నటుడు విజయ్ వారసుడు జేసన్ సంజయ్ తండ్రి బాటలోనే పయనిస్తారని అందరూ భావించారు. జేసన్ సంజయ్ సౌత్ కాలిఫోర్నియాలో నటన, దర్శకత్వం శాఖల్లో శిక్షణ పొందారు. దీంతో ఈయన నటనపై కాకుండా దర్శకత్వంపై మొగ్గు చూపారు. అలా జేసన్ సంజయ్ మెగాఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న తొలి చిత్రం సిగ్మా. ఇందులో నటుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా ప్రియా అబ్దుల్లా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి.

దీంతో సిగ్మా చిత్రంపై ఆసక్తి నెలకొంటోంది. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాట చోటు చేసుకుంటుందని, దీన్ని ఇటీవల చిత్రీకరించినట్లు సమాచారం. ఈ పాటలో మెడ్రాస్ చిత్రం ఫేమ్ కేథరిన్ థ్రెసా(Catherine Tresa ) నటించినట్లు తెలిసింది. అంతే కాకుండా ఆమెతోపాటు దర్శకుడు జేసన్ సంజయ్ కూడా స్టెప్స్ వేసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అయితే ఆ పాటలో ఈ వర్ధమాన దర్శకుడు ఇలా వచ్చి అలా కనిపించి వెళ్తారా లేక పూర్తిగా ఆ పాటలో కేథరిన్ థ్రెసాతో కలిసి నటించారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయంపై చిత్ర వర్గాల నుంచి క్లారిటీ వచ్చే వరకూ ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. అదే విధంగా ఈ చిత్రంలో ఒక్క పాటలో మెరిసే జేసన్ సంజయ్ ఆ తరువాత హీరోగా నటించే అవకాశాలు లేకపోలేదన్న ప్రచారం జరుగుతోంది.


