నేడు మహానటి సావిత్రి 90వ జయంతి
మహానటి సావిత్రి (6 డిసెంబర్, 1934 – 28 డిసెంబర్, 1981)
‘వింత కాదు నా చెంతనున్నది వెండి వెన్నెల జాబిలి... నిండు పున్నమి జాబిలి’... నింగిలోని జాబిలి ఒక్కటి అందరికీ. తెలుగు వారికి మాత్రం నింగిలోనా, వెండి తెరన రెండు జాబిలుల నిండు సోయగాలు. సావిత్రి జన్మించి నేటికి 90 ఏళ్లు. ఆమె నటించింది సరిగా 15 ఏళ్లు. చనిపోయింది 46 సంవత్సరాలకు! కాని తెలుగు వారు ఆమెను తమ ఆడపడుచుగా భావిస్తూనే ఉన్నారు. మహానటిగా కొలుచుకుంటూనే ఉన్నారు. పదే పదే తలుచుకుంటూనే ఉన్నారు. మన ‘పార్వతి‘, మన ‘మధురవాణి’, మన ‘మిస్సమ్మ’, మన ‘శశిరేఖ’... దేవుడు ఏమరపాటులో తెలుగువారికి ఇచ్చిన అపురూపవరం సావిత్రి. ఆమెకు నివాళి.
డిసెంబర్ ఎంత వరదాయిని. సావిత్రిని ఇచ్చింది. డిసెంబర్ ఎంత దుఃఖదాయిని. సావిత్రిని తీసుకెళ్లింది.
మంచివాళ్లు వేసే శిక్షలు ఉడుంపట్టులా ఉంటాయి. వదలవు. గింజుకోవాలి. పెనుగులాడాలి. అయినా సరే... వదలవు. సావిత్రిని నమ్ముకున్న వాళ్లందరూ బాగుపడ్డారు. తిరిగి వారిని నమ్మిన సావిత్రి తప్ప. బదులుగా వారిని కొట్టలేదు ఆమె. తిట్టలేదు. కొరడా పట్టుకు శిక్షించలేదు. మరేం చేసింది? కోమాలోకి వెళ్లిపోయింది. బతికే ఉంది. కాని బతికి లేదు. ఊపిరితోనే ఉంది. కాని జీవంతో లేదు.
మన వల్ల మోసపోయినవారు మన ఇంటి ముందు ధర్నాకు కూచుంటే ఎంత ఇబ్బందో కోమాలోకి వెళ్లిన సావిత్రి– ఒకరోజు కాదు రెండ్రోజులు కాదు... నెల కాదు... రెండు నెలలు కాదు... 19 నెలల పాటు అలా నిలదీస్తున్నట్టుగా, పాపాలను లెక్కిస్తున్నట్టుగా మృత్యుశయ్యపై ఉండి తనను వంచించిన వారిని దండించింది. చలన చిత్ర తెర మీద క్షణం విరామం లేకుండా జగజ్జేయమానంగా వెలిగిన తారను నిశ్చలన స్థితికి నెట్టడం తెలుగు వారి చరిత్రలో ఒక ‘ఘనత’. సావిత్రి వీడ్కోలు తీసుకునే నాటికి ఆమె వయసు 46. సాధారణంగా– పుట్టిన పిల్లాపాపలు ఎదిగి వారితో స్త్రీలు ఆనందాలు పంచుకోవడం మొదలయే వయసు అది.

‘బాలరాజు’ శతదినోత్సవం బెజవాడలో జరుగుతుంటే చూడటానికి వెళ్లి పొంరపాటున మురుక్కాలవలో జారింది సావిత్రి. విధి ఆమెను సరిగ్గానే హెచ్చరించింది– నువ్వు ఎంచుకోబోయే రంగంలో మురుక్కాలవలూ వుంటాయి... మహా జలపాతాలూ ఉంటాయి... భద్రం అని. చిన్నపిల్ల. గ్రహించలేదు. సినీ పరిశ్రమలో అడుగు పెట్టాక మహా జలపాతం వలే కదిలి, ఉరకలెత్తి, హోరు సృష్టించి, అడ్డులన్నింటినీ కకావికలం చేస్తూ ప్రవహించి... చివరకు కొంత మురుగును ఆమె చూడాల్సే వచ్చింది.
