హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం వా వాద్దియార్ (తెలుగులో 'అన్నగారు వస్తారు' పేరిట రిలీజవుతోంది.). కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన ఇందులో సత్యరాజ్, రాజ్‌కిరణ్, జీఎం సుందర్, శిల్పామంజునాథ్, ఆనంద్‌రాజ్, కరుణాకరన్, రమేష్ తిలక్, పీఎల్ తేనప్పన్ ముఖ్యపాత్రలు పోషించారు. స్టూడియో గ్రీన్ ప్రతాపంపై జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని, జార్జ్ విలియమ్స్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం డిసెంబర్ 12న తెరపైకి రానుంది.
ఈ చిత్రంలోని రెండు పాటలను ఇప్పటికే విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా మూడో పాటను సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ తన తల్లితో కలిసి పాడడం విశేషం. ఈ పాట వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇది గతంలో ఎంజీఆర్ చిత్రంలోని 'రాజా విన్ పార్‌ర్వై రాణి ఇన్ పక్కం..' పాటకు రీమిక్స్ అన్నది గమనార్హం. ఈ పాటను పాడిన సంతోష్ నారాయణన్ తల్లికి కార్తీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ పాటకు పలువురు నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. కృతి శెట్టి వావ్ సూపర్.. అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అదేవిధంగా సిద్ధార్థ్, అతిథిరావ్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, గాయకుడు విజయ్ ఏసుదాస్ వంటి ప్రముఖులు శుభాకాంక్షలు అందించారు. ఈ చిత్రంలో కార్తీ ఎంజీఆర్ వీరాభిమానిగా నటించినట్లు సమాచారం. ఇకపోతే ఈ చిత్ర ట్రైలర్, ఆడియోలను ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలోనే నిర్వహించనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి.


