చిత్ర రంగంలో ప్రముఖుల వారసులు కథానాయకుడిగా పరిచయం కావడం కొత్త కాదు. అయితే అలాంటి వారు తమ తల్లిదండ్రుల లెగసీని కాపాడుకోవడం, తాము ఎదగడమే ప్రధాన అంశం. అలా ప్రముఖ సంగీత దర్శకుడు విద్యాసాగర్ వారసుడు హర్షవర్ధన్ విద్యాసాగర్ ఇప్పుడు కథానాయకుడిగా అవతారమెత్తడానికి సిద్ధమవుతున్నారని తాజా సమాచారం. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించి పేరు గడించిన సంగీత దర్శకుడు విద్యాసాగర్. ఇప్పటికీ సంగీత దర్శకుడుగా కొనసాగుతున్న ఈయన ఇప్పుడు ఎక్కువగా సంగీత కచేరీలపై దృష్టి సారిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన కుమారుడు హర్షవర్ధన్ విద్యాసాగర్ కూడా సంగీతాన్ని నేర్చుకుని తండ్రితోపాటు సంగీత కచేరిలో పాల్గొంటూ గుర్తింపు పొందుతున్నారు. ఈయన తాజాగా హీరోగా నటించడానికి సిద్ధమవుతున్నారని సమాచారం ఈ చిత్రానికి దర్శకుడు లింగస్వామి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిసింది. ఇది రోడ్డు ట్రావెలింగ్ ఇతివృత్తంతో సాగే యాక్షన్ కథాచిత్రంగా ఉంటుందని సమాచారం. కాగా ఇందులో హర్షవర్ధన్ విద్యాసాగర్ కు జంటగా రుక్మిణీ వసంత్ నటిస్తున్నట్లు సమాచారం.
ఇటీవల శివకార్తికేయన్‌కు జంటగా నటించిన మదరాసీ చిత్రం మంచి పేరును తెచ్చిపెట్టింది. కన్నడంలో నటించిన కాంతార చాప్టర్ 1 చిత్రం మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. దీంతో ఈ అమ్మడికి పలు భాషల్లో అవకాశాలు తలుపు తడుతున్నాయి. అలా వచ్చిన వాటిలో హర్షవర్ధన్ విద్యాసాగర్‌కు జంటగా నటించే చిత్రం అని, ఈ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్‌ను శ్రీలంకలో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.

విద్యాసాగర్ విజయనగరం జిల్లా వాసి
సంగీత దర్శకుడు విద్యాసాగర్ తెలుగు వారే.. ఆయన విజయనగరం జిల్లా వాసి. కానీ, ఎక్కువగా మలయాళం, తమిళ్ పరిశ్రమలో రాణించారు. ఆయన తాతగారు ఉపద్రష్ణ నరసింహమూర్తి బొబ్బిలి సంస్థానంలో ఆస్థాన విద్వాంసునిగా పనిచేసేవారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్తో కలసి ధనరాజ్ మాస్టర్ వద్ద గిటార్, పియానోలలో శిక్షణ పొందాడు. చాలా మందికి ఘోస్ట్ సంగీత దర్శకునిగా దాదాపు 600 సినిమాలకు పనిచేసాడు. అలా 16 ఏళ్ళపాటు చేసాక తమిళంలో 'పూమనం' సినిమాకు మొట్టమొదటిగా సంగీత దర్శకత్వం చేశాడు. ఆయనకు తెలుగులో బ్రేక్ తెచ్చిన సినిమాగా తేనెటీగ. తర్వాత టాలీవుడ్లో 100కు పైగా సినిమాలకు పనిచేశాడు.


