డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయినవారిలో హీరోయిన్ సాయిపల్లవి ఒకరు. చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగింది. ఈమె మలయాళంలో నటించిన ప్రేమమ్ అనూహ్య విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఈ నేచురల్ బ్యూటీకి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు ఎర్ర తివాచీ పరిచాయి. మంచి క్లాసికల్ డ్యాన్సర్ అయిన సాయిపల్లవి మొదటినుంచి గ్లామర్‌ను దరి చేరనీయకుండా జాగ్రత్త పడుతూ పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.
అంతేకాకుండా ఈమె నటించిన చిత్రాలు మంచి విజయాన్ని సాధిస్తుండటంతో బోలెడంత క్రేజ్ వచ్చింది. తెలుగులో నాగచైతన్యకు జంటగా నటించిన తండేల్, తమిళంలో శివకార్తికేయన సరసన నటించిన అమరన్ ఘన విజయాలు సాధించడంతో ఆమె రేంజ్ మరింత పెరిగింది. దీంతో ఈమె బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. అక్కడ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో సీతగా నటిస్తోంది.
దాంతో పాటు మరో హిందీ చిత్రంలోనూ నటించే అవకాశం వరించిందని సమాచారం. కొంత గ్యాప్ తర్వాత దక్షిణాది చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతోంది సాయిపల్లవి (Sai Pallavi). రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్న చిత్రంలో సాయిపల్లవి నటించనున్నారని లేటెస్ట్ టాక్. ఈ మూవీలో నటించేందుకు ఆమె అత్యధికంగా రూ.15 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.


