హీరోయిన్ సమంత, ఫ్యాషన్ డిజైనర్, మోడల్ శిల్పారెడ్డి క్లోజ్‌ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు. శిల్పా లేకుండా సమంత ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు. సామ్-రాజ్ పెళ్లిలోనూ శిల్పా స్నేహితురాలికి తోడుగా నిలబడింది. తాజాగా ఆ విశేషాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.
ఈ మధ్యకాలంలో చూడలేదు
శిల్పా రెడ్డి మాట్లాడుతూ.. సమంత-రాజ్‌ల పెళ్లి ఎంత బాగా జరిగిందంటే ఈ మధ్యకాలంలో అటువంటి వివాహ వేడుకను నేను చూడనేలేదు. ఎంతో పవిత్రతతో ఈ తంతు సాగింది. సమంత-రాజ్ పూర్తిగా భిన్నస్వభావాలు కలిగినవారు. సామ్ చాలా ఎనర్జిటిక్, కొంటె అమ్మాయి, ఎక్కువ నవ్వుతూ ఉంటుంది. కానీ, రాజ్.. చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఇతడితో ఫోన్‌లో మాట్లాడా.. అయితే, పెళ్లిలోనే ఫస్ట్ టైమ్ కలిశాను.

ఏడ్చేశారు
ఈ ఇద్దరి వ్యక్తిత్వాలు పెళ్లి ద్వారా ఒక్కటవడం చూస్తున్నప్పుడు చాలా మంచి అనుభూతి కలిగింది. ఈ పెళ్లికి ప్రతి కుటుంబం నుంచి పది మంది మాత్రమే హాజరయ్యారు. అది కూడా సామ్, రాజ్‌కు బాగా దగ్గరైన వ్యక్తులు మాత్రమే వచ్చారు. ఇండస్ట్రీ నుంచి దర్శకురాలు నందినీరెడ్డి మాత్రమే వచ్చారు. ఎటువంటి గందరగోళం లేకుండా ప్రశాంతంగా, అందంగా ఈ వేడుక జరిగింది. అగ్ని ముందు పెళ్లి సూత్రాన్ని వధువు వేలికి, వరుడు వేలికి తగిలించే విధానాన్ని చూసినప్పుడు నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఏదో శక్తి ఉద్భవించినట్లు అనిపించింది. ఆ ఎనర్జీని ఫీలై ఏడుగురు మంది మహిళలు ఏడ్చేశారు. అంత పవిత్రంగా ఆ వేడుక జరిగింది.
సమంతతో నా అనుబంధం
సమంత (Samantha) నేను కలిశామంటే నవ్వుతూనే ఉంటాం. మాపై మేమే జోకులు వేసుకుంటాం. ఒకరినొకరు ఏడిపించుకుంటాం. నాదేదైనా తప్పుంటే నన్ను చాలా ర్యాగింగ్ చేస్తుంది. మా మధ్య ఎటువంటి హద్దులు ఉండవు. ఒకరినొరు టీజ్ చేసుకుంటాం, తిట్టుకుంటాం, అలుగుతాం కూడా! సమంత అనారోగ్యం బారినపడటం, విడాకులు, ట్రోలింగ్.. ఇలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అయినా అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగింది. తను గొప్ప ఫైటర్. అందుకే తనంటే చాలామందికి ఇష్టం అని శిల్పా రెడ్డి (Shilpa Reddy) చెప్పుకొచ్చింది.


