వాల్ట్ డిస్నీ కంపెనీకి చెందిన 200కి పైగా ప్రసిద్ధ పాత్రలు ఇకపై కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో అత్యంత విలువైన స్టార్టప్‌ల్లో ఒకటైన ఓపెన్ఎఐలో దర్శనం ఇవ్వనున్నాయి. ఓపెన్‌ఏఐ తమ టెక్స్ట్-టు-వీడియో సాధనం ‘సోరా’లో ఈ పాత్రలను ఉపయోగించుకునేందుకు లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద డిస్నీ శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఓపెన్ఎఐలో 1 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.9000 కోట్లు) పెట్టుబడి పెట్టడానికి కూడా అంగీకరించింది.
ఒప్పందంలోని అంశాలు
మిక్కీ మౌస్, ఫ్రోజెన్, మాన్‌స్టర్స్ ఇంక్., టాయ్ స్టోరీ పాత్రలు, మార్వెల్, లూకాస్ ఫిల్మ్ ఫ్రాంచైజీలైన ‘బ్లాక్ పాంథర్’, స్టార్మ్ ట్రూపర్స్, యోడా.. వంటి 200కి పైగా డిస్నీ పాత్రలను ఉపయోగించుకునేందుకు ఓపెన్ఎఐకి మూడేళ్ల లైసెన్స్ లభించింది.
వచ్చే ఏడాది ప్రారంభంలో వినియోగదారులు సోరాలో ప్రాంప్ట్‌లు సృష్టించడం ద్వారా డిస్నీ పాత్రలున్న చిన్న వీడియోలను సృష్టించడానికి చాట్‌జీపీటీ ఇమేజెస్ సాధనాన్ని ఉపయోగించవచ్చు.
సోరా ద్వారా రూపొందించిన కొన్ని వీడియోలను డిస్నీ+ స్ట్రీమింగ్ సేవలో కూడా ప్రదర్శిస్తారు.
డిస్నీ ఓపెన్ఎఐలో 1 బిలియన్ డాలర్లు ఈక్విటీ పెట్టుబడి పెట్టడంతో పాటు భవిష్యత్తులో మరింత ఈక్విటీని కొనుగోలు చేయనున్నట్లు చెప్పింది. దాంతో డిస్నీ ఉద్యోగులకు చాట్‌జీపీటీ యాక్సెస్ కూడా లభిస్తుంది. అయితే ఈ ఒప్పందంలో నటీనటుల పోలికలు లేదా స్వరాలు ఉపయోగించడం లేదని ఇరు కంపెనీలు స్పష్టం చేశాయి.
డిస్నీ సీఈఓ బాబ్ ఐగర్ మాట్లాడుతూ..‘కృత్రిమ మేధ వేగవంతమైన పురోగతి నేపథ్యంలో ఓపెన్ఎఐతో ఈ సహకారం ఎంతో మేలు చేస్తుంది. దీని ద్వారా కంటెంట్, ఇమేజ్ సృష్టికర్తలను, వారి రచనలను గౌరవిస్తూ వాటిని పరిరక్షిస్తూనే జనరేటివ్ ఏఐ ద్వారా ఈ సర్వీసులను బాధ్యతాయుతంగా విస్తరిస్తాం’ అని తెలిపారు. ఓపెన్ఎఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ ఈ ఒప్పందంపై సంతోషం వ్యక్తం చేస్తూ ‘సమాజానికి ప్రయోజనం చేకూర్చే ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఏఐ కంపెనీలు, సృజనాత్మక సంస్థలు బాధ్యతాయుతంగా కలిసి పని చేస్తాయి’ అని చెప్పారు.
ఇదీ చదవండి: భారత్‌పై మెక్సికో సుంకాల పెంపు.. ఏయే రంగాలపై ప్రభావం అంటే..


