కోర్ట్ని ఆశ్రయించిన 'కాంతార' నిర్మాతలు?
మరో రెండు వారాల్లో 'కాంతార' కొత్త సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఇంతవరకు ప్రమోషన్స్ మొదలుపెట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే మిగతా అన్నీ పనులు పూర్తయినప్పటికీ సొంత రాష్ట్రంలోనే ఓ సమస్య ఇబ్బందిగా మారింది. దీంతో నిర్మాతలు ఇప్పుడు కోర్టుని ఆశ్రయించారని టాక్. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఏంటి విషయం?రీసెంట్‌గానే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం.. సినిమా టికెట్స్ విషయమై సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో టికెట్ ధరలు తగ్గించేసింది. మల్టీప్లెక్స్‌ల్లో గరిష్ఠ టికెట్ ధర రూ.236 మాత్రమే ఉంది. ఇంతకంటే పెంచడానికి వీలు లేదని తీర్మానించింది. దీన్ని ఇప్పటికే అమలు చేస్తున్నారు కూడా. చిన్న బడ్జెట్ మూవీస్‌కి దీని వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ 'కాంతార' లాంటి చిత్రానికి పెట్టిన బడ్జెట్ తిరిగి రావాలంటే టికెట్ ధరలు పెంచాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ విషయమై నిర్మాతలు హొంబలే ఫిల్మ్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: అరుంధతి రీమేక్‌లో శ్రీలీల.. 'మెగా' డైరెక్టర్!)టికెట్ ధరలు పెంచుకునేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని 'కాంతార' నిర్మాతలు రిట్ పిటిషన్ వేసినట్లు సమాచారం. ఒకవేళ ఇది వర్కౌట్ అయితే.. వీళ్లతో పాటు భారీ బడ్జెట్ పెట్టే నిర్మాతలకు మార్గం సుగమమం అవుతుంది. లేదంటే 'కేజీఎఫ్' రికార్డులు కాదుకదా రూ.1000 కోట్ల మార్క్ కూడా దాటడం కష్టమైపోతుంది. అలానే కర్ణాటకలో తక్కువ రేట్, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ధర పెడితే మాత్రం కచ్చితంగా విమర్శలు వస్తాయి. మరి ఈ పిటిషన్‌పై ఫలితం ఏమొస్తుందో చూడాలి?దసరా కానుకగా అక్టోబరు 2న 'కాంతార: ఛాప్టర్ 1' థియేటర్లలోకి రానుంది. తొలి పార్ట్ సింపుల్‌గా రూ.15-20 కోట్లతో తీస్తే రూ.400 కోట్ల వరకు వసూలు చేసింది. దీంతో రెండో భాగాన్ని కళ్లు చెదిరే బడ్జెట్ పెట్టారు. అలానే రుక్మిణి వసంత్ లాంటి నటుల్ని సినిమాలో భాగం చేశారు. మరి ఈసారి 'కాంతార' ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో?(ఇదీ చదవండి: మాస్క్ మ్యాన్ కాదు టార్చర్ మ్యాన్.. ఉతికారేసిన తనూజ!)