2 దశాబ్దాల తదుపరి మళ్లీ రికార్డ్
రూ. 1.7 లక్షల కోట్ల సమీకరణ
ప్రైమరీ మార్కెట్లో ఇది కొత్త చరిత్ర
ఒక్క సెపె్టంబర్‌లోనే 25 ఇష్యూలు
ప్రస్తుత కేలండర్ ఏడాది(2025) ముగింపునకు వచ్చింది. విశేషమేమిటంటే ప్రైమరీ మార్కెట్లలో ఒక కొత్త చరిత్ర నమోదైంది. పబ్లిక్ ఇష్యూల ద్వారా అత్యధికంగా రూ. 1.7 లక్షల కోట్లను కంపెనీలు సమీకరించాయి. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. 2024లోనూ రూ. 1.59 లక్షల కోట్లతో రికార్డ్ నెలకొల్పడం గమనార్హం! ఇక దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ ఏడాది ఐపీవోలు సెంచరీ కొట్టడం విశేషం! వివరాలు చూద్దాం..
మెయిన్‌బోర్డ్‌లో లిస్టింగ్‌కు కంపెనీలు క్యూ కడుతుండటంతో రెండేళ్లుగా ప్రైమరీ మార్కెట్లు కదం తొక్కుతున్నాయి. ఓవైపు సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొంటున్నప్పటికీ పబ్లిక్ ఇష్యూల వెల్లువ కొనసాగుతోంది! అయితే ఆటుపోట్ల మధ్య ప్రామాణిక ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త గరిష్టాలకు చేరడం విశేషం! కాగా.. తాజాగా పబ్లిక్ ఇష్యూకి వచ్చిన పార్క్ మెడి వరల్డ్, కరోనా రెమిడీస్, నెఫ్రోప్లస్ హెల్త్, వేక్‌ఫిట్ ఇన్నోవేషన్స్‌తో 2025లో ప్రైమరీ మార్కెట్లు సెంచరీ కొట్టాయి. 2007 తరువాత ఇది రికార్డ్‌కాగా.. తద్వారా రూ. 1.7 లక్షల కోట్లను సమీకరించడం ద్వారా కొత్త చరిత్రను లిఖించాయి. ఈ బాటలో వచ్చే వారం ఐపీవో ద్వారా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ రూ. 10,000 కోట్లు సమీకరించనుండటం విశేషం!
రికార్డులతో రెండేళ్లు
ప్రైమరీ మార్కెట్లలో సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ గత కేలండర్ ఏడాదిలో 91 కంపెనీలు రూ. 1.59 లక్షల కోట్లను సమీకరించాయి. ప్రస్తుత ఏడాది జోరు మరింత పెరిగి ఐపీవోల సెంచరీ మోత మోగింది. తద్వారా రూ. 1.7 లక్షల కోట్ల సమీకరణతో కొత్త చరిత్రను సైతం నెలకొల్పాయి. నిజానికి గత వారాంతానికల్లా 96 ఇష్యూలు రూ. 1.6 లక్షల కోట్లను సమీకరించడం ద్వారా 2024ను అధిగమించాయి. ఏడాది ముగిసేసరికి ఐసీఐసీఐ ప్రు ఏఎంసీ, కేఎస్‌హెచ్ ఇంటర్నేషనల్ తదితర ఇష్యూలతో ఈ రికార్డులు మరింత మెరుగుపడనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందుకు ప్రధానంగా రిటైల్ విభాగంసహా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) నుంచి పెట్టుబడులు వెల్లువెత్తుతుండటం సహకరిస్తున్నట్లు తెలియజేశారు.
పీఈ సంస్థలకు ఓకే
ఈ ఏడాది టాటా క్యాపిటల్, ఎల్‌జీ ఎల్రక్టానిక్స్, లెన్స్‌కార్ట్, బిలియన్‌బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్(గ్రో) తదితర భారీ ఇష్యూలు విజయవంతమయ్యాయి. దీంతో పీఈ దిగ్గజాలకు లాభదాయక ఎగ్జిట్ అవకాశాలు లభిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇది ఐపీవోలకు మరింత ప్రోత్సాహాన్నిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది 96 ఇష్యూలలో 80 లాభాలతో లిస్ట్‌కాగా.. కొన్ని కంపెనీలు 75 శాతం ప్రీమియం సాధించడం విశేషం! వెరసి రిటైల్ ఇన్వెస్టర్లు సైతం పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు నిపుణులు వివరించారు.
సవాళ్లలోనూ గుడ్
యూఎస్ టారిఫ్‌ల విధింపు, ప్రపంచవ్యాప్త రాజకీయ భౌగోళిక అస్థిరతలు, ఓమాదిరి కార్పొరేట్ ఫలితాలు వంటి ప్రతికూలతల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ ఏడాది అధిక శాతం అమ్మకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయినప్పటికీ దేశీ ఫండ్స్, రిటైలర్ల భారీ పెట్టుబడులతో ప్రైమరీ మార్కెట్లు మాత్రం కళకళలాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జూలై, ఆగస్ట్‌లలో నిఫ్టీ, మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు నీరసించినప్పటికీ ఐపీవో ద్వారా 25 కంపెనీలు రూ. 26,579 కోట్లు సమీకరించాయి. ఈ బాటలో ఒక్క సెపె్టంబర్‌లోనే 1997 జనవరి తదుపరి అత్యధికంగా 25 కంపెనీలు లిస్టింగ్‌కు క్యూ కట్టాయి.
దిగ్గజాల లిస్టింగ్
కంపెనీ పేరు ఇష్యూ విలువ
టాటా క్యాపిటల్ 15,512
హెచ్‌డీబీ ఫైనాన్షియల్ 12,500
ఎల్‌జీ ఎల్రక్టానిక్స్ 11,604
ఐసీఐసీఐ ప్రు ఏఎంసీూ 10,603
బిలియన్‌బ్రెయిన్స్ 6,632
(విలువ రూ. కోట్లలో) (ూ ఈ నెల 19న లిస్ట్‌కానుంది)
–సాక్షి, బిజినెస్ డెస్క్


