బంగారం.. ఇది ఒక విలువైన లోహం. ప్రపంచంలోని చాలా దేశాలు దీనిని అలాగే చూస్తాయి. కానీ భారత్ దీనికి భిన్నం. ఎలా అంటే.. బంగారం అంటే విలువైన లోగా మాత్రమే కాకుండా.. పవిత్రం, ఒక ఆభరణం, లక్ష్మీదేవిగా భావిస్తారు. ఈ కారణంగా ఎప్పటికప్పుడు గోల్డ్ కొనేస్తుంటారు. దీంతో ధరలు కూడా అమాంతం పెరుగుతూ వచ్చేసాయి.
ఉదాహరణకు 1990లలో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3,200. అంటే గ్రామ్ గోల్డ్ కొనాలంటే.. కేవలం రూ. 320 వెచ్చించాలన్నమాట. అయితే ఇప్పుడు 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 1,30,750 రూపాయలు. అంటే ఇప్పుడు ఒక గ్రామ్ గోల్డ్ కొనాలంటే రూ. 13075 ఖర్చు చేయాలి. దీన్నిబట్టి చూస్తే.. 35 సంవత్సరాల్లో గోల్డ్ రేటు ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
35 సంవత్సరాల్లో బంగారం ధరలు ఎందుకింతలా పెరిగాయి?, భవిష్యత్తులో తగ్గే సూచనలు ఉన్నాయా? అనే వివరాలను క్షుణ్ణంగా ఈ కథనంలో చూసేద్దాం.
బంగారం ధరలు ఎందుకిలా..
ద్రవ్యోల్బణం: గోల్డ్ రేటు పెరగడానికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణమే. దేశంలో వస్తువుల ధరలు పెరగడం వల్ల.. ఈ ప్రభావం బంగారంపై కూడా చూపించింది. రూపాయి బలహీనపడటం కూడా పసిడి ధరలు అమాంతం పెరగడానికి కారణమైంది.
భద్రమైన ఆస్తి: ప్రపంచంలోనే సంక్షోభం వచ్చినప్పుడల్లా.. ప్రజలు బంగారం వైపు పరుగెడతారు. 2001లో ఏర్పడిన ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు, 2008 నాటి ఆర్ధిక సంక్షోభం, 2020లో వచ్చిన కోవిడ్ 19, 2022-25 వరకు రష్యా-ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ సమస్యలు వంటివి బంగారంలో పెట్టుబడి పెట్టడానికి కారణమయ్యాయి. దీంతో రేట్లు రాకెట్‌లా దూసుకెళ్లాయి.
కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు: చైనా, రష్యా, టర్కీ, ఇండియా వంటి దేశాలు.. గత దశాబ్దంలో టన్నుల కొద్దీ బంగారం కొనుగోలు చేశాయి. ఇది గ్లోబల్ మార్కెట్లో డిమాండ్‌ను పెంచేసింది.
డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి: ఎక్కడైనా డిమాండ్‌కు సరిపడా.. ఉత్పత్తి ఉన్నప్పడే ధరలు స్థిరంగా లేదా కొంత తక్కువగా ఉంటాయి. కానీ మార్కెట్లో బంగారం కొనేవాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీరికి సరఫరా చేయడానికి కావలసినంత బంగారం ఉత్పత్తి జరగలేదు. దీంతో ఆటోమేటిక్‌గా ధర పెరిగింది. 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.30 లక్షలు దాటేసింది.
డాలర్ విలువ & యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు: సాధారణంగా.. డాలర్ విలువ పెరిగినప్పుడు బంగారం విలువ తగ్గుతుంది. ఇదే వ్యతిరేఖ దిశలో జరిగితే.. డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం విలువ పెరుగుతుంది. గోల్డ్ రేట్ల పెరుగుదలపై.. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు కూడా ప్రభావం చూపుతుంది.
ఇతర కారణాలు: పండుగలు, పెళ్లిళ్లు మొదలైన శుభకార్యాలు వచ్చినప్పుడు కూడా బంగారం కొనేవాళ్ల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. పెట్టుబడిదారులు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా పసిడి రేటు భారీగా పెరుగుతుంది.
భవిష్యత్తులో తగ్గే సూచనలు ఉన్నాయా?
2025 డిసెంబర్ 9, 10 తేదీల్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమీక్ష జరగనుంది. ఈసారి కూడా 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంది. ఇదే జరిగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫెడ్ వడ్డీ రేటు తగ్గితే.. బంగారం ధర పెరుగుతుంది. ఈ వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేకపోతే.. గోల్డ్ రేటు తగ్గే అవకాశం ఉంది.


