దేశీయ విమానయాన రంగంలో ఆధిపత్యం వహిస్తున్న ఇండిగో విమాన సేర్వీసుల్లో ఇటీవల భారీ అంతరాయాలు, రద్దులు సంభవించాయి. దాంతో వేలాది మంది ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడం ఒక సంక్షోభానికి దారితీసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొత్తగా అమలు చేసిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనలు, పైలట్ల కొరత ఈ అంతరాయాలకు ప్రధాన కారణంగా నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇండిగోకు ప్రధాన పోటీదారుగా ఉన్న ఎయిరిండియా వ్యూహాత్మకంగా పైలట్ల నియామక ప్రక్రియను వేగవంతం చేసింది.
కొత్త నిబంధనలు ఇండిగోపై ప్రభావం
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రవేశపెట్టిన నూతన FDTL (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్) నిబంధనలు ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా మారాయి. పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి తగినంత విశ్రాంతి లభించేలా అలసటను తగ్గించి భద్రతను పెంచేందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చారు.
సిబ్బందికి వారానికి తప్పనిసరి విశ్రాంతి సమయాన్ని పెంచారు (గతంలో 36 గంటల నుంచి 48 గంటలకు). రాత్రిపూట ల్యాండింగ్‌ల సంఖ్యను తగ్గించారు (ముందు 6 నుంచి ఇప్పుడు వారానికి 2కి). రాత్రిపూట విమానయాన కార్యకలాపాల సమయంలో పరిమితులు విధించారు.
ఇండిగో అతిపెద్ద విమానయాన సంస్థ కావడంతో ఇది రోజుకు 2,200కి పైగా విమానాలను నడుపుతుంది. కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ భారీ నెట్‌వర్క్‌ను, సిబ్బంది రోస్టర్‌ను వెంటనే మార్చుకోలేకపోవడంతో తీవ్ర సిబ్బంది కొరత ఏర్పడింది. పాత షెడ్యూల్స్ ప్రకారం డ్యూటీ చేసిన అనేక మంది సిబ్బంది కొత్త నియమాల వల్ల అకస్మాత్తుగా పని చేయలేని పరిస్థితి నెలకొంది.
ఎయిరిండియా దూకుడు
ఇండిగో ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియాకు తమ మార్కెట్ వాటాను పెంచుకోవడానికి ఒక అవకాశంగా మారింది. ఎయిరిండియా ఎఫ్‌డీటీఎల్ నిబంధనల అమలును ముందుగానే ఊహించి సిబ్బంది ప్రణాళికలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఎయిరిండియా, ఆకాశ ఎయిర్ వంటి ఇతర విమానయాన సంస్థలు కొత్త నిబంధనలకు అనుగుణంగా అవసరమైన అదనపు పైలట్లను సకాలంలో నియమించుకునేలా చర్యలు చేపట్టాయి. వారికి శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకున్నాయి. ఇండిగో మాదిరిగా కాకుండా ఎయిరిండియా తమ కార్యకలాపాల సామర్థ్యాన్ని తగ్గించుకొని, తగినంత సిబ్బందిని ముందుగానే సిద్ధం చేసుకుంది. ఎయిరిండియా కేవలం కొత్త పైలట్లను నియమించుకోవడమే కాకుండా, తన పైలట్ వినియోగ ప్రణాళికలో మరింత సంప్రదాయబద్ధమైన విధానాన్ని అవలంబించింది. దీనివల్ల ప్రతి విమానానికి తగినంత మంది సిబ్బంది ఉండేలా చూసుకుంది. తద్వారా ఇండిగో మాదిరిగా భారీ అంతరాయాలను నివారించగలిగింది.
పైలట్-టు-ఎయిర్‌క్రాఫ్ట్ నిష్పత్తిపై విశ్లేషణ
ఎయిరిండియా (Air India) ఒక విమానానికి సగటున 5.4 మంది పైలట్ల నిష్పత్తిని కలిగి ఉంది. ఇది బఫర్, భద్రతపై దృష్టి సారించే వ్యూహాన్ని సూచిస్తుంది. అధిక సంఖ్యలో పైలట్లను కేటాయించడం వల్ల కొత్త నిబంధనల ప్రకారం సిబ్బందికి తగిన విశ్రాంతినివ్వడం, డ్యూటీ పరిమితులను సులభంగా పాటించడం సాధ్యమవుతుంది. ఫలితంగా, నిబంధనల మార్పును ఎయిరిండియా సమర్థవంతంగా అధిగమించగలిగింది.
మరోవైపు ఇండిగో ఒక్కో విమానానికి కేవలం 2.5 మంది పైలట్ల నిష్పత్తిని మాత్రమే కలిగి ఉంది. ఇది తక్కువ ఖర్చుతో గరిష్టంగా విమానాలను ఉపయోగించాలనే ‘లీన్ మ్యాన్‌పవర్’(Lean Manpower) వ్యూహాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే, కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత ఇండిగో ఈ తక్కువ నిష్పత్తి ఆపరేషనల్ వైఫల్యానికి దారితీసింది. విశ్రాంతికి వెళ్లాల్సిన పైలట్లను భర్తీ చేయడానికి తగిన సిబ్బంది లేకపోవడంతో వందలాది విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది.
ఇదీ చదవండి: చాట్‌జీపీటీలో ప్రకటనలు..?


