కెవ్వు కేక, చయ్యచయ్య చయ్యా, మున్నీ బద్నాం హూయి.. వంటి పాటలతో దుమ్ములేపింది మలైకా అరోరా. ఆకర్షణీయమైన అందం, అదిరే స్టెప్పులతో అభిమానులను ఉర్రూతలూగించింది. ఇటీవలే థామా సినిమాలోనూ 'పాయిజన్ బేబీ' పాటలో తళుక్కుమని మెరిసింది. ఐటం సాంగ్స్ స్పెషలిస్ట్‌గా వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను చూసింది.
పెళ్లి - విడాకులు
ఓ కాఫీ యాడ్ షూట్‌లో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు, నటుడు అర్బాజ్ ఖాన్‌ను కలిసింది మలైకా. తొలిచూపులోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వెంటనే మరేం ఆలోచించకుండా పెళ్లి చేసుకుంది. వీరికి కుమారుడు అర్హాన్ ఖాన్ సంతానం. రానురానూ దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2015లో వీరిద్దరూ విడిపోయారు.
యంగ్ హీరోతో డేటింగ్
అనంతరం తనకంటే వయసులో 12 ఏళ్లు చిన్నవాడైన హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమలో పడింది. కొన్నేళ్లపాటు డేటింగ్ చేసిన వీరు ఆ తర్వాత సడన్‌గా బ్రేకప్ చెప్పుకున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ హర్ష్ మెహతా అనే వ్యాపారితో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా మలైకా అరోరా ఓ ఇంటర్వ్యూలో తన తల్లి ఇచ్చిన సలహాను ఎలా పెడచెవిన పెట్టిందో చెప్పుకొచ్చింది.
డేట్ చేసినవాడితో పెళ్లెందుకు?
ఆమె మాట్లాడుతూ.. మా అమ్మ ఎప్పుడూ జీవితాన్ని ఎంజాయ్ చేయమని చెప్తుండేది. ఫస్ట్ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దని సలహా ఇచ్చింది. కానీ, నేనదే చేశాను. నేను ప్రేమించిన మొదటి వ్యక్తినే పెళ్లాడాను. నా నిర్ణయాన్ని అమ్మ తప్పుపట్టింది. అప్పుడే పెళ్లి చేసుకుంటే నీకోసం బయట ఏం దాగి ఉందో నీకెలా తెలుస్తుంది? అని కంగారుపడింది. ఏం కాదమ్మా.. అని సర్ది చెప్పాను. మేం ఏం చేయాలనుకున్నా సరే తనెన్నడూ అడ్డు చెప్పలేదు.
మగవాళ్లను తప్పుపట్టరు
కానీ ఈ ప్రపంచంలో మగవాడు ఏం చేయాలనుకున్నా ఎవరూ తప్పుపట్టరు. విడాకులు తీసుకున్నా.. తన వయసులో సగం ఏజ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నా సరే.. వావ్ అని పొగుడుతారు. అదే పని మహిళ చేస్తే మాత్రం ఆమెను నానామాటలంటారు. అంతెందుకు? ఆడవాళ్లు ధైర్యంగా నిలబడి ముందుకెళ్తుంటే కూడా చూసి ఓర్వలేరు అని మలైకా అరోరా (Malaika Arora) చెప్పుకొచ్చింది.
చదవండి: టికెట్ టు ఫినాలే గెలిచేదెవరు?