చదవడం ఆపండి. రెండు పాటలు చూడండి.
ఒకటి ‘మంచి మనసులు’లో ‘నన్ను వదిలి నీవు పోలేవులే’. ఆ పాట ప్రిలూడ్ మొదలయ్యాక నాగేశ్వరరావు సరాసరి పరిగెత్తుకుంటూ వచ్చి చెట్టు వద్ద నిలుచుంటాడు. వెనుక ఒక సెకన్ తేడాలో సావిత్రి పరిగెత్తుకుంటూ రావాలి. మామూలుగా కాదు. ప్రిలూడ్‌కు తగినట్టుగా గంతులేస్తూ వచ్చి, సరిగ్గా పల్లవి మొదలయ్యే సమయానికి గంతులు ముగించి, పల్లవి అందుకోవాలి. అంతేనా? అల్లరిగా నవ్వుతూ కొద్దిగా పెదవి కొరకాలి. ఇవన్నీ మూడు నాలుగు సెకన్లలో చేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ రీల్స్ చేస్తున్నారు కదా... ఫోనుందని. ట్రై చేయండి. స్టార్ నటీమణులైనా సరే. జస్ట్ ట్రై చేసి చూడాలి.

రెండు– ‘ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ’... ఈ పాటలో నాగేశ్వరరావుకే మాటలుంటాయి. సావిత్రికి ఉత్త హమ్మింగ్. నాగేశ్వరరావు పలికే ప్రతి మాటకు సావిత్రి తన హమ్‌తో జవాబిస్తూ ఉంటే ఆ ఒక్క ముఖంలో ఇన్నేసి భావాలా? ఆ రెండు కళ్లల్లో ఇన్నిన్ని అర్థాలా? ఆమెలా చేయగలరేమో ప్రయత్నించి చూడండి. చేయగలిగినవారు ఉన్నారేమో గాలించండి.
నో.
సావిత్రిలా చేయగలిగే దమ్ము సావిత్రికి మాత్రమే ఉంది.
ఆమె అతి సులువుగా చేసింది అందరికీ అత్యంత కష్టమైనది.

సావిత్రి చిన్నప్పటి నుంచి డాన్సింగ్ స్టార్. ఆ డాన్స్ చూసే ఆమెను నాటకాల్లోకి తీసుకున్నారు. అన్నీ డాన్స్ డ్రామాలే. మగ వేషంలో ఉన్న ఆడపిల్లలతో. రాధా–కృష్ణ, మేనక–విశ్వామిత్ర, నారాయణమ్మ–నాయుడుబావ. స్టేజ్ మీదకు లేడిపిల్ల వచ్చిందా? ఎవరా పిల్ల? సావిత్రి అట గదా. అల్లరిగా చేసినా భలే అందంగా చేస్తుందే! అవును. అల్లరిగానే చేస్తోంది. తండ్రి లేని పిల్లలు అల్లరి ఎక్కువ చేస్తారు. ఏమంటే తండ్రి లేడన్న విషయం మర్చిపోవడానికి.
సావిత్రి బాగా అల్లరి చేసేది. పైకి నాన్–సీరియస్. లోన అగాథం. పెదనాన్న ఉన్నాడు. ఎంత ఉన్నా పెదనాన్న నాన్న కాడు. రక్షకుడు. సావిత్రికి కావాల్సింది అదిలించేవారు కాదు. లాలించేవారు. మగవాళ్లంటే పెదనాన్నలా ఉంటారని అనుకోవడం తప్ప లాలించే మగవాణ్ణి, అనునయంగా మాట్లాడే పురుషుణ్ణి చూడలేదామె.
పద్నాలుగేళ్ల వయసులో, ఈడేరిన ్రపాయంలో అలాంటి పురుషుణ్ణి మొదటిసారి చూసిందామె.
జెమినీ గణేశన్.

ఎదుటివారి తప్పులు మనకు తోవ ఇస్తే మన తప్పులు మరొకరికి దారి ఇస్తాయి. ఈ వృత్తం సావిత్రి జీవితంలో పర్‌ఫెక్ట్‌గా పూర్తయ్యింది. ఎలాగంటే భానుమతి చేసిన రెండు తప్పులు సావిత్రికి లాభించాయి. డి.ఎల్.నారాయణ ‘దేవదాసు’ తీయడానికి నిశ్చయించుకుని పార్వతి వేషం వేయమని అడగడానికి వెళితే ‘నా దగ్గర ప్రోడక్షన్ మేనేజర్‌గా పని చేసి నన్నే హీరోయిన్‌గా బుక్ చేయడానికి వచ్చావా’ అన్నట్టుగా ఆమె అంగీకరించ లేదు.
