నేడు ప్రపంచ రేడియో దినోత్సవం
వన్స్ అ పాన్ ఏ టైమ్ రేడియో అంటే... ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కాదు. మన కుటుంబసభ్యురాలు! ΄÷ద్దుటే సుప్రభాతంతో నిద్ర లేపి, ప్రపంచంలో, దేశంలో ఏ మూలన ఏం జరుగుతుందో చెప్పి, బుర్ర హీటెక్కి పోకుండా చల్లని పాటలు వినిపించి... ఒక్కటా రెండా... రేడియో అంటే అంతులేని అపురూపమైన జ్ఞాపకాల సంపద....
ఆకాశవాణి–రజని
మన ఆకాశవాణిని జనరంజకం చేసిన వారిలో బాలాంత్రపు రజనీకాంతరావు ఒకరు. ఆకాశవాణిలో స్వరకర్తగా, గీతరచయితగా, సంచాలకునిగా పలు బాధ్యతలు నిర్వహించారు. లలిత సంగీతాన్ని ఆకాశవాణి వేదికగా జనరంజకం చేశారు. 1947 ఆగస్ట్ 15 భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన అర్ధరాత్రి, ప్రధాని నెహ్రూ ప్రసంగం తరువాత రజని రచించి, స్వర పరిచిన ‘మాదీ స్వతంత్రదేశం’ ప్రసారం అయింది.
99%: ఆకాశవాణిగా ప్రసిద్ధమైన ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్) ప్రపంచంలో అతి పెద్ద ప్రసార సంస్థలలో ఒకటి. 23 భాషలలో, 179 మాండలికాలలో మన దేశంలోని 99 శాతం మందికి చేరువైంది.
ఆకాశవాణి – ఆధ్యాత్మికం – ఉషశ్రీ
రామాయణ, భారత, భాగవతాలను ఆకాశవాణి వేదికగా సామాన్యులకు చేరువ చేశారు ఉషశ్రీ. భగవద్గీత, సుందరకాండలను అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఆయన నిర్వహించిన ‘ధర్మసందేహాలు’ కార్యక్రమం చాలా జనాదరణ పొందింది. పౌరాణికాలకు సంబంధించి ఎంత జటిలమైన విషయాన్ని అయినా సులభంగా అర్థమయ్యేలా చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి.
1923: బాంబే రేడియో క్లబ్ కార్యక్రమాలతో 1923లో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. మొదటి న్యూస్ బులెటిన్ జనవరి 19, 1936లో ప్రసారం అయింది.
ఆకాశవాణి–మహానటి
మహానటి సావిత్రి సమర్పించిన జనరంజని ప్రత్యేక కార్యక్రమం 1979లో ఉగాది రోజున ప్రసారం అయింది.
సిగ్నేచర్ ట్యూన్ శివరంజని
శివరంజని రాగం ఆధారంగా వాల్టర్ కౌప్‌మన్ ఆల్ ఇండియా రేడియో సిగ్నేచర్ ట్యూన్‌ను స్వరపరిచారు. వయోలిన్‌పై వాయించారు.
జనం మెచ్చిన జనరంజని
శ్రోతలు కోరిన పాటల కార్యక్రమం ‘జనరంజని’ అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమాలలో ఒకటి. ఆదివారాలు, పండగ రోజుల్లో ప్రత్యేక జనరంజని
కార్యక్రమాలు ప్రసారమయ్యేవి.
బారిష్టర్ పార్వతీశం రాకతో రేడియో నవ్వింది!
మొక్క పాటి ప్రసిద్ధ హాస్య నవల ‘బారిస్టర్ పార్వతీశం’ ఆకాశవాణిలో అత్యంత ప్రజాదరణ పొందిన నాటకాల్లో ఒకటి.
రేడియోలో వేటూరి
విజయవాడ కేంద్రం ద్వారా ప్రసారమైన వేటూరి సంగీత రూపకం ‘సిరికాకొలను చిన్నది’ అద్భుతమైన ఆడియో నాటిక. ఈ సంగీతక రూపకానికి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించారు.
థీమ్ 2026
ఈ సంవత్సరం ‘వరల్డ్ రేడియో డే’ థీమ్...‘రేడియో అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: ఏఐ ఈజ్ ఏ టూల్, నాట్ ఏ వాయిస్’


