తమిళ చిత్ర పరిశ్రమలో మరో వారసురాలు కథానాయకిగా పరిచయం అవ్వడానికి సిద్ధం అవుతున్నారా అన్న ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. కోలీవుడ్ సక్సెస్‌ఫుల్ దంపతులుగా రాణిస్తున్న అతి కొద్ది జంటల్లో దర్శకుడు రాజకుమార్, దేవయాని. నటి దేవయాని గురించి పరిచయ వ్యాఖ్యలు అవసరం ఉండదు. తమిళంలోనే కాకుండా తెలుగు తదితర భాషల్లోనూ కథానాయకిగా రాణించారు. ఈమె దర్శకుడు రాజకుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు పేరు ఇనియ, చిన్న కూతురు పేరు ప్రియాంక. కాగా దర్శకుడు రాజకుమార్ అజిత్, పార్తీపన్, దేవయాని ప్రధాన పాత్రలు పోషించిన నీ వరువాయా ఎన్నా అనే సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించి గుర్తింపు పొందారు.
ఆ తరువాత కూడా కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆపై దర్శకుడిగా చిత్రాలు చేయకపోయినా నటిస్తున్నారు. ఈయన తన పెద్ద కూతురు ఇనియను కథానాయకిగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై ఆయన ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ తన పెద్ద కూతురు ఇనియను హీరోయిన్‌గా పరిచయం చేయనున్నట్లు చెప్పారు. అయితే అందులో నటుడు విజయ్ వారసుడు జెసన్ సంజయ్‌ను హీరోగా నటింపజేస్తానని చెప్పారు.
నటుడు విజయ్‌తో చిత్రం చేసే అవకాశం రాలేదు అనీ, ఆయన వారసుడితోనైనా చిత్రం చేస్తానని చెప్పారు. జెసన్ సంజయ్, ఇనియ జంటగా నటించే చిత్రం కథను రెడీ చేసినట్లు చెప్పారు. అది నీరులా ఎన్పా చిత్రానికి సీక్వెల్ అని రాజకుమార్ చెప్పారు. జెసన్ సంజయ్ ప్రస్తుతం దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. మరి రాజకుమార్ కల ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.