ఆ వేషం సావిత్రికి వెళ్లింది. సావిత్రి వెలిగింది.
‘మిస్సమ్మ’ షూటింగ్ మొదలయ్యి రెండున్నర రీళ్లు తీశాక, షూటింగ్ రోజు వ్రతం పెట్టుకుని ఆ సంగతి సరిగ్గా సమాచారం ఇవ్వక షూటింగ్‌కు రాకపోవడంతో చక్రపాణికీ, భానుమతికీ పేచీ వచ్చింది. చక్రపాణి ఆమె ఎదుటనే అందాకా తీసిన రీళ్లను కుప్పబోసి నిప్పంటించాడు. భానుమతి చేయాల్సిన మిస్సమ్మ భానుమతికి కాకుండా పోయింది.

ఆ వేషం సావిత్రికి దక్కింది. సావిత్రికి తిరుగు లేకుండా పోయింది.
మరి కొన్నేళ్లకు సావిత్రి చేసిన రెండు తప్పులు– అధిక తిండి, మద్యపానం ఆమెనూ ఆమె రూపాన్ని మార్చేశాయి. ‘దేవత’ (1965) తీసే నాటికి లాంగ్‌షాట్‌లో చూపించాలంటే కెమెరామెన్‌లు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఆప్పటికి ఆమె వయసు కేవలం 30. కొత్త హీరోయిన్లు ఆమె అవకాశాలు తన్నుకుపోయారు. విశేషం ఏమంటే ఆమె కంటే ఒక్క సంవత్సరం తర్వాత పుట్టిన జమున 1975 వరకూ హీరోయిన్‌గా చెలాయించింది.
సావిత్రికి ఒక సమస్య ఉంది. ఏదైనా పాత్ర ఇస్తే ఆ పాత్రను అద్భుతంగా అర్థం చేసుకుంటుంది. ఎదురుగా ఉండబోయే పాత్రలు ఇవే అనంటే వాటినీ అంతే బాగా అనలైజ్ చేసుకుంటుంది. కాని ఇంత తెలిసిన నటి ఎందుచేతనో ఎదుట ఉన్న మనిషిని మాత్రం గుర్తించలేదు. వాళ్లు ఎటువంటి వాళ్లో, వాళ్లు ఏ వేషం కట్టి తన వద్దకు వచ్చారో ఎప్పడూ గ్రహించలేకపోయింది. ఆమెకు తెలిసింది ఒక్కటే. నమ్మడం. నమ్మి చెడ్డవాళ్లలో సావిత్రిది ముందు వరుస. ఆమెకు కల్లబొల్లి మాటలు చెప్పి నగలు దోచుకెళ్లిన వాళ్లు... కొంగు ముడిలో ఉన్న డబ్బు కాజేసినవారు.... తీసుకున్న డబ్బు ఎగ్గొట్టిన వారు... చిల్లరకు ఆస్తులు కొని కొట్టేసిన వాళ్లు.... అందరూ అయినవాళ్లే. నమ్మించిన వాళ్లు.
మనిషికి చదువు తోడుండాలి. లేదా చదువుకున్న వారి తోడు ఉండాలి. సావిత్రికి రెండూ లేవు. ఇన్‌కంటాక్స్‌ను కట్టాలని, సరిగా కట్టాలని తెలియాల్సిన అవసరం ఉంది. తెలియచేయాల్సిన వారి బాధ్యతా ఉంది. 8లక్షల టాక్స్ బకాయిలు 30 లక్షల వరకూ వెళ్లాయి. ఆమెను దర్శకురాలిని చేద్దామని ఉవ్విళ్లూరిన బృందం హామీ సంతకాలు పెట్టించి పక్కకు తప్పుకుంది. ‘హీరోయిన్’గా చేయడానికి వచ్చిన ‘పరిమితి’ దర్శకురాలిగా అస్తిత్వం చూపమని పోరు పెట్టింది. సొంత నిర్మాణ దర్శకత్వంలో ‘మూగమనసులు’ సినిమాను తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా ప్రాప్తం’ గా తీయడం ఒక తొందరపాటైతే, అదే సొంత నిర్మాణ దర్శకత్వంలో చలం హీరోగా ‘వింత సంసారం’ తీయడం గ్రహపాటు. రెండూ ఒకే రోజు 1971 ఏప్రిల్ 14న విడుదలయ్యాయి. ఒక తెలుగు హీరోయిన్ తీసిన రెండు సినిమాలు ఒకేరోజు రెండు భాషల్లో రెండు
రాష్ట్రాల్లో విడుదల కావడం రికార్డ్.
