కదలికల్ని ట్రాక్‌ చేసి ఖమేనీ ప్రాణం తీసిన మొస్సాద్‌? | Ayatollah Ali Khamenei Killed In Precision Strike By Israel And US, Know How Israel Tracked Khamenei Under Operation Epic Fury | Sakshi
Sakshi News home page

కదలికల్ని ట్రాక్‌ చేసి ఖమేనీ ప్రాణం తీసిన మొస్సాద్‌?

Mar 3 2026 12:36 PM | Updated on Mar 3 2026 1:26 PM

how Israel tracked Khamenei

జెరుసలేం : దశాబ్దాల పాటు ఇరాన్‌ను శాసించి, పశ్చిమ దేశాలకు కంట్లో నలుసులా మారిన ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ (86) కథ ముగిసింది. ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’ పేరుతో గత శనివారం ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా భీకర దాడులు జరిపింది. ఖమేనీ కార్యాలయం లక్ష్యంగా జరిగిన భారీ దాడుల్లో ఖమేనీ మరణించారు.

అయితే, ఖమేనీ ప్రాణాలు తీసేందుకు ఇజ్రాయెల్‌ నిఘూ సంస్థ మొస్సాద్‌ ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ట్రాఫిక్ సీసీటీవీ కెమెరాలను, ఫోన్‌లను హ్యాక్‌ చేసినట్లు పలు అంతర్జాతీయ మీడియా సంచలన కథనాలు వెలువరించాయి. నివేదికల ప్రకారం, ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్‌ టెహ్రాన్ నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కెమెరాల నెట్‌వర్క్‌లోకి చొరబడి, వాటి ఫుటేజీని గోప్యంగా సేకరించినట్టు సమాచారం.  

ఇరాన్‌లోని ఖమేనీ నివాసం ఉండే అనుమానిత ప్రాంతం టెహ్రాన్‌లోని పాశ్చర్ స్ట్రీట్‌లో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌తో పాటు ఖమేనీ సన్నిహితులు, ఇతర ప్రభుత్వ పెద్దల ఫోన్‌ వ్యవస్థల్లో చొరబడింది. అనంతరం,ఇజ్రాయెల్‌ ట్రాక్‌ చేసిన ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఫుటేజీ, ఖమేనీ ఫోన్‌ సంభాషణతో పాటు ఇతర వివరాలన్నీ ఎన్‌క్రిప్టెడ్‌,ట్రాన్స్‌మీటర్‌ ద్వారా ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలకు సమాచారం అందేది.

సీఎన్‌ఎన్‌ నివేదిక ప్రకారం, అమెరికా, ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఖమేనీ రోజువారీ జీవనశైలిని, ఆయన ఎక్కడ నివసిస్తారో, ఎవరిని కలుస్తారో, ఎలా సంభాషిస్తారో, దాడి జరిగితే ఎక్కడికి వెళ్ళవచ్చో అన్న విషయాలను లోతుగా అధ్యయనం చేశారు. అదేవిధంగా, ఆయనతో తరచుగా సమావేశం కాని ఇతర రాజకీయ, సైనిక నాయకుల కదలికలను కూడా గమనించారు. ఇజ్రాయెల్‌ ఒక కెమెరా సాయంతో ఖమేనీ గురించి పూర్తి సమాచారం రాబట్టినట్లు తేలింది. ఆ కెమెరా ఖమేనీ బాడీగార్డులు తమ వ్యక్తిగత వాహనాలను ఎక్కడ పార్క్‌ చేస్తారో, వారి రోజువారీ అలవాట్లు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ఉపయోగపడింది.

ఈ క్రమంలో గత శనివారం ఉదయం టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్‌ కార్యాలయం, అధ్యక్ష భవనం, జాతీయ భద్రతా విభాగం ఉన్న సముదాయంలో ఖమేనీతో పాటు ఇతర ఉన్నతాధికారులు సమావేశం కావాల్సి ఉంది. మొదట రాత్రి దాడి చేయాలని నిర్ణయించినా, చివరికి పగలు దాడి చేయాలని వ్యూహం మార్చారు. ఇజ్రాయెల్‌ కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం 6 గంటలకు, యుద్ధ విమానాలు ఖచ్చితమైన లక్ష్యాలను తాకే మెషిన్లతో  దాడి ప్రారంభించాయి.

అసోసియేటెడ్‌ ప్రెస్‌ తెలిపిన వివరాల ప్రకారం, ఇజ్రాయెల్‌ సైనిక అధికారి ఒకరు ఈ దాడులు 60 సెకన్లలో మూడు లక్ష్యాలను తాకాయని, ఫలితంగా ఖమేనీతో పాటు సుమారు 40 మంది ఉన్నతాధికారులు, రివల్యూషనరీ గార్డ్‌ చీఫ్‌ కూడా మరణించారని తెలిపారు. పగలు దాడి జరపడం ద్వారా ఆశ్చర్యాన్ని కలిగించగలిగామని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement