దేశంలో వారసత్వ చట్టాన్ని మారుస్తుందా?
టోక్యో: జపాన్ యువరాణి ఐకోకు ప్రజాదరణ పెరుగుతోంది. ఆమె బయట కనిపిస్తే చాలు.. ప్రజలు ఓ పాప్‌స్టార్‌ను చూసినట్టు హర్షధ్వానాలు చేస్తున్నారు. చక్రవర్తి నరుహిటో, చక్రవర్తి మసాకోతో కలిసి ఈ ఏడాది ప్రారంభంలో ఆమె నాగసాకిని సందర్శించినప్పుడు, రోడ్ల వెంట జనం ఆమె పేరుతో నినాదాలు చే శారు. ఇది ఆమె తల్లిదండ్రులను సంతోషపరిచినా.. మహిళను చక్రవర్తిగా అంగీరించని జపాన్ సామ్రాజ్య చట్టంతో 2వేల ఏళ్ల జపాన్ రాచరిక మనుగడ ప్రమాదంలో పడింది.
రాజ కుటుంబంలో 16 మంది సభ్యులు ఉన్నారు. అందరూ పెద్దవాళ్ళు. నరుహిటోకు తరువాత ఇద్దరు వారసులున్నారు. నరుహిటో తమ్ముడు క్రౌన్ ప్రిన్స్ అకిషినో. అతనికి 60 ఏళ్లు. ఆయన కుమారుడు ప్రిన్స్ హిసాహిటోకు 16 ఏళ్లు. ఇప్పట్లో సింహాసనం చేపట్టే అవకాశాలు లేవు. పురుష వారసుల కొరత రాచరికానికి ఆందోళన కలిగిస్తోంది. జపాన్‌లో వృద్ధుల జనాభా పెరుగుతుండటం, యువత జనాభా తగ్గుతుందడానికి ఇది నిదర్శన.
వ్యతిరేకిస్తున్న ఓ వర్గం..
యువరాణి ఐకోకు సోమవారానికి 24 ఏళ్లు నిండాయి. అధికారం చేపట్టడానికి అనుమతించే వయసు. కానీ.. చక్రవర్తికి ఏకైక సంతానం అయిన ఐకో చక్రవర్తి కావాలంటే పురుషులు మాత్రమే వారసత్వాన్ని పొందే జపాన్ సామ్రాజ్య వారసత్వ చట్టాన్ని మార్చాలి. ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. రాచరికం అంతరించి పోకుండా ఉండాలంటే మహిళలపై నిషేధం ఎత్తివేయాలని నిపుణులు చెబుతున్నారు. జపాన్ ప్రభుత్వం మహిళా చక్రవర్తిని అనుమతించాలని కోరుతూ గతేడాది ఐక్యరాజ్య సమితి మహిళా హక్కుల కమిటీ ఒక నివేదికను కూడా విడుదల చేసింది. కానీ ప్రధాన మంత్రి సనే తకైచితో సహా చట్టసభ్యులు అనేకమంది ఈ మార్పును వ్యతిరేకిస్తున్నారు.
అధికారిక కార్యక్రమాల్లో ఐకో..
ఐకో 2001 డిసెంబర్ 1న జన్మించారు. తన తల్లిదండ్రులు చదివిన గకుషుయిన్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలయ్యారు. యూకేలోనూ ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ తరువాత జపనీస్ రెడ్‌క్రా‹స్ సొసైటీలో వాలంటీర్‌గా పనిచేయడం ప్రారంభించారు. ఇటీవలి కాలంలో కుటుంబంతో కలిసి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 2021లో 20 ఏళ్లు నిండినప్పటి నుంచే ఆమె తెలివితేటలు, స్నేహపూర్వకమైన వ్యక్తిత్వం, ఫన్నీగా ఉండే తత్వం ప్రజలను ఆకట్టుకుంది. అప్పటినుంచే ఐకో అభిమానులను సంపాదించుకున్నారు. గత నెలలో ఆమె లావోస్ పర్యటన.. మొట్టమొదటి అధికారిక సోలో పర్యటన. ఆరు రోజుల పర్యటనలో భాగంగా ఆమె లావో‹స్ లోని అగ్రశ్రేణి అధికారులను కలిశారు. సాంస్కృతిక, చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. స్థానికులను కలిశారు. ఈ విదేశీ పర్యటన తర్వాత ఐకోకు మద్దతు పెరిగింది. యువరాణికి పెరిగిన ప్రజాదరణ చట్టాన్ని మార్చాలనే వాదనను తెరపైకి తెచి్చంది.


