నవంబర్‌లో రూ.29,911 కోట్ల పెట్టుబడులు
అక్టోబర్ కంటే 21 శాతం అధికం
కొనసాగిన సిప్ హవా
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ సానుకూలంగా మారింది. మూడు నెలల వరుస బలహీనత అనంతరం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి నవంబర్‌లో పెట్టుబడుల రాక మెరుగైంది. రూ.29,911 కోట్ల పెట్టుబడులను ఈక్విటీ పథకాలు ఆకర్షించాయి. అక్టోబర్ నెలలో వచ్చిన పెట్టుబడులు రూ.24,690 కోట్ల కంటే 21 శాతం అధికం కావడం గమనార్హం. కానీ, సెపె్టంబర్‌లో రూ.30,421 కోట్లు, ఆగస్ట్‌లో వచ్చిన రూ.33,430 కోట్ల కంటే తక్కువే.
అంతేకాదు, 2024 నవంబర్‌లో ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన నికర పెట్టుబడులు రూ.35,943 కోట్ల కంటే 17 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి రూ.29,445 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్‌లో ఈ మొత్తం రూ.29,631 కోట్లుగా ఉంది. అంటే స్వల్పంగా తగ్గినట్టు తెలుస్తోంది. ఈ వివరాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది.
విభాగాల వారీ పెట్టుబడులు..
→ ఈక్విటీల్లో 11 ఉప విభాగాలకు గాను డివిడెండ్ ఈల్డ్, ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్స్ మినహా మిగిలిన అన్నీ కూడా నికరంగా పెట్టుబడులను ఆకర్షించాయి.
→ అత్యధికంగా రూ.8,135 కోట్ల పెట్టుబడులను ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ రాబట్టాయి. అక్టోబర్‌లో ఇదే విభాగంలోకి వచ్చిన రూ.8,928 కోట్ల కంటే 9 శాతం తగ్గాయి.
→ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.4,503 కోట్లు వచ్చాయి. అక్టోబర్‌లో వచ్చిన రూ.3,177 కోట్ల కంటే 42 శాతం పెరిగాయి.
→ మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.4,486 కోట్లు, స్మాల్‌క్యాప్ ఫండ్స్ రూ.4,406 కోట్ల చొప్పున ఆకర్షించాయి.
→ వ్యాల్యూ/కాంట్రా ఫండ్స్‌లోకి రూ.1,219 కోట్లు వచ్చాయి. అక్టోబర్ కంటే 231 శాతం పెరగడం గమనార్హం.
→ డెట్ మ్యూచువల్ ఫండ్స్ నికరంగా రూ.25,692 కోట్లను నవంబర్‌లో కోల్పోయాయి. అక్టోబర్‌లో రూ.1.59 లక్షల కోట్ల నికర పెట్టుబడులతో పోల్చితే పరిస్థితి తలకిందులైంది.
→ డెట్ విభాగంలో అత్యధికంగా ఓవర్‌నైట్ ఫండ్స్ నుంచి రూ.37,624 కోట్లు, లిక్విడ్ ఫండ్స్ నుంచి రూ.14,050 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు.
→ మనీ మార్కెట్ ఫండ్స్ రూ.11,104 కోట్లు, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ రూ.8,360 కోట్లు, లో డ్యురేషన్ ఫండ్స్ రూ.4,980 కోట్ల చొప్పున ఆకర్షించాయి.
→ హైబ్రిడ్ ఫండ్స్ (ఈక్విటీ–డెట్‌తో కూడిన)లోకి అక్టోబర్ కంటే 6 శాతం తక్కువగా రూ.13,299 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
→ గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు)లోకి పెట్టుబడులు రూ.3,742 కోట్లకు తగ్గాయి. అక్టోబర్‌లో ఇవి రూ.7,743 కోట్లను ఆకర్షించడం గమనార్హం. ఇతర ఈటీఎఫ్‌ల్లోకి రూ.9,720 కోట్లు, ఇండెక్స్ ఫండ్స్‌లోకి రూ.1,726 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి.
→ నవంబర్‌లో 24 కొత్త మ్యూచువల్ ఫండ్స్ పథకాలు (ఎన్‌ఎఫ్‌వోలు) మార్కెట్లోకి వచ్చి ఇన్వెస్టర్ల నుంచి రూ.3,126 కోట్లను సమీకరించాయి.
→ మొత్తం మీద నవంబర్‌లో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి వచ్చిన పెట్టుబడులు రూ.33,222 కోట్లకు పరిమితమయ్యాయి. అక్టోబర్‌లో ఇవి రూ.2.15 లక్షల కోట్లుగా ఉన్నాయి.
→ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణ ఆస్తుల (ఏయూఎం) విలువ నవంబర్ చివరికి రూ.80.80 లక్షల కోట్లకు పెరిగింది. అక్టోబర్ చివరికి ఇది రూ.79.87 లక్షల కోట్లుగా ఉంది.