కాని ఆ రికార్డును ఎవరూ గుర్తించలేదు. ఆ సినిమాలు ఫ్లాప్ అవడం వల్ల సావిత్రికి ఎంత పోయిందో, ఆ ఫ్లాప్‌లు చూపించి ఎంత లాగవచ్చో మాత్రం గుర్తుంచుకున్నారు.
డబ్బు పోతే బాధ నిజమే కానీ మనుషులు కొట్టే దెబ్బకు కలిగే బాధ ఇంకా అధికం.
నౌకర్లు, చాకర్లు, మంది మార్బలంతో వెలిగిన తార... కారణాలు ఏవైనా ఆమె ఒక్కతి ఒంటరిగా జీవించే స్థితి రారాదు. డయాబెటిస్ పేషంట్ అయినప్పుడు ఆమెకు ఇన్సులిన్, ఆ వెంటనే సరైన ఆహారం ఇచ్చే సిబ్బంది లేని స్థితిలో ఉండటం సరి కాదు. బాధ్యులెవరో తేలాల్సిన దుర్మార్గం అది.
ఫలితంగా ఏమైంది?
1980 మే 11న ఔట్‌డోర్ కోసం బెంగళూరు వెళ్లి ఇన్సులిన్ తీసుకుని, ఆహారం స్వీకరించకుండా నిద్ర పోవడంతో సావిత్రి కోమాలోకి వెళ్లిపోయింది.
ఎలాంటి దేహం ఆమెది? పొంలంలో పని చేసి, స్టేజ్ మీద గెంతి, బలమైన ఆహారం తీసుకుని దృఢంగా పెరిగిన దేహం. కాని మనసు తిన్న ఘాతాలతో స్వయంగా తలపెట్టుకున్న అపకారాలతో ఆ దేహం ధ్వంసమైంది.
ఆ మహానటి ఒక తల్లి కూడా.
‘బొమ్మలు కొనిపెడతాలే నాన్నా’... అని పక్కనే ఉన్న కుమారుడితో అన్న మాటను నెరవేర్చకుండానే మరో 19 నెలల తర్వాత కన్నుమూసిందా కన్నతల్లి.
గొప్ప ప్రతిభ. దానికి అవకాశం దొరకాలి. దొరకబుచ్చుకునేంత వరకు పోరాడాలి. దొరికాక విజృంభించాలి. ఇది... సావిత్రిని చూసి నేర్చుకోవాలి నేటి జెన్ జి తరం.
గొప్ప పురోభివృద్ధి... కాని అప్రమత్తంగా ఉండాలి... ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి... ఆరోగ్య క్రమశిక్షణ ఉండాలి... కుటుంబంలో వచ్చే సమస్యలను శ్రద్ధగా పరిష్కరించుకోవాలి... అప్పుడే అది మరింత గొప్ప విజయం... ఇది కూడా సావిత్రిని చూసి నేర్చుకోవాలి.
సావిత్రి ఒక స్కూల్.
ఆమె నటన, జీవితం రెండూ తెలుగు వారికి శాశ్వత పాఠాలు.
