంగీతం వినడానికే పరిమితం కాకుండా, వాయిస్ కమాండ్స్ ద్వారా ఏఐ మోడళ్లను నియంత్రించేలా, హ్యాండ్స్-ఫ్రీ అసిస్టెన్స్‌ను అందించేలా రూపొందించారు. ఈ ఏడాది చివరిలో వీటిని ప్రపంచానికి పరిచయం చేసి, 2027 ప్రారంభంలో మార్కెట్లోకి వీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ‘స్మార్ట్ పికాచు’ అందించిన సమాచారం ప్రకారం చైనాలో ఇటీవల దాఖలైన ఒక పేటెంట్ ఫైలింగ్‌లో ‘డైమ్’ అనే పేరు వెలుగులోకి వచ్చింది.

భారీ స్థాయిలో  హార్డ్‌వేర్‌ పరికరాలను నేరుగా మార్కెట్లోకి తెచ్చే కంటే, వినియోగదారులకు  అందుబాటులో ఉండేలా ఇయర్‌బడ్స్‌ లాంటి సాధారణ పరికరంతో రంగప్రవేశం చేయాలని ఓపెన్ ఏఐ భావిస్తోంది. తక్కువ ఖర్చుతో సాంకేతిక ఇబ్బందులు లేకుండా హార్డ్‌వేర్ మార్కెట్‌ను చేజిక్కించుకోవడమే కంపెనీ వ్యూహమని తెలుస్తోంది. ఇవి వాయిస్ ఇంటరాక్షన్లపై దృష్టి సారిస్తూ, వినియోగదారులకు రియల్ టైమ్ ఏఐ సేవలను నేరుగా చెవి దగ్గరికే చేర్చనున్నాయి.

గతంలో ఓపెన్ ఏఐ స్మార్ట్‌ఫోన్ తరహాలో ఉండే శక్తివంతమైన ఏఐ డివైజ్‌ను తీసుకువస్తుందనే ప్రచారం జరిగింది. అయితే హై బ్యాండ్‌విడ్త్ మెమరీ (హెచ్‌బీఎం)కొరత కారణంగా విడిభాగాల ధరలు విపరీతంగా పెరగడంతో ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం వాయిదా పడినట్లు సమాచారం. తయారీ వ్యయం  కారణంగా కంపెనీ ప్రస్తుతానికి తన నిర్ణయాన్ని మార్చుకుని, 2026లో సరళమైన వెర్షన్ (డైమ్ ఇయర్‌బడ్స్)ను లాంచ్ చేయాలని నిశ్చయించుకుందని సమాచారం.

ఓపెన్ ఏఐ చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ క్రిస్ లెహనే గతంలోనే కంపెనీ తొలి హార్డ్‌వేర్ ఉత్పత్తిపై పనిచేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అప్పట్లో దాని ఆకారం లేదా ఫీచర్ల గురించి ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ ఏడాదిలోనే ఆ పరికరాన్ని ఆవిష్కరిస్తామని ఆయన పేర్కొన్నప్పటికీ, లాంచ్ తేదీని వెల్లడించలేదు. ప్రస్తుతం ‘డైమ్’ బ్రాండింగ్‌తో వస్తున్న ఇయర్‌బడ్స్ వార్తలపై ఓపెన్ ఏఐ ఇంకా స్పందించాల్సి ఉంది. ఆపిల్ మాజీ డిజైన్ హెడ్ జోనీ ఐవ్ నేతృత్వంలో ఈ నూతన పరికరాలు రూపుదిద్దుకుంటున్నాయనే వార్తలు టెక్ ప్రపంచంలో సంచలనంగా మారాయి. కాగా డైమ్ ఇయర్‌బడ్స్ అందుబాటులోకి వస్తే, అవి స్మార్ట్‌ ఫోన్ల వినియోగానికి చెక్‌ పెట్టనున్నాయనే వాదన వినిపిస్తోంది.

ఇది కూడా చదవండి: ‘వాషింగ్టన్ పోస్ట్’లో మరో సంచలనం.. ఇప్పుడు సీఈఓ వంతు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement