సాక్షి, శ్రీకాకుళం: ఇండిగో సంక్షోభ నేపథ్యంతో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు ఏపీలోనూ వైఎస్సార్సీపీ రామ్మోహన్ చేతకాని తనం గురించి నిలదీస్తున్నాయి. అటు కేంద్ర మంత్రిగానే కాదు.. ఇటు తన నియోజకవర్గంలోనూ ప్రజలకు మేలు చేయడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారని అంటున్నారు వైఎస్సార్‌సీపీ నేతలు.
సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు వైఫల్యం వల్ల దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విమానాలు రద్దు అయ్యాయని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అంటున్నారు. విమానాలు రద్దు అవడంతో ప్రజలు ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంత్రి ముందస్తు సమన్వయం సమీక్షలు చేయకపోవడం వల్ల ఇండిగో వంటి ప్రధాన ఎయిర్‌లైన్లు కుప్పకూలాయి. ఈ సంక్షోభానికి నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చెయ్యాలి..
రామ్మోహన్ నాయుడు అసమర్థత వల్ల అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం యొక్క ప్రతిష్ట దిగజారిపోయింది. తన శాఖలోని పరిణామాలు అంచనా వేయకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. సమస్య వచ్చినప్పుడు మీడియాకు మొఖం చాటు వేస్తె ఎలా? మీ సమాధానం కోసం దేశం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇప్పటినా మాట్లాడండి’’ అని తమ్మినేని డిమాండ్ చేశారు. మరోవైపు..
వైఎస్సార్సీపీ ఆముదాలవలస నియోజకవర్గ ఇన్చార్జ్ చింతాడ రవి కుమార్ రామ్మోహన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అసమర్థత వల్లే సివిల్ ఏవియేషన్ ఘోర వైఫల్యం చెందింది. కారెక్కినప్పుడు దిగినప్పుడు రీల్స్ చేస్తూ ఉంటాడు. అహ్మదాబాద్‌లో ఫ్లయిట్ కూలి 240 మంది చనిపోతే.. అక్కడికి వెళ్లి రీల్ చేస్తారు. అందుకే రామ్మోహన్ నాయుడు రీల్స్ మంత్రి అని పేరు తెచ్చుకున్నారు.
రీల్స్ పై పెట్టిన శ్రద్ధ తన శాఖపై పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు చేతకానితనం కారణంగా దేశ పరువు ప్రపంచస్థాయిలో దిగజారింది. కింజరాపు కుటుంబానికి రాజయోగం కల్పించిన శ్రీకాకుళం ప్రజలకు మేలు చేసే ఒక్క ప్రాజెక్టు అయినా తీసుకోచ్చారా?. ఒక్క కేంద్ర సంస్థను అయినా జిల్లాకు తీసుకొచ్చారా? మిమ్మల్ని ఎందుకు గెలిపించారా? అని జిల్లా ప్రజలు ఈ రోజు పశ్చాత్తాపడుతున్నారు’’ అని రవికుమార్ అన్నారు.