మహానటి టాప్ టెన్
1953 దేవదాసు –వేదాంతం రాఘవయ్య
1955 కన్యాశుల్కం – పి పుల్లయ్య
1955 మిస్సమ్య– ఎల్వీ ప్రసాద్
1957 మాయాబజార్– కెవిరెడ్డి
1957 తోడికోడళ్లు – ఆదుర్తి సుబ్బారావు
1959 అప్పుచేసి పప్పుకూడు – ఎల్వీ ప్రసాద్
1962 గుండమ్మ కథ – కమలాకర కామేశ్వరరావు
1963 నర్తనశాల – కమలాకర కామేశ్వరరావు
1964 మూగమనుసలు – ఆదుర్తి సుబ్బారావు
1965 పాండవ వనవాసం – కమలాకర కామేశ్వరరావు
ఆమె నోట సన్నాయి పాట
‘నీ లీల పాడెద దేవా’.... సన్నాయితో పోటీ పడి ఎస్.జానకి పాడిన ఈ పాట తమిళ డబ్బింగ్ ‘మురిపించే మువ్వలు’లోనిదని అందరికీ తెలుసు. ఈ పాట పాడే సమయానికి ఎస్.జానకికి అంత పేరు లేదు. దాంతో సావిత్రి ఈ పాటను సుశీల వంటి పెద్ద గాయనితో పాడించాలని కోరింది. అయితే సన్నాయితో పోటీ పడే గళం జానకికి తప్ప మరొకరితో లేదని అందరూ తేల్చి చె΄్పాక అభినయించడానికి ఒప్పుకుంది. ‘నీ లీల పాడెద దేవా’ పాటను జెమినీ గణేశన్‌తో అభినయించడం వల్ల ఒక సూపర్‌హిట్ పాటను ఆ భార్యాభర్తలు అభినయించినవారు అయ్యారు. సావిత్రికి చక్కని గొంతు ఉంది. ఆమె పాటలు కూడా పాడుతుంది. అంతే కాదు షూటింగ్‌లు లేనప్పుడు తన సినిమాల పాటల రికార్డింగ్ ఏదైనా జరుగుతూ ఉంటే వెళ్లి కూచునేది. ఆమె తొలిసారి దర్శకత్వం వహించిన ‘చిన్నారి పాపలు’ కు సంగీత బాధ్యతలు పి.లీలకు అప్పగించిందామె. ఆమె దర్శకత్వంలోని ‘మాతృదేవత’లో ‘మనసే కోవెలగా మమతలు మల్లెలుగా’ పాట పెద్ద హిట్.
మీకు మీరే మాకు మేమే...
స్వాభావికంగా మంచితనం ఉన్న ఆర్టిస్టులో గొప్ప ఆర్ట్ ఉంటే ఆ ఆర్టిస్టుకు తిరుగు ఉండదు. సావిత్రిని చూస్తే మంచి అమ్మాయి అని టక్కున తెలిసి పోతుంది. ఆ ముఖంలో అసామాన్యమైన ప్రతిభ కూడా కనిపిస్తుంటే జనం ఊ.. అన్నా బ్రహ్మరథం పడతారు. ఆ.. అన్నా బ్రహ్మరథం పడతారు. 1955లో సావిత్రి సినిమాలు ముఖ్యమైనవి మూడు వచ్చాయి. ‘మిస్సమ్మ’, ‘దొంగరాముడు’, ‘కన్యాశుల్కం’. ఒకదానిలో టీచరమ్మ, మరోదానిలో కూరలమ్మి, ఇంకోదానిలో వేశ్య. ‘మిస్సమ్మ’లో కస్సుబుస్సులాడే సావిత్రిని చూసి ఎమ్టీరావు అనే ఎన్.టి.రామారావు ‘నేను కూడా అంతో ఇంతో మంచివాణ్ణే కదండీ’ అంటాడు బెరుగ్గా. అప్పటికి సావిత్రికి స్టార్ స్టేటస్ రాలేదు. కాని తన నటనతో ఎదురుగా ఉన్నది రామారావు అయినా పాత్రకు తగ్గ పై చేయి సాధించగలిగింది. ‘మీకు మీరే మాకు మేమే’ పాటలో సావిత్రి ఈసునసూయలు ఎంత అందమో అంత చందం.
