‘ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు చేయకపోవడం వల్ల తెలుగువారిని ఎంతగానో మిస్ అవుతున్నా.. కానీ నాకు తొలివిజయం అందించింది తెలుగు సినిమానే.. హైదరాబాద్‌లో ఉండి షూటింగ్ చేయాలని ఎంతోకొరికగా ఉంది.. ప్రస్తుతం కథలు వింటున్నా.. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నా’ అని ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ టాప్ సెలబ్రెటీలకు మేకప్ మెన్‌గా చేసిన కడాలి చక్రవర్తి ఆధ్వర్యంలో పంజాగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో అండ్ అకాడమీ’ని రకుల్ ప్రారంభించారు. తెలుగులో బాహుబలి వంటి సినిమా చేయాలని తన కోరికని తెలిపారు. తన తొలి చిత్రం నుంచి సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు అన్ని సినిమాలకూ తనకు మేకప్ చేసిన చక్రి మేకప్ అకాడమీ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తనకు తెలుగు భాష ఇంతగా రావడానికి కారణం కూడా ఆయనే అని అన్నారు. – సాక్షి, సిటీబ్యూరో


