సామాన్యుడు బిగ్‌బాస్ ఇంటి కెప్టెన్ అయ్యాడు, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు, సీజన్ ట్రోఫీ కూడా గెలుస్తాడు అని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో హుషారుగా చెప్తున్న మాట! కానీ అది సాధ్యమవుతుందా? టికెట్ టు ఫినాలే గెలిస్తే విజయానికి అడుగు దూరంలో ఆగిపోతారా? లేదా గెలిచి ప్రభంజనం సృష్టిస్తారా? ఇంతకుముందు సీజన్స్ ఏమని చెప్తున్నాయి? అనేవి ఈ స్పెషల్ స్టోరీలో చూసేద్దాం...
ఎప్పుడు మొదలైంది?
జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఫస్ట్ తెలుగు బిగ్‌బాస్ సీజన్‌లో టికెట్ టు ఫినాలే అనే ప్రస్తావనే రాలేదు. నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన రెండో సీజన్ నుంచే ఇదంతా మొదలైంది. ఆ సీజన్‌లో సామ్రాట్ టికెట్ టు ఫినాలే గెలిచి అందరికంటే ముందు టాప్ 5లో అడుగుపెట్టాడు. గెలవడం పక్కనపెడితే ఫైనల్స్‌లో ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
టికెట్ టు ఫినాలే నాదే.. ట్రోఫీ నాదే!
మూడో సీజన్ నుంచి బిగ్‌బాస్ బాధ్యతను నాగార్జున తన భుజాలపై వేసుకున్నాడు. ఈ సీజన్‌లోనే రాహుల్ సిప్లిగంజ్ టికెట్ టు ఫినాలే గెలిచాడు. ఫైనల్స్‌లో శ్రీముఖిని ఓడించి విజేతగా నిలిచాడు. ఫస్ట్ ఫైనలిస్ట్ అయి ట్రోఫీ కొట్టిన ఒకే ఒక్కడుగా తెలుగు బిగ్‌బాస్ చరిత్రకెక్కాడు. ఇంతవరకు దాన్నెవరూ టచ్ కూడా చేయలేకపోయారు. నాలుగో సీజన్‌లో అఖిల్ గెలిచినా రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఐదో సీజన్‌లో అందరికంటే ముందు ఫైనల్స్‌లో అడుగుపెట్టిన శ్రీరామచంద్ర.. సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు.
గెలుపును కాదనుకుని సూట్‌కేస్
ఆరో సీజన్‌లో మాత్రం ఓ అద్భుతం జరిగింది. శ్రీహాన్ టికెట్ టు ఫినాలే గెలిచి ఫైనల్స్‌లో అడుగుపెట్టాడు. కానీ, నాగార్జున ఆఫర్ చేసిన రూ.40 లక్షలకు టెంప్ట్ అయిపోయి రన్నరప్ స్థానంతో సరిపెట్టుకున్నాడు. అలా రేవంత్ విజేతగా నిలిచాడు. ఇక్కడే నాగార్జున ఓ ట్విస్ట్ బయటపెట్టాడు. ప్రేక్షకులు ఎక్కువ ఓట్లేసి గెలిపించింది శ్రీహాన్‌నే అని వెల్లడించాడు. దీంతో ట్రోఫీ గెలిచిన రేవంత్ ముఖం వెలవెలబోగా.. అటు ప్రేక్షకుల అభిమానం, ఇటు డబ్బు రెండూ సొంతమయ్యేసరికి శ్రీహాన్ ముఖం కళకళలాడింది.
చివరి స్థానాల్లోనే...
ఇక ఏడో సీజన్‌లో టాస్కుల బాహుబలిగా పేరు తెచ్చుకున్న అంబటి అర్జున్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. కానీ, వైల్డ్‌కార్డ్‌గా రావడం వల్ల తనపై పాజిటివిటీ కన్నా నెగెటివిటీయే ఎక్కువ వచ్చింది. అలా టాప్ 6లో చివరి స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఎనిమిదో సీజన్‌లో కమెడియన్ అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయినప్పటికీ టాప్ 5లో చివరి స్థానంలోనే ఉండిపోయాడు.
ఈసారం ఏం జరగనుంది?
ఈ సారి కామన్ మ్యాన్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan Padala) ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. ఇతడికి భారీ ఓటింగ్ ఉంది. ఈ కారణంగా అతడు గెలిచి చరిత్ర సృష్టించనూవచ్చు. లేదంటే రన్నరప్ స్థానంతో సరిపెట్టుకోనూవచ్చు. ఇవేవీ కాకుండా సూట్‌కేస్ తీసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మరి కల్యాణ్ ఏం చేస్తాడో చూడాలి!


