సినిమా ఇండస్ట్రీలో పెళ్లి, విడాకులు లాంటి మాటలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. దీంతో నటీనటులందరూ ఇంతేనేమో అనేది చాలామంది నెటిజన్ల అభిప్రాయం. కానీ తెరపైనే కాదు రియల్ లైఫ్‌లోనూ తాము ఫెర్ఫెక్ట్ అనేలా కొందరు యాక్టర్స్ ఉంటారు. అలాంటి నటుడే షరీబ్ హష్మీ. ఈ పేరు చెబితే మీకు తెలియకపోవచ్చు గానీ 'ద ఫ్యామిలీ మ్యాన్' జేకే అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. నటుడిగా మనల్ని ఎంతగానో నవ్వించే ఇతడి జీవితంలో షాకయ్యే కష్టాలున్నాయని మీలో ఎంతమందికి తెలుసు?
షరీబ్ హష్మీది ముంబై. 2003లో నస్రీన్‌ని పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకునే టైంలో ఓ టీవీ ఛానెల్‌లో పనిచేసేవాడు. నటుడిగా ఛాన్సుల కోసం ప్రయత్నించేవాడు. కొన్నాళ్లకు ఉద్యోగం విడిచిపెట్టి పూర్తిగా ఇండస్ట్రీపైనే దృష్టి పెట్టాడు. అప్పటికే ఓ కొడుకు కూడా పుట్టాడు. దీంతో నస్రీన్.. కుటుంబ బాధ్యతల్ని తీసుకుంది. తన డబ్బులు, బంగారంతో పాటు ఇంటిని కూడా తాకట్టు పెట్టి మరీ భర్తని ప్రోత్సాహించింది. అలా 2008లో 'స్లమ్ డాగ్ మిలియనీర్'లో చిన్న పాత్రలో నటించే అవకాశం షరీబ్‌కి వచ్చింది. తర్వాత అటు సినిమాలు, ఇటు సీరియల్స్ చేస్తూ కెరీర్ పరంగా బిజీ అయ్యాడు. సరిగ్గా ఇలాంటి టైంలో షాకిచ్చే వార్త. భార్యకు ఓరల్(నోటి) క్యాన్సర్ అనే విషయం తెలిసి షరీబ్ గుండె బద్దలైంది.

ఏకంగా నాలుగు సర్జరీలు జరిగాయి. కీమో థెరపీ కూడా తీసుకోవాల్సి వచ్చింది. చికిత్స తీసుకున్న తర్వాత మనిషి ఎలా మారిపోతారనే విషయాన్ని డాక్టర్స్ చెబుతుంటే షరీబ్-నస్రీన్ గుండె ఆగినంత పనయ్యింది. అయినా సరే బలంగా నిలబడ్డారు. క్యాన్సర్‌ని జయించారు. అయితే క్యాన్సర్ కారణంగా సర్జరీలు చేసుకోవడంతో నస్రీన్ ముఖాకృతి పూర్తిగా మారిపోయింది. అయినా సరే భార్య వెన్నంటే షరీబ్ నిలబడ్డాడు. అలా 2022 తర్వాత నస్రీన్ పూర్తిగా క్యాన్సర్ నుంచి కోలుకుంది. ఇదంతా చూసిన నెటిజనం.. ఈ జంటని తెగ అభినందిస్తున్నారు. ఒకరికి ఒకరు తోడుగా నిలిచి విధినే గెలిచారు కదా అని మాట్లాడుకుంటున్నారు.
షరీబ్ విషయానికొస్తే.. సినిమాలు, సీరియల్స్ చాలానే చేసినప్పటికీ 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ ఇతడికి ఎక్కడలేని గుర్తింపు తీసుకొచ్చింది. శ్రీకాంత్ తివారీ (మనోజ్ బాజ్‌పాయ్)పక్కనే కనిపించే జేకే తల్పడే పాత్రలో షరీబ్ హష్మీ అదరగొట్టేశాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. యాక్టింగ్ సంగతి పక్కనబెడితే భార్యకు కష్టసుఖాల్లో తోడునీడలా నిలిచి రియల్ 'ఫ్యామిలీ మ్యాన్' అనిపించుకుంటున్నాడు.


