పసిడి రుణాలకు భలే గిరాకీ: 2026 మార్చి నాటికి.. | Demand For Gold Loans Know The Details Here | Sakshi
Sakshi News home page

పసిడి రుణాలకు భలే గిరాకీ: 2026 మార్చి నాటికి..

Dec 9 2025 12:07 AM | Updated on Dec 9 2025 12:08 AM

Demand For Gold Loans Know The Details Here

రిటైల్‌ రుణాల్లో పావు వంతుకు చేరిక

2026 మార్చి నాటికి రూ.15 లక్షల కోట్లు

ఒకప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం అన్నది చాలా తక్కువగానే ఉండేది. అది కూడా ఎక్కువగా అసంఘటిత రంగంలోనే. కానీ, ఇప్పుడు బంగారాన్ని కుదువ పెట్టి అప్పు తీసుకోవడం అన్నది వేగంగా విస్తరిస్తోంది. అది కూడా సంఘటిత రంగంలో బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల వద్ద రుణం తీసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. నిమిషాల వ్యవధిలోనే రుణం లభించడం, వడ్డీ తక్కువగా ఉండడం చాలా మందిని ఆకర్షిస్తోంది. రుణాన్ని తిరిగి చెల్లించడంలోనూ వెసులుబాటు ఈ మార్కెట్‌ విస్తరణకు దోహదం చేస్తోంది. పెద్ద ఎత్తున డిమాండ్‌ను సొంతం చేసుకునేందుకు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) పెద్ద సంఖ్యలో కొత్త శాఖలు ప్రారంభించేందుకు ప్రణాళికలు వేసుకుంటుంటే, బ్యాంక్‌లు సైతం సెక్యూర్డ్‌ విభాగమైన పసిడి రుణాల్లో వాటాను పెంచుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి.

ఏడు నెలల్లో 63.6 శాతం వృద్ధి..
2025 అక్టోబర్‌ చివరికి బంగారం రుణాల అవుట్‌స్టాండింగ్‌ (నికరంగా తిరిగి రావాల్సిన మొత్తం) రూ.3.38 లక్షల కోట్లుగా ఉన్నట్టు డేటా తెలియజేస్తోంది. ఏడాది కాలంలో ఇది ఏకంగా 128.5 శాతం పెరగ్గా, ఈ ఏడాది మార్చి చివరి నుంచి చూస్తే 63.6 శాతం వృద్ధి చెందింది. గడిచిన ఏడాది కాలంలో జారీ అయిన వ్యక్తిగత రుణాల్లో పసిడి రుణాలు పావు శాతానికి చేరాయి. 2025 మార్చి నాటికి మొత్తం బంగారం రుణాల మార్కెట్‌ విలువ రూ.14.5 లక్షల కోట్లకు చేరగా, 2026 మార్చి నాటికి రూ.15 లక్షల కోట్లకు విస్తరిస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలు వచ్చే ఏడాది కాలంలో 3,000 కొత్త శాఖలను ప్రత్యేకంగా బంగారం రుణాల కోసమే ప్రారంభించే సన్నాహాల్లో ఉన్నాయి.

సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్‌ఐలు) ఎగవేతలు పెరగడంతో రుణ నిబంధనలను కఠినతరం చేశాయి. దీంతో గతంలో మాదిరి సులభంగా అన్‌సెక్యూర్డ్‌ రుణాలు లభించని పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా రైతులు, చిన్న వర్తకులు, స్వయం ఉపాధిపై ఉన్నవారు బంగారంపై రుణాలను ఆశ్రయిస్తుండడం కూడా ఈ మార్కెట్‌ విస్తరణకు దోహదం చేస్తోంది. బంగారం ధరలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరగడంతో మరింత అధిక మొత్తంలో రుణం, అది కూడా సులభంగా లభిస్తుండడంతో రుణగ్రహీతలు అటువైపు మొగ్గుచూపిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

సాగు, వ్యాపార అవసరాలకే అధికం..
బంగారాన్ని కుదువపెట్టి రుణాలు తీసుకుంటున్న వారిలో 70 శాతం మంది వ్యవసాయం, వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నారు. మిగిలిన 30 శాతం మంది గృహ నవీకరణ, వివాహాలు, ఇతర వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తున్నట్టు డేటా తెలియజేస్తోంది. వేతన జీవులు స్వల్పకాల అవసరాలకు సైతం పసిడి రుణాలను తీసుకుంటున్నారు. రుణాలను వేగంగా ప్రాసెస్‌ చేస్తుండడం, వడ్డీ రేట్లలో పారదర్శకత ఈ మార్కెట్‌ విస్తరణకు మద్దతునిస్తున్నాయి.

విస్తరణకు భారీ అవకాశాలు
బంగారం మార్కెట్‌ మరింత విస్తరణకు అవకాశాలున్నట్టు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే భారతీయ గృహాల్లో ఉన్న బంగారంలో కేవలం 5.6 శాతాన్ని ఇప్పటికి పసిడి రుణాల కోసం వినియోగించుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇక బంగారం రుణాల్లో సంఘటిత రంగం వాటా 37 శాతంగానే ఉంది. ఇప్పటికీ 63 శాతం అసంఘటిత రంగంలో (పాన్‌ బ్రోకర్లు, స్థానిక వడ్డీ వ్యాపారులు)నే బంగారంపై రుణాలు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితులను గమనించిన ఎన్‌బీఎఫ్‌సీలు ప్రత్యేకంగా చిన్న పట్టణాల్లోనూ కొత్త శాఖల ద్వారా మరింత మందికి చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. డిజిటల్‌ సాధనాలు, ఫిన్‌టెక్‌లతో భాగస్వామ్యాల ద్వారా కొత్త కస్టమర్లను చేరుకునేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. బంగారం రుణాల్లో 80 శాతం మార్కెట్‌ దక్షిణాది రాష్ట్రాలోనే ఉండగా, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్‌ తదితర ప్రాంతాల్లో విస్తరణపై ఎన్‌బీఎఫ్‌సీలు తాజాగా దృష్టి సారించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement