లండన్‌లో రాజ్‌... సిమ్రాన్‌ | SRK and Kajol mark 30 years of DDLJ with bronze statue unveiling in London | Sakshi
Sakshi News home page

లండన్‌లో రాజ్‌... సిమ్రాన్‌

Dec 6 2025 1:12 AM | Updated on Dec 6 2025 1:12 AM

SRK and Kajol mark 30 years of DDLJ with bronze statue unveiling in London

సినిమా ప్రేమికులందరూ అమితంగా ఇష్టపడిన   ప్రేమ కావ్యం ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’. ఈ సినిమాలో రాజ్‌ (షారుక్‌ ఖాన్‌), సిమ్రాన్‌ (కాజోల్‌)ల ప్రేమకథ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరించిందో తెలిసిందే. తాజాగా లండన్స్ లోని లీసెస్టర్‌ స్క్వేర్‌లో రాజ్, సిమ్రాన్‌ల కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయడం విశేషం. లండన్‌ లీసెస్టర్‌ స్క్వేర్‌లో విగ్రహ రూపంలో ఆవిష్కరింపబడ్డ తొలి ఇండియన్‌ సినిమా ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ కావడం ఓ అరుదైన గౌరవం. షారుక్‌ ఖాన్, కాజోల్‌ జోడీగా ఆదిత్యా చోప్రా దర్శకత్వం వహించిన చిత్రం ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’.

యశ్‌ చోప్రా నిర్మించిన ఈ సినిమా 1995 అక్టోబరు 20న విడుదలైంది. అత్యధిక రోజులు ప్రదర్శితమైన సినిమాగా అరుదైన ఘనతను సాధించిన చిత్రం కూడా ఇదే. తెలుగులో ‘ప్రేమించి పెళ్లాడుతా’ పేరుతో రిలీజై, ఇక్కడా భారీ వసూళ్లతో బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. ఈ సినిమా విడుదలై 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీలో షారుక్‌–కాజోల్‌ల సిగ్నేచర్‌ పోజుతో కూడిన కాంస్య విగ్రహాలను రూపొంందించారు. లండన్‌లోని లీసెస్టర్‌ స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాలను షారుక్, కాజోల్‌ ఆవిష్కరించారు.

ఈ  కార్యక్రమానికి యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ సీఈఓ అక్షయ్‌ విదానీ, హార్ట్‌ ఆఫ్‌ లండన్‌ బిజినెస్‌ అలయన్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రాస్‌ మోర్గన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా షారుక్‌ ఖాన్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాని స్వచ్ఛమైన మనసుతో ఎంతగానో ప్రేమించి తీశాం. ఈ చిత్రం రిలీజైనప్పటి నుంచి ఇప్పటివరకు నేను, కాజోల్‌ ప్రేక్షకుల నుంచి ప్రేమను పొంందుతూనే ఉన్నాం’’ అని తెలిపారు. కాజోల్‌ మాట్లాడుతూ– ‘‘లండన్‌లో విగ్రహం ఆవిష్కరించిన దృశ్యాన్ని చూసినప్పుడు... ఆ చారిత్రాత్మక అనుభూతిని మళ్లీ పొంందినట్లుగా అనిపించింది’’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement