పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటిన పుష్పరాజ్ జపాన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు. హీరో అల్లు అర్జున్ టైటిల్ రోల్ (పుష్పరాజ్)లో నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా 2026 జనవరి 16న జపాన్‌లో విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించగా, శ్రీలీల ప్రత్యేక పాటలో సందడి చేశారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా 2024 డిసెంబరు 5న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
అంతేకాదు... విడుదలైన 32 రోజుల్లోనే ‘పుష్ప 2: ది రూల్’ ప్రపంచవ్యాప్తంగా రూ. 1831 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించినట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలై (డిసెంబరు 4న ప్రీమియర్స్) నేటికి ఏడాది అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని విమల్ థియేటర్‌లో స్పెషల్ షో ఏర్పాటు చేశారు నిర్మాతలు. మరి.. వచ్చే ఏడాది జపాన్ భాషలో రిలీజ్ కానున్న ‘పుష్ప 2: ది రూల్’ ఎన్ని వసూళ్లు సాధిస్తుంది? ఎన్ని రికార్డులు సృష్టిస్తుంది? అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.


