ఈ ఏడాది కాంతార చాప్టర్-1తో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన కన్నడ హీరో రిషబ్ శెట్టి. దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రాన్ని గతంలో రిలీజై సూపర్ హిట్గా కాంతారకు ప్రీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మించారు.
అయితే ఈ మూవీ తర్వాత రిషబ్ శెట్టి నెక్ట్స్ ప్లాన్ ఏంటనే దానిపై అప్పుడే చర్చ మొదలైంది. కాంతార-3 ప్లాన్లో ఉన్నారా? లేదంటే మరో కొత్త మూవీ తెరకెక్కిస్తున్నారా? అనే సస్పెన్స్ నెలకొంది. అయితే ఇప్పటివరకు కొత్త మూవీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ రిషబ్ శెట్టి తన నెక్స్ట్ సినిమా టాలీవుడ్లో చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.
టాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్తో రిషబ్ శెట్టి జత కట్టనున్నారని లేటేస్ట్ టాక్. ఓ యోధుడి కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. చరిత్రలో మరుగున పడిపోయిన ఓ వీరుడి గాథను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. బంకించంద్ర ఛటర్జీ రచించిన 'ఆనంద్ మఠ్' అనే పుస్తకం స్ఫూర్తిగా తీసుకొని ఈ కథని దర్శకుడు అశ్విన్ అశ్విన్ గంగరాజు తెరకెక్కించనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది 2026 వేసవిలో షూటింగ్ ప్రారంభిస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