‘దొంగ రాముడు’లో నిజమైన కూరగాయల బుట్టను నెత్తిన పెట్టుకుంటే ‘ఎందుకమ్మా... ఉత్త బుట్ట చాలు’ అని ఎవరో అంటే ‘లేదు సార్.. ఉత్త బుట్ట నడకకీ బరువు బుట్ట నడకకీ తేడా ఉంటుంది’ అని మోసిందామె. ఆమె ఆ బుట్టతో నడుస్తుంటే శరీరం చూసి పురుషులకు చిత్త వికారం కలగదు. సావిత్రి అదే సినిమాలో ఖాళీ బుట్టతో నడక కూడా ఎలా ఉంటుందో చూపుతుంది. రెంటికీ తేడా! ఇక ఆర్.నాగేశ్వర రావుతో సావిత్రి పాడిన ‘రావోయి మా ఇంటికి’ కంటితో వింటూ చెవితో చూడాలి.
‘కన్యాశుల్కం’లో మధురవాణిని అర్థం చేసుకుని సాహితీ ప్రమాణాలకు తగినట్టుగా ఆ వయసులో నటించడం సావిత్రి మరో రికార్డు! అందులో ‘లొటిపిట్ట’ జోక్‌కు మధురవాణి సుదీర్ఘంగా నవ్వే సీన్ ఉంది. అంతసేపు వేరెవరైనా నవ్వితే ప్రేక్షకులు తెర చింపేస్తారు. సావిత్రి కాబట్టి చెల్లింది.
సావిత్రి తెలుగులో నటించే వేళకు హిందీలో హీరోయిన్లు స్విమ్‌సూట్‌లు వేస్తున్నారు. మోడ్రన్ డ్రస్సులు... హెయిర్ స్టయిల్స్ ఫాలో అవుతున్నారు. వాన పాటల్లో తడుస్తున్నారు. కాని సావిత్రి కేవలం కట్టు, బొట్టులతో తను తనలాగే ఉంటూ ప్రేక్షకులను జయించింది. డాన్స్ బాగా వచ్చినా చాలా కొద్దిగా తప్ప చేయలేదు. క్లోజప్‌ను కాచుకోగల ఏకైక నటి ఆమె. ఆమె క్లోజప్స్‌ను ‘మాయాబజార్’లో చూడాలి. తల్లిచాటు శశిరేఖ, ప్రేమిక శశిరేఖ, మాయా శశిరేఖ... ఆ సినిమాలో ఆమె ‘మగాడు’లా నటించింది.
‘మూగ మనసులు’ స్క్రిప్ట్ విని ‘నేను గౌరి పాత్ర వేస్తాను’ అన్నదట సావిత్రి. ‘నువ్వు ఆ పాత్ర వేస్తే రాధలా వేసే వారిని ఎక్కణ్ణుంచి తేవాలి’ అన్నారట ఆదుర్తి. అవును... నాగేశ్వరరావును ‘ఒరే’ అనగలిగేది, అంటే ప్రేక్షకులు వినగలిగేది సావిత్రి నుంచే. ‘మంచి మనసులు’లోని సావిత్రి వేసిన పాత్రకు ఎందరో అభిమానులు. ఆమె నాగేశ్వరరావును అల్లరి పెడుతుంటే మురిసిన స్త్రీలు నాగేశ్వరరావు దక్కకపోతే ఆమె కంటే ఎక్కువ దు:ఖపడ్డారు.
‘డాక్టర్ చక్రవర్తి’లో ‘నీవు లేక వీణ’ పాట సున్నితమైనది. భర్తను తలుచుకుంటూ విరహంతో శృంగార భావనను చాలా సటిల్‌గా చూపుతుంది సావిత్రి. ‘పరువము వృధగా బరువుగా సాగే’ లైన్ దగ్గర తన చెంపను తనే నిమురుకుని, రెండు చేతులు దగ్గరకు చేర్చి ఒళ్లు విరుచుకుంటుందామె. అసభ్యత లేని ఆ చేష్ట శృంగారాభినయానికి ఆనవాలు.
ఇటువంటి గొప్ప నటి ‘గోరింటా పూసింది కొమ్మా లేకుండా’ అని తెల్ల వెంట్రుకలతో, బక్క చిక్కి పాడితే, ఎలా ఉన్నా ‘సావిత్రి ఉందట’ అంటూ మహిళా ప్రేక్షకులు పోటెత్తారు. సావిత్రి ఘనతలు చెప్పడం చక్కెరలో పలుకులు లెక్కబెట్టడం. నిరూపణ అక్కర్లేని గొప్పతనం, మహా నటనం సావిత్రిది. అందుకే ఆమె మహానటి సావిత్రి.


